అచ్చ తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల పుట్టిన రోజు ఈ ఏడాది ఎంతో స్పెషల్

238


టాలీవుడ్ పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు కొరవడిన సమయంలో అందం, అభినయంతో తన నటనాప్రతిభను కనబరుస్తూ ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకున్న అచ్చతెలుగు కుందనపు బొమ్మ హీరోయిన్ అనన్య నాగళ్ల. చేసింది తక్కువ సినిమాలే అయినా విశేష ప్రేక్షకాదరణను సంపాదించుకుంది. అంతేకాదు అనన్యకు సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. దాదాపు తన ఇనిస్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ తో నిత్యం తన ఇష్టాఇష్టాలతో పాటు అదిరిపోయే పిక్స్ తో, రీల్స్ తో అలరిస్తుంది. పరిశ్రమకు వచ్చి కొంత కాలమే అయిన తన డ్రీమ్ కమ్ ట్రూ అయిన పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్న ఈ అపురూప పారిజాతం అనన్య నాగళ్ల పుట్టిన రోజు నేడు.

తన పుట్టిన రోజు సందర్భంగా తన గురించి, అలాగే తాను చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పుట్టి పెరిగిన ఈమె తన కుటుంబంతో హైదరాబాద్ వచ్చేసింది. ఇబ్రహీంపట్నంలోని రాజ మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో తన బి. టెక్ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సినిమాలపై మక్కువతో యాక్టింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంది. అవకాశాల కోసం ప్రయాత్నాలు చేస్తునే షాదీ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఈ షార్ట్ ఫిల్మ్ తో తన నటనకు మంచి స్పందన వచ్చింది. అంతే కాదు ఈ షార్ట్ ఫిల్మ్ తో ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకొని ఫేమస్ అయింది. అదే సమయంలో తెలంగాణ చేనేత నేపథ్యంలో వచ్చిన చింతకింది మల్లేష్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ చిత్రంలో తన నటనకు ప్రేక్షకులతో పాటు సినీ పెద్దలే ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్లేబ్యాక్ చిత్రంలో నటించింది. ఆ తరువాత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ లో దివ్యా నాయక్ పాత్రలో అలరించింది. ఈ చిత్రంలో తన నటకు మంచి మార్కులు వేసుకుంది. ఆ తరువాత నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాలో ఒక చిన్న పాత్ర అయనా సరే మెప్పించింది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాలో అనసూయ పాత్రలో తన అభినయం చూపించింది. అలాగే మళ్లీ పెళ్లి చిత్రంలో తన గ్లామర్ ను చూపించింది.

ప్రస్తుతం అనన్య చేతులో భారీగా సినిమా ఆఫర్లు ఉన్నాయి. జీ5 సమర్పణలో వస్తున్న ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో బహిష్కరణ చిత్రం, అర్జున్ కార్తిక్ దర్శకత్వంలో లేచింది మహిళా లోకం, అన్వేషీ, నవాబు, తంత్ర సినిమాలతో కలిపి మొత్తం 7 సినిమాల్లో హీరోయన్ గా నటిస్తుంది. ఈ సంవత్సరం అనన్య నాగళ్ల మరిన్ని మంచి చిత్రాలలో నటించాలని కోరుకుంటూ ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ కు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.