విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. కాగా, ఇందులో ప్రతినాయకుడి పాత్రలో రాజ్ అర్జున్ అనే బాలీవుడ్ నటుడు నటించారు. ఈ చిత్రం హిట్ అయిన సందర్భంగా మీడియాతో చిట్ చాట్…
మీకు సినీ రంగప్రవేశం ఎలా అయింది ?
భోపాల్ మా సొంత ఊరు. చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే చాలా ఇష్టం. స్టేజ్ ఆర్టిస్ట్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఆ తర్వాత ముంబయిలో పదిహేను సంవతసరాలు ఉన్నాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాను కాని నాకు అమీర్‌ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్స్టార్లో విలన్ క్యారెక్టర్లో చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ పాత్రతో నాకు ఒక యాక్టర్‌గా మంచి పేరు వచ్చింది.
డియర్ కామ్రేడ్లో అవకాశం ఎలా దక్కింది?
దర్శకుడు భరత్ కమ్మ సూపర్ సీక్రెట్ సినిమా చూశారు. అందులో నా పెర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఫోన్ చేసి పిలిపించారు. అలా ఆ సినిమా ద్వారా నాకు అవకాశం వచ్చింది.
ఇందులో మహిళలను వేధించే పాత్రలో నటించారు. .. నిజ జీవితంలో అలాంటివి ఎప్పుడైనా ఎదుర్కున్నారా?
ఇటువంటివి బయట నేను చాలానే చూశాను. ప్రస్తుతం మన సొసైటీలో చాలానే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకా చాలా విన్నాను. బట్ నాకు పర్సనల్‌గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు.
సినిమాల్లోకి రాకముందు మీరు ఏమి చేసేవారు?
నేను భూపాల్‌లో ఉంటాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేవాడ్ని. ఇప్పటికీ ఆ బిజినెస్ ఉంది మా అన్నయ్య అవన్నీ చూసుకుంటున్నారు.
విజయ్‌దేవరకొండలాంటి స్టార్ హీరోతో పని చెయ్యడం ఎలా అనిపించింది?
చాలా బావుంది. విజయ్ చాలా మంచి వాడు. ఎలాంటి వారినైనా గౌరవిస్తాడు. చిన్నా, పెద్దా అని చూడడు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు. సెట్స్‌లో కూడా అందరితో బాగా కలిసిపోతాడు. షూటింగ్‌కి కూడా చాలా డెడికేటెడ్‌గా టైమ్‌కి వస్తాడు. ఒక్కోసారి తన పంచువాలిటీ చూస్తే నాకే ఆశ్చర్యమేసేది. అతనికి మధ్యతరగతి విలువలు బాగా తెలుసు. అందరినీ తన వారిలో చూస్తాడు. నాకు ఎక్కడా నేను ఒక పెద్ద హీరోతో నటిస్తున్నాను అన్న ఫీలింగ్ కలగలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు.
మీకు తమిళ, తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో ఏది కంఫర్ట్‌గా ఉంది?
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన షాభీ చిత్రం మంచిగా అనిపించింది. ఆ తర్వాత సూపర్ సీక్రెట్ కూడా ఓకే. కాకపోతే నా వరకు డియర్ కామ్రేడ్ తెలుగు ఇండస్ట్రీ కంఫర్ట్ అనిపించింది. ప్రొడ్యూసర్ మంచి వారు. పెద్ద బ్యానర్ నాకు భాష రాకపోయినా ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బావుంది. హైదరాబాద్ నాకు నా సొంత ఇల్లు లా అనిపించింది. నా వరకు అయితే తెలుగు ఇండస్ట్రీ కంఫర్ట్.
మీ తర్వాత నటించే చిత్రాలు?
హిందీ షీర్షా అనే చిత్రంలో నటిస్తున్నాను. కెప్టెన్ విక్రమ్ బాత్రా కార్గిల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. అందులో నేనొక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాను. కరణ్‌జొహర్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
డ్రీమ్ రోల్ అని ప్రత్యేకించి ఏమీ లేదు. కాని నేను నటించే పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. కథ నచ్చి నా పాత్రకి ప్రాముఖ్యత ఉంటే ఏ పాత్రలోనైనా నటిస్తా.
మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు?
పదిహేనేళ్ళ పాటు భూపాల్‌లో ఆ తర్వాత ఢిల్లీలో నేర్చుకున్నాను. సంజయ్ మెహతా దగ్గర నేర్చుకున్నాను.
మీకు తెలుగు రాదు కదా ఏమైనా ఇబ్బంది అయిందా?
లేదండి. నా డైలాగ్స్ అన్నీ ముందుగానే న్యారేట్ చేసేవారు. రాము డైలాగ్స్‌కి హెల్ప్ చేశారు. దాని పై చాలా పెద్ద హోమ్ వర్క్ చేసేవాడ్ని పెద్దగా భాష గురించి ఎప్పుడూ అంతగా ఇబ్బంది కలగలేదు అంటూ ముగించారు.