HomeTelugu'బుట్ట బొమ్మ' ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది - దర్శకుడు శౌరి చంద్రశేఖర్...

‘బుట్ట బొమ్మ’ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది – దర్శకుడు శౌరి చంద్రశేఖర్ .టి .రమేష్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామాకి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ‘బుట్ట బొమ్మ’ ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. యువత ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మీ నేపథ్యం ఏంటి? మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
మాది గుంటూరు. కానీ పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. మాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. కానీ నాకు ముందు నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యుల సూచన మేరకు ముందు పీజీ పూర్తి చేసి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాను.

ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారా?
ముందుగా రామ్ గోపాల్ వర్మ గారికి చెందిన వర్మ కార్పొరేషన్ లో పనిచేశాను. ఆయన నిర్మించిన శూల్ అనే హిందీ ఫిల్మ్ చేశాను. ఆ చిత్రానికి ఈశ్వర్ నివాస్ దర్శకుడు. ఆయన దగ్గరే వరుసగా నాలుగు హిందీ సినిమాలకు వర్క్ చేశాను. ఆ తరువాత మా నాన్నగారు మరణించడంతో హైదరాబాద్ వచ్చేశాను. కొంతకాలానికి ఒక స్నేహితుడి ద్వారా సుకుమార్ గారు పరిచయమయ్యారు. ఆయన దగ్గర జగడం నుంచి పుష్ప సినిమా వరకు పని చేశాను.

సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? స్ఫూర్తి ఎవరు?
చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అది మా నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన ప్రతివారం ఏదో ఒక సినిమాకి తీసుకెళ్లేవారు. అలా చిన్నతనం నుంచే సినిమాల మీద ఇష్టం మొదలైంది. ఆయన పేరు చంద్రశేఖర్ ను నా పేరులో పెట్టుకున్నాను. ఆ పేరుని తెర మీద చూడాలనేది నా కోరిక.

‘బుట్టబొమ్మ’ ప్రయాణం ఎలా మొదలైంది?
లాక్ డౌన్ సమయంలో కప్పేల చిత్రాన్ని చూశాను. కథనం పరంగా చాలా నచ్చింది. కొన్ని చిత్రాలను రీమేక్ చేయగలం, కొన్ని చిత్రాలు చేయలేము. ఇది పూర్తిగా స్క్రిప్ట్ మీద ఆధారపడిన సినిమా. దీనిని మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి, రీమేక్ చేస్తే బాగుంటుందనే నమ్మకం కలిగింది.

మొదటి సినిమానే రీమేక్ ఎంచుకోవడానికి కారణమేంటి?
కథలో ఉన్న బలం. కథనం నన్ను బాగా ఆకట్టుకుంది. మలయాళ సినిమాలు అయ్యప్పనుమ్ కోషియం, కప్పేల ఈ రెండు చూసినప్పుడు తెలుగులో చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పటికే ఆ రీమేక్ హక్కులను సితార సంస్థ తీసుకొని, అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ను సాగర్ చంద్రతో ప్రకటించారు. కప్పేల రీమేక్ చేయబోతున్నారని తెలిసి, నేనే వారిని సంప్రదించాను. ఎడిటర్ నవీన్ నూలి గారి ద్వారా చినబాబు గారిని, వంశీ గారిని కలిశాను. కొన్ని చర్చల తర్వాత నేను చేయగలనని నమ్మి, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు.

నటీనటుల ఎంపిక ఎలా జరిగింది?
హీరోయిన్ పాత్ర చాలా అమాయకంగా, పల్లెటూరి అమ్మాయిలా ఉండాలి. గౌతమ్ మీనన్ గారి క్వీన్ వెబ్ సిరీస్ లో అనిఖా సురేంద్రన్ ను చూసినప్పుడు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. అర్జున్ దాస్ ఎంపిక మాత్రం వంశీ గారి సూచన మేరకు జరిగింది. సూర్య పేరును చినబాబు గారు, వంశీ గారు ఇద్దరూ సూచించారు. ఆడిషన్ చేశాక ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడు అనిపించి ఎంపిక చేశాం.

తెలుగు కోసం ఎలాంటి మార్పులు చేశారు?
మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ఫస్టాఫ్ లో కీలక మార్పులు చేయడం జరిగింది. కామెడీ, ఎమోషన్స్ మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం. ఫస్టాఫ్ లో కథనం పరంగా ఒక పెద్ద మార్పు కూడా చేశాం. అది చూస్తే ఆ డైరెక్టర్ గారు కూడా ఈ ఆలోచన మనకు వస్తే బాగుండేది అనుకుంటారు అనిపిస్తుంది.

సినిమాలోని మూడు ప్రధాన పాత్రల్లో మీకు ఏది బాగా నచ్చింది?
ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించిన ముగ్గురికీ ఖచ్చితంగా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. మూడు పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

బుట్టబొమ్మ టైటిల్ వంశీ గారు సూచించారా?
సినిమాలోనే ఒక కాన్సెప్ట్ రన్ అవుతుంది. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది అనుకున్నప్పుడు అప్పటికే ‘బుట్టబొమ్మ’ సాంగ్ బాగా పాపులర్ కావడంతో అదే టైటిల్ పెడితే బాగుంటుందని వంశీ గారు సూచించారు. అలా ఈ టైటిల్ ఖరారైంది.

ఈ మధ్య రొమాంటిక్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ లభించడం లేదు.. రిస్క్ అనిపించడం లేదా?
లేదండీ.. దానిని నేను నమ్మను. ఏ సినిమా అయినా జోనర్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించగలిగేలా తీస్తే.. ఖచ్చితంగా ఆదరణ పొందుతుందనే నమ్మకంగా ఉంది. చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఫైనల్ గా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే విజయం సాధిస్తుంది. ఈ విషయం చాలాసార్లు రుజువైంది.

సంగీతం గురించి చెప్పండి?
ఈ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యముంది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చాయి. గోపీసుందర్ గారు ఒక పాట, నేపథ్య సంగీతం అందించారు. స్వీకర్‌ అగస్తి గారు రెండు పాటలు స్వరపరిచారు. ఇప్పటికే విడుదల చేసిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

మీ టీమ్ లేదా సన్నిహితులు ఎవరైనా ఈ సినిమా చూశారా? ఎలాంటి ప్రశంసలు వచ్చాయి?
చినబాబు గారు ఎంతో మెచ్చుకున్నారు. ఆయన ఇచ్చిన ప్రశంసలు మాటల్లో చెప్పలేను. త్రివిక్రమ్ గారు కూడా సినిమా చూసి చాలా బాగుంది అన్నారు.

భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్నారు?.
కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి సినిమా యాక్షన్ జోనర్ లో చేయాలని ఉంది.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES