అలతి అలతి మాటలతో, చక్కని నుడికారాలతో, సంస్కారవంతమైన భాషతో, సందర్భోచిత వ్యాఖ్యలతో భావయుక్త సామాజిక సత్యాలను సోషల్ మీడియాలో “ఒక మంచి మాట”తో ఎంతో మందికి చైతన్య స్ఫూర్తిని రగిలిస్తున్న సామాజిక చైతన్య కారుడు కొత్త శ్రీనివాస్ అలోచనలలో ప్రాణం పోసుకున్న చక్కని అక్షర సందేశాలతో, నవ్య రీతిలో రూపొందించిన ఈ నవ వత్సర “క్యాలెండర్” ప్రతి దినం మనల్ని కొత్త సందేశంతో, సరికొత్త చైతన్యంతో మేల్కొల్పుతుందని పలువురు సినీరంగ ప్రముఖులు, మేధావులు, రచయితలు, కవులు కొనియాడారు.
రొటీన్ క్యాలెండర్ లా కాకుండా చక్కని నీతి వాక్యాలతో, మంచి మాటలతో కొత్త తరహాలో శ్రీ కొత్త శ్రీనివాస్ రూపొందించిన సరికొత్త సంవత్సర “క్యాలెండర్” ను శుక్రవారం నగరంలోని బంజారాహిల్స్, సినీమాక్స్ లో కన్నుల పండువలా, ఉత్సవంలా జరిగిన కార్యక్రమంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రసిద్ధ సినీ దర్శకులు కె. రాఘవేంద్రరావు హాజరుకాగా, సభాదక్షులుగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యవహరించారు. ఇంకా విశిష్ట అతిథులుగా తెలుగు సినీరంగ దిగ్గజాలు ఏ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, ఎస్.వి కృష్ణారెడ్డి, శ్రీమతి పరుచూరి విజయలక్ష్మి గారు, పాల్గొన్నారు
ముందుగా సభాధ్యక్షులు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, కొత్త శ్రీనివాస్ పేరుకు తగ్గట్టే కొత్తగా ఆలోచిస్తారని, సరికొత్తని సందేశాలతో జనాలను మేల్కొల్పుతారని, ఈ క్యాలెండర్ ఆయన భావాలకు అద్దం లాంటిదని అన్నారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రసంగిస్తూ. శ్రీనివాస్ ఒక్కో మాట జీవన సత్యమని, క్యాలెండర్ లోని ప్రతి పేజీ సమకాలీన వాస్తవాలను ప్రతిబింబిస్తుంది అని కొనియాడారు.
క్యాలెండర్ అంటే తారీఖులు, దిన, వార, సమాచార దర్శిని మాత్రమే కాదు. అదో జీవన సర్వస్వ సారస్వమని మిత్రుడు కొత్త శ్రీనివాస్ నిరూపించారని ప్రశంసించి ఆశీర్వదించారు.
ఇంకా ప్రసంగించిన సినీ దర్శక దిగ్గజాలు కోదండరామిరెడ్డి, ఎస్.వి. కృష్ణారెడ్డి, కొత్త శ్రీనివాస్ క్యాలెండర్ చాలా సందేశాత్మకంగా ఉందని ప్రశంసించి, అభినందించారు.
చివరగా క్యాలెండర్ రూపకర్త కొత్త శ్రీనివాస్ భావయుక్త భావోద్వేగ ప్రసంగం చేశారు. బాల్యంలొనే తనకు గోరుముద్దలతో పాటే కష్టసుఖాల మధ్య అందుబాటులో ఉన్న ఆనందాలను ఆస్వాదిస్తూ జీవించడం నేర్పించి, జీవన సత్యాలను రంగరించి పెట్టిన తన తల్లిదండ్రులే తన ఆదిగురువులని సవినయంగా మనవి చేసుకున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఒక మంచిమాటను అందరితో పంచుకోవడం తనకలవాటని, కొన్నివేల మందికి చేరే తన మాటలతో, రచనలతో కొందరైనా ప్రేరణ పొందగలిగితే చాలని, సమాజంలో ఒక మంచి మార్పు కోసం, గత కొద్ది సంవత్సరాల నుండి ప్రతి కొత్త సంవత్సరానికి గ్రీటింగ్ కార్డ్కు బదులుగా మంచి మాటలు రాసిన ఈ క్యాలెండర్ను ఇవ్వడం ఒక సంప్రదాయంగా కొనసాగిస్తున్నానన్నారు. శ్రీనివాస్. తన జీవన పయనంలో నిరంతర సహచరి, సామాజిక సేవా తత్పరురాలు కొత్త కృష్ణవేణి, పిల్లలు కొత్త దీపక్ పటేల్, కొత్త సోనీ పటేల్ తనకు ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటారని భావోద్వేగంతో అన్నారు.
ఇంకా తన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన సినీ రంగ అతిరథ మహారథులకు, మహా రచయితలకు, సీనియర్ అధికారులకు, ప్రముఖులకు, మిత్రులకు.. మీడియా మిత్రులకు కొత్త శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.