*ఈ సినిమా రిలీజయ్యాక జగపతిబాబుకు ఈ తరహా జోవియల్ క్యారెక్టర్లు మరిన్ని వస్తాయనుకుంటున్నా: నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’. రామ్ కార్తీక్-అమ్ము అభిరామి యువ జంటగా, మరో కీలక పాత్రలో బేబి సహశ్రిత నటించగా విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలవుతోంది.
‘ఎఫ్‌సీయూకే‘ సినిమా విశేషాలను వెల్లడించడానికి సోమవారం నిర్మాత దామోదర్ ప్రసాద్ (దాము), దర్శకుడు విద్యాసాగర్ రాజు (సాగర్) మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
ప్రశ్న: విద్యాసాగర్ రాజు డైరెక్షన్‌లో ఈ సినిమా నిర్మించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశమేమిటి?
దాము: సినిమా సినిమాకీ నాకు రెండు మూడేళ్లు గ్యాప్ రావడానికి కారణం, స్క్రిప్ట్ విషయంలో నేను తీసుకొనే కేర్. స్క్రిప్ట్ నాకు యూనిక్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే తప్ప నేను సినిమా చెయ్యను. అలాగే డైరెక్టర్‌గా నేను ఎంచుకొనే వ్యక్తికి సంబంధించి ఇండస్ట్రీలో అతని అనుభవాన్నీ, పనిమీద అంకితభావాన్నీ పరిగణనలోకి తీసుకుంటాను. 24 శాఖల్లో ఎంతో కొంత అవగాహన ఉందా, లేదా అనేది చూస్తాను. నచ్చితే కలిసి పనిచేస్తా. స్క్రిప్ట్ నచ్చితే సినిమా మొదలుపెడతాను. దీనివల్లే సినిమా సినిమాకీ నేను టైమ్ తీసుకుంటాను. జగపతిబాబు గారి ద్వారా సాగర్ నాకు పరిచయమయ్యాడు. అతను ఇండస్ట్రీలో నలిగిన వ్యక్తి. టాలెంట్ ఉంది. అతనో సబ్జెక్ట్ చెప్పాడు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ కథలోని సోల్‌కు కనెక్టయ్యా. స్క్రిప్ట్ సంతృప్తికరంగా వచ్చాక సినిమా స్టార్ట్ చేశాం.
ప్రశ్న: ‘ఎఫ్‌సీయూకే’ అని కాంట్రవర్షియల్ టైటిల్ ఎందుకు పెట్టారు?
దాము: ఈ సినిమా కథ నడిచేది నాలుగు ప్రధాన పాత్రలతో. అందుకని ‘ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్’ అని పెట్టాం. అది లెంగ్తీగా అనిపిస్తున్నదని భావించి, పొడి అక్షరాల్లో ‘ఎఫీసీయూకే’ అని పిలుస్తున్నాం. అందులో ఓ అక్షరం అటూ ఇటూ అయితే బూతు అవుతుందని తెలుసు. టైటిల్ పెట్టాక చాలా మంది ఇదేం టైటిల్ అని అడిగారు. కానీ సినిమాలో ఎక్కడా బూతు ఉండదు. హాయిగా నవ్వుకొనేట్లు ఉంటుంది.
సాగర్: ఈ సినిమాకు సోల్ ఆ నాలుగు పాత్రలే. జగపతిబాబు గారు చేసిన పాత్ర పేరు ఫణి. ఆయనది హీరో ఫాదర్ క్యారెక్టర్. మూడు తరాలకు చెందిన పాత్రలు, జనరేషన్ గ్యాప్‌తో వచ్చే ఇబ్బందులను, ఆ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలను కామిక్ వేలో చెప్పాం. సినిమా అంతా హిలేరియస్‌గా నవ్విస్తుంది. సినిమా చూస్తే, ‘ఎఫ్‌సీయూకే’ అనే టైటిల్ యాప్ట్ అని అందరూ అంటారు.
ప్రశ్న: చిన్నపాపతో నటింపచేయడం కష్టమనిపించలేదా?
సాగర్: కష్టమే. ఈ విషయంలో జగపతిబాబు గారికి థాంక్స్ చెప్పాలి. ఆ పాప కాంబినేషన్‌తో వచ్చే సీన్లను తీసేప్పుడు ఆయన ఎంతో పేషెన్స్‌తో మాకు సహకరించారు. సాధారణంగా పిల్లలు నిద్రపోతే వెంటనే లేవరు. కానీ సహశ్రిత సూది కిందపడిన శబ్దం వినిపించినా లేచేసేది. అందుకని ఆమె నిద్రపోయే సీన్లు తీయాల్సి వచ్చినప్పుడు యూనిట్ మెంబర్స్ అందరం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా పనిచేశాం. ఏమైనా బేబి సహశ్రిత ఈ సినిమాకు ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్పాలి.
