బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘NBK109’ షూటింగ్ ప్రారంభం

147


నటసింహం నందమూరి బాలకృష్ణ తన అద్భుతమైన 49 ఏళ్ళ సినీ ప్రయాణంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు మరియు భారీ బ్లాక్‌బస్టర్ విజయాలకు పర్యాయపదంగా మారారు. తనదైన విలక్షణ శైలితో ఎన్నో గుర్తుండిపోయే అత్యంత శక్తివంతమైన పాత్రలకు ప్రాణం పోశారు.

నందమూరి బాలకృష్ణ తెరపై గర్జించినప్పుడల్లా, చిరకాలం నిలిచిపోయే బాక్సాఫీస్ రికార్డులు ఆయన సొంతమయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మరో భారీ యాక్షన్ చిత్రంతో రాబోతున్నారు.

ఇటీవలి సంవత్సరాలలో తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలు నిర్మిస్తూ, దూసుకుపోతున్న విజయవంతమైన నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ యాక్షన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించుకుంది.

బాబీ కొల్లి తన అద్భుతమైన విజువల్స్ మరియు ప్రధాన నటుల గొప్ప ప్రదర్శనకు ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో రక్త పాతానికి హామీ ఇస్తున్నారు.

‘NBK109’ చిత్రీకరణ ఈరోజు(నవంబర్ 8) నుంచి ప్రారంభమైనట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు.

ఇప్పటికే బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా విడుదలైన సృజనాత్మక పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి #NBK109 అనే టైటిల్ పెట్టారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.