మరోసారి గోవా సీఎంతో సురేష్ కొండేటి భేటీ… అంగరగవైభవంగా సంతోషం వేడుకలకు సర్వం సిద్ధం

163

సినీ జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా నటుడిగా సంతోషం అనే మ్యాగజైన్ అధినేతగా పలు భిన్నమైన పాత్రలు పోషిస్తూ ముందుకు వెళుతున్నారు సురేష్ కొండేటి. సంతోషం అవార్డుల పేరుతో సినీ రంగంలో సత్తా చాటుతున్న నటీనటులు టెక్నీషియన్లను సాదరంగా గౌరవిస్తూ ప్రతి ఏటా అవార్డుల వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటికీ ఈ అవార్డులు అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది మొట్టమొదటిసారిగా గోవాలో ఈ అవార్డుల వేడుక నిర్వహించాలని నిర్ణయం తీసుకుని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ పాండురంగ్ సావంత్ తో గతంలో భేటీ అయి తన నిర్ణయాన్ని సురేష్ కొండేటి అధికారికంగా ప్రకటించారు.

అయితే మరోసారి ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహణ గురించి గోవా ముఖ్యమంత్రితో మరోసారి సురేష్ కొండేటి ఈనెల 11వ తేదీ అనగా శనివారం భేటీ అయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని గోవా ముఖ్యమంత్రి వెల్లడించారు. సురేష్ కొండేటి 21 సంవత్సరాలుగా ఇలా అవార్డులు ఇస్తూ రావడం చాలా గొప్ప విషయమని, ఎంతో పేరు మోసిన సంస్థలకే సాధ్యం కానీ అరుదైన విషయాన్ని ఆయన ఒక్కడిగా ముందుకు తీసుకు వెళుతున్నారని అభినందించారు. ఈ ఏడాది గోవాలో జరగబోతున్న సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2023 కార్యక్రమానికి నేను కూడా వస్తున్నాను అలాగే గోవా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సురేష్ కొండేటికి గోవా ముఖ్యమంత్రి అభయం ఇచ్చారు. సంతోషం అవార్డులు అందుకోబోతున్న ప్రతి ఒక్కరికి సాదరంగా గోవా ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలుకుతున్నామని సంతోషం అవార్డులు తొలిసారిగా గోవాలో జరగటం తనకు ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ గోవాలో త్వరలోనే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగబోతుందని అది పూర్తయిన వెంటనే సంతోషం ఫిలిం అవార్డ్స్ కూడా ఘనంగా జరగబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన దాదాపు అన్ని పనులు పూర్తికావచ్చాయని ఆయన అన్నారు. అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని జరిపేందుకు గోవా ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిందని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమోద్ పాండురంగ్ సావంత్ గారికి దయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని సురేష్ కొండేటి అన్నారు.