గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ (GIFT)’ ఉచిత శిక్షణా శిబిరం

787

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ‘గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ (GIFT)’ ఆధ్వర్యంలో నటన, దర్శకత్వం, స్క్రిప్టు రైటింగ్ మరియు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ లో ఆసక్తి గల యువతకు, ఉచిత శిక్షణా శిబిరం నిర్వహించడం, నిజంగా యువతకు ఒక గొప్ప సదవకాశమని, దూరదర్శన్ రిటైర్డ్ డైరెక్టర్ శ్రీ విజయ భగవాన్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సహజ హావభావాలతో చక్కటి నటనా ప్రతిభ కనబరుస్తూ ప్రతి పాత్రకు న్యాయం చేయాలని అందుకు సమాజంలో నుంచి పరిశీలన ద్వారా ఎంతో నేర్చుకోవచ్చునని అన్నారు.

ఈ రోజు ఖైరతాబాద్ లోని సంస్థ కార్యాలయం, పూజా అపార్ట్ మెంట్ లో ఉచిత శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తూ ఆయన సినిమా, టీవీ రంగాలలో వివిధ ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఎడిటింగ్, కెమెరా,డబ్బింగ్, న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, న్యూస్ రిపోర్టింగ్ వంటి విభాగాలలో కూడా శిక్షణ ఇవ్వడానికి సంస్థ ముందుకు రావాలని కోరారు.

సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల విజేత, దూరదర్శన్, అల్ ఇండియా రేడియో, మాజీ న్యూస్ రీడర్, సీనియర్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ దూరదర్శన్ డైరెక్టర్ సూచించిన విధంగా వచ్చే నెల నుంచి ఆయా విభాగాలలో శిక్షణ ఇస్తామని, ప్రస్తుత ఉచిత శిక్షణా శిబిరంలో ప్రతిభ కనబరిచిన వారికి, తమ సంస్థ నిర్మించే సీరియల్స్ లో, షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం ఇస్తామని తెలియజేసారు.

శిక్షణ అనంతరం, ప్రతి ఒక్కరికీ సంస్థ తరఫున సర్టిఫికెట్ అందజేస్తామని, సినీ మరియు టీవీ రంగాలలో రాణించాలనుకునే వారికి తమ సంస్థ సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. తమ సంస్థలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పాటు సినీ, టీవీ రంగాలకు చెందిన గెస్ట్ ఫ్యాకల్టీలు కూడా భోదిస్తారని శ్రీ షరీఫ్ అన్నారు.

ఫాకల్టీ అమరే౦దర్ మాట్లాడుతూ , ఒక లక్ష్యంతో, అంకితభావంతో సాధన చెయ్యాలని, నటనా రంగ ప్రాముఖ్యత గురించి సోదాహరణంగా వివరించారు. ఫాకల్టీ మల్లికార్జున్ ఈ రంగంలో ఎదగడానికి విద్యార్థులు ఎటువంటి కృషి చేయవలసి ఉంటుందో వివరంగా తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో శిక్షణకు హాజరైన విద్యార్థులతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్, శ్రీధర్ ధర్మాసనం మరియు శ్రీనివాసు వారణాసి తదితరులు పాల్గొన్నారు.