HomeMovie Reviewsగుర్తుండిపోయే ప్రేమ కథ

గుర్తుండిపోయే ప్రేమ కథ

 

నటీనటులు – విజయ్ శంకర్, మౌర్యాని, నాగినీడు, రచ్చ రవి తదితరులు

సాంకేతిక నిపుణులు – నిర్మాత – పడ్డాన మన్మథరావు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం – వెంకటరమణ ఎస్. సంగీతం – సదాచంద్ర, సినిమాటోగ్రఫీ – జి. అమర్, నిర్మాణం – శివత్రి ఫిలింస్.

క్లుప్తంగా కథ

పచ్చని ప్రకృతి గల ఊరు దేవరకొండ. ఈ ఊరి పెద్ద సీతారామయ్య (నాగినీడు). పది మందికి సాయం చేసే మనసున్న వాడు. ఊరి ప్రజల కష్టాలను చూసి తండ్రితో పాటు బాధపడుతుంది ఆయన కూతురు దేవకి (మౌర్యాని). ఫైనాన్స్ వ్యాపారుల ఒత్తిడి నుంచి రైతులను కాపాడుతాడు సీతారామయ్య. ఈ క్రమంలో సీతారామయ్య మీద కోపంతో ఆయన కూతురు దేవకిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు వడ్డీ వ్యాపారులు. ఆ దాడి నుంచి దేవకిని కాపాడుతాడు ఆటో డ్రైవర్ విజయ్ (విజయ్ శంకర్). ఈ ఇద్దరూ బాల్య స్నేహితులు. ఒకరంటే మరొకరికి ఇష్టం. ఆ ఇష్టం పెరిగి ప్రేమగా మారుతుంది. అయితే ఆస్తీ అంతస్తుల తేడాలు వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకుండా చేస్తాయి. కూతురు ప్రేమకు ససేమీరా అని చెప్పిన తండ్రి సీతారామయ్య కూతురును ఇంట్లో నుంచి వెళ్లగొట్టేస్తాడు. ప్రేయసితో కలిసి బయటకొచ్చిన విజయ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వీరి జీవితాల్లో ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ.

ఎలా ఉందో చూద్దాం..

దేవరకొండలో విజయ్ ప్రేమ కథ హృద్యమైన ప్రేమ కథ. మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. కథ ప్రారంభంలో సరదాగా సాగుతూ వెళ్తుంది. విజయ్, దేవకి ప్రేమను వ్యక్తం చేసుకునే సీన్స్ ప్లెజంట్ గా ఉంటాయి. వీరి ప్రేమ పెద్దవాళ్లకు తెలిసినప్పటి నుంచి అసలు స్టోరీ ప్రారంభం అవుతుంది. దర్శకుడు అనుకుంటే ఈ సినిమాను మరో సూర్యవంశంలా చేసుకోవచ్చు. కానీ తను అనుకున్న స్టోరీకి, చెప్పాలనుకున్న పాయింట్ కు కట్టుబడి చిత్రాన్ని సహజంగా చిత్రీకరించాడు. ఎక్కడా కథను వదిలి సాము చేయలేదు. కథకు అవసరం ఉన్నంత వరకే కమర్షియల్ అంశాలను జోడిస్తూ వెళ్లాడు. ఫలితంగా సినిమా మొత్తం మన ముందే జరుగుతున్న ఓ కథలా అనిపిస్తుంది.

ఇలాంటి సహజమైన కథకు కొత్త హీరో విజయ్ శంకర్, ఇప్పటికే పేరున్న నాయిక మౌర్యాని అదనపు ఆకర్షణ అయ్యారు. దర్శకుడు వెంకటరమణ ఎస్. అనుకున్న కథను, క్యారెక్టర్లను తమలో చూపించారు. విజయ్ స్టామినా ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకుంటే, ప్రతిభ గల నటిగా మౌర్యాని నిరూపించుకుంది. ఈ జంట లవర్స్ మధ్య ఉండే బాండింగ్ ను తమ నటనలో చూపించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లాంటి టెక్నికల్ అంశాల్లో సినిమా చాలా స్ట్రాంగ్ గా రూపొందింది.

మన జీవితాల్లో జరిగే ఓ పాయింట్ ను దర్శకుడు ఈ ప్రేమ కథలో కీలక మలుపుగా ఉపయోగించుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి పాయింట్ తోనూ లవ్ స్టోరీ చేయొచ్చా అని అవాక్కయ్యేలా సినిమా సాగుతుంది. ఇక కొన్ని తప్పులకు ఫలితంగా దక్కే మూల్యం ఎంత తీవ్రంగా ఉంటుందో క్లైమాక్స్ లో చూస్తాం. ఇది చాలా మంది జీవితాలకు పాఠంగా మారుతుందని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరినీ కదలించే ఉద్వేగ పూరిత ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చూడగలుగుతాం. సరదాగా నవ్విస్తూ, ఇలాంటి గొప్ప కథను తెరపైకి తీసుకొచ్చింది దేవరకొండలో విజయ్ ప్రేమ కథ మూవీ.

రేటింగ్ 3/5

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES