ఓ పిట్టకథ’ పెద్ద హిట్ కావాలి – మెగాస్టార్ చిరంజీవి

1059

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు . చెందు ముద్దు దర్శకుడు. ఈ నెల 6న చిత్రం విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘హీరోగా పరిచయమవుతున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌, విశ్వంత్‌, నిత్యాకి మంచి భవిష్యత్తు ఉండాలి. భవన నిర్మాణ రంగంలో ఆనందప్రసాద్‌గారు ఎంత సక్సెస్‌ అయ్యారో… చిత్రసీమలోనూ అంతే సక్సెస్‌ కావాలి.చిన్న చిత్రాలు బావుంటే ఆదరించే రోజులివి. అయితే… థియేటర్లు దొరకడం లేదనే సమస్య ఉంది. ఇటువంటి చిత్రాలకు థియేటర్లు ఇవ్వాలనీ, ప్రోత్సహించాలనీ కోరుకుంటున్నా. చిన్న చిత్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు చిత్రసీమ బాగు, మెరుగుదల కోసం నేను, నాగార్జున, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇక… ‘శంకర్‌దాదా’ టైమ్‌లో కేర్‌వ్యాన్‌లు లేవు. ఇప్పుడొచ్చాయి. వాటిని అవసరాలకు వాడుకోవాలి తప్ప, లగ్జరీకి కాదు. కేర్‌వ్యాన్‌లో కూర్చున్న ఆర్టిస్టును పిలవడానికి సహాయ దర్శకుడి జీవితం సరిపోతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. నేను మేకప్‌, దుస్తులు మార్చుకోవడానికి మాత్రమే కేర్‌వ్యాన్‌ ఉపయోగిస్తా. లేదంటే లొకేషన్‌లో ఉంటా. హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు లొకేషన్‌లో ఉంటే… పని బాధ్యతగా, త్వరగా జరుగుతుంది. ఆర్టిస్టులు సెట్‌లో ఉండడం అవమానంగా భావించకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సెట్‌లో ఉండాలి. అప్పుడు 140 రోజుల్లో పూర్తి కావాల్సిన సినిమా, వంద రోజుల్లో పూర్తవుతుంది. భారీ బడ్జెట్‌ చిత్రాలు వంద రోజుల్లో పూర్తి చేస్తే… నిర్మాతలు లాభాల్లో ఉంటారు. తెలుగు చిత్రసీమలో సినిమా చేస్తే… ఎవరికీ నష్టాలు రావని ఇతర చిత్రసీమల్లో అనుకోవాలి. నిర్మాతల సంతోషం చూడాలి. అలాంటి పరిస్థితి వస్తుందనే నమ్మకం నాకుంది ’’ అన్నారు.

ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ “కొత్తవాళ్లతో మేం చేసిన ప్రయత్నానికి నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవిగారికి రుణపడి ఉంటాం. చిత్రసీమలో ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా ఉండి పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.అలాగే మా అన్ని చిత్రాల లాగే ‘ఓ పిట్ట కథ’ కూడా అన్ని విధాలుగా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం” అన్నారు.

డైరెక్టర్ చెందు ముద్దు మాట్లాడుతూ “ఎపుడు అయినా అందరిని పొగుడుకోవచ్చు కానీ కృతజ్ఞత చెప్పే అవకాశం ఎపుడో కానీ రాదు, ముందుగా మా బ్రహ్మజీ గారికి చెప్పుకోవాలి. నేను మూడు సంవత్సరాల క్రితం నిజం గా ఇది ఓ పిట్టా కథ లాగా పది నిమిషాలే ఉంది. 2 గంటలకి సరిపడే స్క్రిప్ట్ కాదు, కానీ నమ్మారు. నా బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకున్నా, భవ్య క్రియేషన్స్ లాంటి ఒక వెదికానిచ్చారు ఆనంద్ ప్రసాద్ గారు అన్నే రవి గారు. అన్నే రవి గారు ఒకే ఒక మాట చెప్పారు, నువ్వు ఈ సినిమా సక్సెస్ కొడితే చాలు,   అన్నారు.

 .

డైరెక్టర్ సాగర్ చంద్ర మాట్లాడుతూ “బ్రహ్మజీ గారు చాల స్వీట్ పర్సన్. విస్వంత్, సంజయ్ కి అల్ ది బెస్ట్. చెందు నాకు ఎప్పటినుండో స్నేహితుడు, చాలా మంచి సినిమా తీస్తాడు అని నాకు చాలా నమ్మకం ఉంది. అలానే సునీల్ విజువల్స్ చాల అందంగా వున్నాయి. భవ్య ఆనంద ప్రసాద్ గారికి అన్నే రవి గారికి మరియు టీం అంతటికి ఆల్ ది బెస్ట్” అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకులు చంద్ర శేఖర్ యేలేటి, కెమెరామాన్ సునీల్‌ కుమార్‌ యన్‌ తదితరులతో పాటు చిత్రబృందం పాల్గొంది.

జర్నలిస్ట్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

ఇటీవల మరణించిన సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు కుటుంబానికి భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనందప్రసాద్‌ ఆర్థిక సహాయం అందించారు. హీరో చిరంజీవి చేతుల మీదుగా పసుపులేటి తనయుడు కల్యాణ్‌ నాగ చిరంజీవికి రెండు లక్షల రూపాయల చెక్‌ అందజేశారు.