‘పిండం’ చిత్రీకరణ సమయంలో వింత అనుభవాలు.. ఒక్కరే కూర్చొని ఈ సినిమా చూడలేరు: చిత్ర బృందం

168


సినిమా చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ముఖ్యంగా విభిన్న కథాంశంతో రూపొందే చిత్రాల పట్ల ఈ ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత ఎక్కువ ఉంటుంది. అప్పట్లో మేకింగ్ వీడియో విడుదల చేసే ట్రెండ్ చిత్ర పరిశ్రమలో ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ తగ్గుతూ వచ్చింది. ఈమధ్య చిత్ర బృందాలు మేకింగ్ వీడియోలు విడుదల చేయడంలేదు. అయితే ఇప్పుడు ‘పిండం’ చిత్ర బృందం ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. పిండం కథ ఎలా ఉండబోతుంది, చిత్రీకరణ ఎలా సాగింది అనే విషయాలను తెలుపుతూ ‘బిహైండ్ ది సీన్స్’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీపావళి కానుకగా చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి సినిమా ఎలా ఉండబోతుంది, చిత్రీకరణ ఎలా సాగింది అని వివరించడం ఆకట్టుకుంది. వీడియోలో మేకింగ్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూపించారు.

కథానాయకుడు శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, “పిండం అనేది స్ట్రయిట్, క్లియర్, సీరియస్ హారర్ జానర్. మామూలుగా కొన్ని హారర్ సినిమాల్లో సాంగ్స్, కామెడీ ట్రాక్ లు ఉంటాయి. అలాంటివేం లేకుండా మిమ్మల్ని భయపెట్టడం కోసం తీసిన స్ట్రయిట్ హారర్ ఫిల్మ్ ఇది. థియేటర్లలో మీకు ఖచ్చితంగా ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది.” అన్నారు.

దర్శకుడు సాయికిరణ్ దైదా మాట్లాడుతూ, “ఒక నిజ జీవిత ఘటనను తీసుకొని నేను, నా సహ రచయిత కవి సిద్ధార్థ గారు కలిసి అద్భుతమైన కథగా మలిచాము. నేను దెయ్యాలు గురించి చెప్తే భయపడే మనిషిని కాదు కానీ, ఈ కథ నన్ను కొంచెం భయపెట్టింది. చిత్రీకరణ సమయంలో మాకు కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి. సినిమా కోసం ఒక పాపను ఎంపిక చేస్తే వాళ్ళ అమ్మ చనిపోవడం, లైట్ మ్యాన్ కింద పడటం సహా పలు సంఘటనలు జరిగాయి. అవన్నీ గుర్తొచ్చి ఒక్కోసారి రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు. ఒకసారి అమావాస్య అని తెలియకుండా అర్ధరాత్రి షూట్ ప్లాన్ చేశాం. షూట్ చేస్తుండగా అమావాస్య అని తెలిసి, అప్పటివరకు జరిగిన ఘటనల దృష్ట్యా అందరం బొట్లు పెట్టుకొని షూట్ చేశాం. ఈ సినిమాలో ఉన్నన్ని హారర్ బ్లాక్స్ మరే సినిమాలో ఉండవు. ఖచ్చితంగా భయపడతారు. ఒక్కరే కూర్చొని ఈ సినిమా చూడలేరు” అన్నారు.

‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

తారాగణం: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు
కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
డీఓపీ: సతీష్ మనోహర్
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
ఆర్ట్: విష్ణు నాయర్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ
పోరాటాలు: జష్వ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ. వి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ: ఆరోహి దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి