రంగా – రత్నల పెళ్లిలో ‘దేవినేని’ ఆటాపాటా…

565

నెహ్రూ, రంగాల జీవితంలో మనకు తెలియని కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ‘దేవినేని’ సినిమా. శివనాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌టి‌ఆర్ ఫిలింస్ పతాకంపై జి. ఎస్.ఆర్ .చౌదరి, రాము రాథోడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్ర‌లో నందమూరి తారకరత్న నటిస్తుండగా, వంగవీటి రంగా పాత్రను సురేష్ కొండేటి పోషిస్తున్నారు.
నవీనారెడ్డి, తేజారెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ పూర్తికావచ్చింది. నెహ్రూ, రంగాల మధ్య వివాదం, గాంధీ చనిపోవడం, వారు విడిపోవడం తదితర సన్నివేశాలను చిత్రీకరించారు. గులాబీ హౌస్, రామకృష్ణా స్టూడియో, రాక్ కాజిల్, బూత్ బంగ్లా, మొయినాబాద్ లోని వెంకటాపురం తదితర లోకేషన్లలతో చిత్రీకరణ జరిగింది. రంగా, రత్నకుమారిల వివాహానికి నెహ్రూ సహకరించడం, ఈ నేపథ్యంలో వచ్చే పెళ్లి పాట ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ‘రంగా రత్నల కళ్యాణమే రంగ రంగ వైభోగమే, కన్నుల విందు ఈ బంధమే కుదిరే కొత్త సంబంధమే ’ అనే పల్లవితో సాగే
ఈ పాటను తారకరత్న, సురేష్ కొండేటి, నవీనారెడ్డి, తేజారెడ్డి, రంగా అనుచరులపై, నెహ్రూ అనుచరులపై చిత్రీకరించారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ దీనికి నృత్యరీతులను సమకూర్చారు. రాజ్ కిరణ్ స్వరకల్పనలో ఎస్.వి.రఘుబాబు ఈ పాటను రాశారు. మూడు రోజులపాటు ఈ పాట చిత్రీకరణ కొనసాగింది. దర్శకుడు శివనాగేశ్వరరావు (శివనాగు) ఈ సినిమా విశేషాలను వివరిస్తూ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ నెల 22కల్లా పతాక సన్నివేశాలు మినహా
దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని వివరించారు. ఇందులో రంగా పాత్ర పోషిస్తున్న సురేష్ కొండేటి మాట్లాడుతూ రంగాలాగానే ఉన్నాననే ఉద్దేశంతో తనను ఈ పాత్రకు ఎంపిక చేశారని, తన గెటప్ ను చూసి అందరూ ‘రంగా’ సురేష్ అంటున్నారని, రంగా జీవితంలో తను కూడా ఓ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. నిర్మాతల్లో ఒకరైన రాము రాథోడ్ మాట్లాడుతూ తమకిది మొదటి సినిమా అయినా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చే చిత్రమవుతుందన్నారు. మరో నిర్మాత జి. ఎస్. ఆర్. చౌదరి మాట్లాడుతూ ఈ నెలాఖరుకల్లా షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.