బంగారు కొండ మన “సిరికొండ” – హోం మంత్రి మొహమూద్ అలీ

302


నిజాయితీ, నిబద్ధత గల గొప్ప రాజకీయవేత్త, మనసున్న బంగారు కొండ మన సిరికొండ మధుసూధనాచారి అని తెలంగాణ హోం శాఖామాత్యులు జనాబ్ మహ్మద్ మొహమూద్ అలీ అభినందించారు. తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్ గా ఆయన చరిత్ర లో నిలిచిపోతారని కొనియాడారు.

నూతన సంవత్సర శుభారంభం… జనవరి 1న హైదరాబాద్ రవీంద్రభారతి లో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యం లో ఇటీవల ఎమ్మెల్సీ గా నియమితులయిన శ్రీ సిరికొండ మధుసూధనాచారి ని మహాత్మా గాంధీ శాంతి పురస్కారం, జీవన సాఫల్య వెండి కిరీట పురస్కారం తో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ మహ్మద్ మొహమూద్ అలీ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న సాహితీవేత్త మధుసూధనాచారి శాసన సభ ను అద్భుతంగా నడిపించారని, అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చి తెలంగాణ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

పురస్కార గ్రహీత శ్రీ సిరికొండ మధుసూధనాచారి స్పందిస్తూ, వినయం విధేయత ను మాత్రమే నమ్ముకున్నానని, ఎక్కడా రాజీ పడలేదని, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండటం మాత్రమే తనకు తెలుసునని చెప్పుకున్నారు.

ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా, శ్రీ దైవజ్ఞ శర్మ, డాక్టర్ మహ్మద్ రఫీ, డాక్టర్ కుసుమ భోగరాజు, శ్రీమతి ఎం.అమ్మణి, డాక్టర్ ఓ.నాగేశ్వరరావు, శ్రీ రావెల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ టి.జితేందర్ ప్రత్యేకంగా రూపొందించిన నూతన సంవత్సర కేలండర్ ను అతిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

శృతిలయ సంస్థ చైర్మన్ డాక్టర్ బి.భీం రెడ్డి మాట్లాడుతూ, ఇక నుంచి శృతిలయ సంస్థ లో పాడే గాయకులకు నెలవారీ జీతాలు ఇవ్వనున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

నవరస గాయని శ్రీమతి ఆమని ఆధ్వర్యం లో జరిగిన సినీ సుస్వరాల సంగీత విభావరి లో శ్రీ చంద్రతేజ, శ్రీ పి.సుభాష్, శ్రీ బి.శ్రీనివాస్, శ్రీమతి వి.కె.దుర్గ, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి తదితరులు మధురమైన పాటలతో అలరించారు.

ఫోటోలు : శ్రీ గిరి