ప్రశ్న: సినిమాకు సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది కదా? దానికేమంటారు?
దాము: శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ అనేది ఎప్పుడూ తలదించుకొనే సినిమాలు తియ్యదు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు సింగిల్ కట్ కానీ, బీప్ కానీ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. అలా అని ఈ సినిమాలో న్యూడిటీ కానీ, కిస్ సీన్స్ కానీ ఉండవు. కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. వాటిని కట్ చేయించుకొని యు/ఎ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. కానీ అలా చేస్తే ఆ సీన్‌లోని ఎమోషన్ పోతుంది. అందుకే కట్ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తామంటే తీసేసుకున్నాను.
ప్రశ్న: మహమ్మారి టైమ్‌లో చాలామంది తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశారు కదా.. మీరెందుకు ఇవ్వలేదు?
దాము: ప్రతి సినిమా నాకొక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే పాండమిక్ టైమ్ కూడా లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్సే. నేను కేవలం బిజినెస్ చేసుకోవడం కోసమే సినిమా తియ్యను. నేను ఏం చేశానో అది సినిమాయే చెబుతుంది. అదే నాకు బిజినెస్ తీసుకొస్తుంది. దాని కోసం నేను పరుగులు పెట్టను. ఈ సినిమా తీసింది థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యడానికి. సినిమా మొదలయ్యే ముందు దాకా నేను వ్యక్తుల్ని పట్టించుకుంటాను, మొదలయ్యాక నేను నా ప్రొడక్ట్‌ని తప్ప వ్యక్తుల్ని పట్టించుకోను. ఏం చెప్పినా అది నా ప్రొడక్టే చెప్పాలనుకుంటాను. ఇది నేను ఎంచుకున్న చాయిస్. ప్రొడక్ట్ బాగుంటే అందరికీ పేరొస్తుంది, అది అందరికీ కెరీర్‌ని ఇస్తుంది.
ప్రశ్న: సినిమాలో ప్రేక్షకుల్ని అలరించే అంశాలేమిటి?
సాగర్: ప్రధానంగా కామెడీని ఆస్వాదిస్తారు. ఈ సినిమా ఆద్యంతం కామెడీతో అలరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడియెన్స్‌కు ఈ సినిమా ఓ కామిక్ రిలీఫ్. ఇది జెన్యూన్ ఫిల్మ్. ఇందులోని ప్రతి ఎమోషన్ జెన్యూన్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ఫోర్స్‌డ్‌గా అనిపించదు.
దాము: ఈమధ్య మాకు తెలిసినవాళ్లకు ఈ సినిమా చూపించాను. ఆడియెన్స్‌లో పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్ల దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాలోని ఏదో ఒక పాత్రతోటో, ఇన్సిడెంట్‌తోటో కనెక్ట్ అయ్యారు. బాగుందన్నారు. దాంతో ఓ మంచి జెన్యూన్ ఫిల్మ్ తీశామనే నమ్మకం, సంతృప్తి కలిగాయి.
ప్రశ్న: ఫాదర్ క్యారెక్టర్‌కు జగపతిబాబు గారు ఫస్ట్ చాయిస్సేనా?
సాగర్: దాముగారు చెప్పినట్లు ఈ స్క్రిప్ట్‌ను కానీ, ఇందులోని క్యారెక్టర్లను కానీ ఏ యాక్టర్లనీ దృష్టిలో పెట్టుకొని రాయలేదు. ఒక జెన్యూన్ స్క్రిప్ట్ చేశాం. అందులోని క్యారెక్టర్లకు ఎవరైతే బాగుంటామని అనుకున్నామో వాళ్లను తీసుకున్నాం. ఫాదర్ క్యారెక్టర్‌కు, అందులోని చిలిపితనానికీ జగపతిబాబు గారైతే బాగా న్యాయం చేస్తారనీ, ఆయనైతే దానికి కరెక్టుగా సరిపోతారనీ అనిపించి, ఆయనను అప్రోచ్ అయ్యాం. వినగానే ఆయన క్యారెక్టర్‌కు కనెక్టయి ఓకే చెప్పారు.
దాము: శోభన్‌బాబు గారి తర్వాత అంతటి లేడీస్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరో జగపతిబాబే. ‘లెజెండ్’ సినిమా నుంచి ఆయన విలన్ రోల్స్ పోషిస్తూ వస్తున్నా, ఇప్పటికీ ఆయన లేడీస్ ఫాలోయింగ్‌లో మార్పు లేదు. నలభైల్లో, యాభైల్లో ఉన్న ఆడవాళ్లలోనే కాదు, టీనేజ్‌లో, ఇరవైలలో ఉన్న అమ్మాయిల్లోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘ఎఫ్‌సీయూకే’ రిలీజయ్యాక ఆయనకు ఈ తరహా జోవియల్ క్యారెక్టర్లు మరిన్ని వస్తాయనుకుంటున్నాను.