విడుదలకు సిద్ధమైన కోనాపురంలో జరిగిన కథ

505

అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కోనాపురంలో జరిగిన కథ. ఈ చిత్రాన్ని పోషం మట్టారెడ్డి సమర్పణలో అనూష సినిమా పతాకంపై మచ్చ వెంకట్ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్ కుమార్ నిర్మిస్తున్నారు. కె బి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కోనాపురంలో జరిగిన కథ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ ఫిలించాంబర్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ అతిథులుగా పాల్గొన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..సినిమా ట్రైలర్ చూస్తుంటే వీళ్లు నిజాయితీగా, కష్టపడి సినిమా చేసినట్లు తెలుస్తోంది. ఈ శుక్రవారం చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో మంచి కథతో వచ్చిన సినిమానే విజయం సాధిస్తుంది. అలా ఆదరణ పొందే సినిమాల్లో కోనాపురంలో జరిగిన కథ ఉండాలని కోరుకుంటున్నా. నేను సినిమా చేసేందుకు హీరోల కోసం వెతుకుతున్నా. మా బడ్జెట్ కు తగిన హీరోలు దొరకడం లేదు. చిన్న చిత్రాల ద్వారానే కొత్త హీరోలు వచ్చే అవకాశముంది. అన్నారు.

దర్శకుడు కె బి కృష్ణ మాట్లాడుతూ…టైటిల్ లో ఉన్నట్లు ఇది కోనాపురంలో జరిగే కథ కాదు. రెండు ఊర్ల మధ్య గొడవల నేపథ్యంలో మర్డర్ మిస్టరీగా సాగుతుంది. కథలో ఎవరు ఎవర్ని చంపుతున్నారు అనేది ఆసక్తికరంగా, ఉత్కంఠ కలిగించేలా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. అన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..చాలా రోజులుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాం. వాస్తవికతతో ఉండే సినిమాలంటే ఇష్టపడతాను. అలాంటి కథతో చేస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాను. అన్నారు.

నిర్మాత పల్లె వినయ్ కుమార్ మాట్లాడుతూ..ఈ సినిమా మా నాలుగేళ్ల కల. గ్రామీణ ప్రాంతంలో కథ జరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న రెండు ఊర్లు ఓ అనూహ్య ఘటనతో ఉలిక్కి పడతాయి. ఆ ఘటనలు ఏంటి, ఎవరు చేస్తున్నారు అనేది ఆద్యంతం ఉత్కంఠగా దర్శకుడు తెరకెక్కించారు. యువతరం మెచ్చే వాణిజ్య అంశాలతో పాటు మంచి సందేశాన్ని జోడించాం. అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం – సత్య కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఈరుపుల శ్రీకాంత్, సాహిత్యం – పూర్ణాచారి.