HomeTeluguమహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్ 'గుంటూరు కారం' ట్రైలర్ భారీ ప్రకంపనలు...

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్ ‘గుంటూరు కారం’ ట్రైలర్ భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది!


క్లాస్, మాస్, ఫ్యామిలీ లేదా యూత్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగల, అన్ని వర్గాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అరుదైన స్టార్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అదేవిధంగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను అందిస్తూ, మాస్ ప్రేక్షకుల నుండి కూడా అదేస్థాయిలో ప్రశంసలు పొంది ఎంతో ఖ్యాతిని సంపాదించారు. వీరిద్దరూ కలిసి ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్‌లను అందించారు.

ఇప్పుడు, వారు 14 సంవత్సరాల విరామం తర్వాత ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు)కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ కోసం చేతులు కలిపారు. అన్ని కమర్షియల్ వాల్యూస్ తో పూర్తి విభిన్న చిత్రాన్ని అందించాలని వారు నిర్ణయించుకున్నారు. అదే ‘గుంటూరు కారం’.

గుంటూరుకు చెందిన రమణగా మహేష్ బాబు తన కోసం రాసిన మాస్ పాత్రలో తనదైన శైలిలో ఒదిగిపోయారు. ఆయన పాత్రను తీరుని తెలుపుతూ విడుదల చేసిన గ్లింప్స్ ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్రబృందం థియేట్రికల్ ట్రైలర్‌ను అట్టహాసంగా విడుదల చేసింది.

మహేష్ బాబు డైలాగ్స్, ఆయన యాటిట్యూడ్, ఆయన ఎనర్జీ అన్నీ కూడా ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా ఉన్నాయి. దాదాపుగా మహేష్ శైలి ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి స్నేహపూర్వక శైలిని, మాస్ పాత్రలలో బాడీ లాంగ్వేజ్‌ని గుర్తు చేస్తుంది.

సంక్రాంతికి విడుదల కానున్నందున, థియేటర్లలో పండుగ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూసే అన్ని అంశాలను మేకర్స్ జోడించినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం ట్రైలర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ట్రైలర్ లోని “చూడగానే మజా వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఈల వేయాలి అనిపిస్తుంది!” అనే సంభాషణ కంటెంట్ మరియు ప్రెజెంటేషన్‌కు సరిగ్గా సరిపోయేలా ఉంది.

అనేక యాక్షన్ సన్నివేశాలు, మహేష్ బాబు ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలను తను పలికిన విధానం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తాయి.

యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబుతో ఆమె డ్యాన్సులు, కెమిస్ట్రీ కళ్లు చెదిరేలా ఉన్నాయి. యువ అందాల తార మీనాక్షి చౌదరి కూడా ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తోంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్‌లో వారు కనిపించిన సన్నివేశాలు సినిమాలో బలమైన ఎమోషనల్ కోర్ ఉందని తెలియజేస్తున్నాయి.

ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచింది. సినిమాటోగ్రాఫర్‌ మనోజ్ పరమహంస విజువల్స్ మరియు ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు కూడా కాంబినేషన్ హైప్, కథకు తగ్గట్టుగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గుంటూరు కారం ట్రైలర్ ఈ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పండుగ వినోదాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES