HomeTeluguకిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' నుంచి శృంగార గీతం 'సమ్మోహనుడా' విడుదల

కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ నుంచి శృంగార గీతం ‘సమ్మోహనుడా’ విడుదల

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి, ‘నాలో నేనే లేను’ పాటకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది.

‘సమ్మోహనుడా’ లిరికల్ వీడియోని చిత్ర బృందం గురువారం ఉదయం విడుదల చేసింది. నాయకానాయికలపై చిత్రీకరించిన శృంగార గీతమిది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. నాయకానాయికలకు ఒకరిపై ఒకరికున్న మోహాన్ని తెలియజేస్తూ నిప్పు, నీరు నేపథ్యంలో పాటను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటోంది. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లేకా అద్భుతంగా ఉంది. ఇక ఈ పాటకి గీత రచయిత రాంబాబు గోసాలతో కలిసి దర్శకుడు రత్నం కృష్ణ సాహిత్యం అందించడం విశేషం. పాట సందర్భానికి తగ్గట్టుగా వారు అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. “సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా. ఇష్టసఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా” అంటూ నాయిక తన ప్రియుడైన కథానాయకుడికి తన దేహాన్ని అర్పిస్తానని పాడుతున్నట్టుగా పాట ప్రారంభమైంది. “సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా. మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నవుతా” వంటి పంక్తులలో పాట ఎంతో అందంగా సాగింది. ఇక ఈ పాటని ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ ఆలపించారు. ఆమె తన గాత్రంతో పాటకి మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఈ పాటకి శిరీష్ నృత్య రీతులు సమకూర్చారు. మొత్తానికి ‘సమ్మోహనుడా’ పాట కూడా మొదటి పాట ‘నాలో నేనే లేను’ తరహాలోనే విశేష ఆదరణ పొందేలా ఉంది.

‘సమ్మోహనుడా’ పాట విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ.. “హైదరాబాద్ లో వేసిన నాలుగు ప్రత్యేక సెట్స్ లో ఈ పాటను చిత్రీకరించాము. పాటలో ముంబై, రష్యా కి చెందిన డ్యాన్సర్స్ కనిపిస్తారు. శిరీష్ అనే కొత్త కొరియోగ్రాఫర్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలోని ఐదు పాటలకూ ఆయనే నృత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ మాస్టర్. మొత్తం టీమ్ అంతా కూడా ప్రతిభావంతులైన యువతే. శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ పాటకి నేను, రాంబాబు గోసాల కలిసి సాహిత్యం అందించాం” అన్నారు.

వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర నిర్మాతలు తెలిపారు. కథానాయకుడు కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు, ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటం తో పాటు, పూర్తి స్థాయి వినోద భరిత కథాచిత్రమిది. సగటు సినిమా ప్రేక్షకుడు మనసారా వినోదాన్ని ఆస్వాదించే చిత్రమవుతుంది. ఇందుకు చిత్ర కథ, నాయకా నాయికల పాత్రలు, కథానుగుణంగా సాగే ఇతర ప్రధాన తారాగణం పాత్రలు, సంభాషణలు, సంగీతం ఇలా అన్నీ సమపాళ్లలో చక్కగా కుదిరిన ఓ మంచి చిత్రం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్

రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES