విబి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్‌టైన్‌మెంట్ విష్ణు బొప్పన ప్రతి ఏటా లాగే ఈఏడాది కూడా సినిమా అవార్డులు అందించారు. అలాంటి అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులకు టెక్నీషియన్లను ప్రోత్సాహాన్నందిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు ఇప్పుడు గత రెండు ఏళ్ళగా నుంచి వెండి తెర అవార్డులను కూడా అందించడం విశేషం. ఈ సంవత్సరం ఇద్దరు సీనియర్ అలనాటి హీరోయిన్లకు ప్రధాన్యతనిస్తూ ఒకరికి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును, మరొకరికి లెజండరీ అవార్డును అందించారు. ఈ కార్యక్రమాన్ని శిల్పకళావేదికలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో…
సంస్థ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ… ‘‘ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గత రెండేళ్ళగా వెండితెర అవార్డులను అందిస్తున్నాను. నాకు సపోర్ట్ అందిస్తున్న శతాబ్ధిటౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నాకు తోడుగా ఉన్నారు కాబట్టే నేను ఈ కార్యక్రమాలను చేస్తున్నాను..’’ అని అన్నారు. అలాగే ఈ సంవత్సరం లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అమ్మ జమునగారికి, లెజండరీ అవార్డును జయసుధగారికి అందిస్తున్నాం. ఇంకా మరిన్ని అవార్డులు కూడా ఇక్కడ అందిస్తున్నాము. నా మాట మీద గౌరవంతో ఇక్కడకు విచ్చేసిన మహామహులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
జమున మాట్లాడుతూ… మా విష్ణుగారు నన్ను ప్రత్యేకించి గౌరవించి నాకు ఈ అవార్డును ఇస్తున్నందుకు ఆయనకు ముందుకు నా థ్యాంక్స్. నా కూతురు జయసుధకి పండంటికాపురం చిత్రంలో పన్నెండేళ్ళ పిల్ల నా కూతురుగా అందులో నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
జయసుధ మాట్లాడుతూ… వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా ఆ దేవుడికి నా కృతజ్ఞతలు. పన్నెండేళ్ళ వయసులో పండింటి కాపురం చిత్రంలో నేను జమునమ్మకు కూతురుగా నటించాను. మళ్ళీ తిరిగి నలభై ఏళ్ళ తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకుకోవడం చాలా గర్వంగా ఉంది.