సమ సమాజ వీరులం
నవ అరుణా జ్యోతులం
భారతదేశ వాసులం
భావిని నిర్మించుతాం
అతీతులం కులమతాలకు
మానవుడే మాకు దైవము
బీద, ధనిక భేదం లేని
సమాజమే మాకు గమ్యం
సికింద్రాబాద్ లోని ఆర్ట్ లవర్స్ పాఠశాల విద్యార్థుల కోసం ఆ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ దర్శకులు, సంగీత దర్శకులు, నటులు, స్క్రీన్ ప్లే రచయిత,
కవి, రచయిత, చిత్రకారుడు,”ప్రజా” కళలకు, సాహిత్యానికి జవసత్వాలు అందించిన బి.నరసింగరావు 1971 లో రాసిన పాట లోని పల్లవి, ఒక చరణం మాత్రమే…
పై పాట తో “ఆర్ట్ లవర్స్” ఆశయం, లక్ష్యం ఆ రోజుల్లనే ఎలావుందో అర్థమవుతోంది!
బి.నరసింగరావు “ఆర్ట్ లవర్స్” వ్యవస్థాపకులు. ఆ సంస్థ జననాట్యమండలి గా ఆవిర్భావంలోను, ఆ తర్వాత కాలంలోనూ ఆయన సంస్థకు సారధ్య బాధ్యతలను నిర్వహించారు. అనంతర కాలంలో సినీ రంగంలోకి ప్రవేశించి ప్రజాభ్యుదయ, కళాత్మక సినిమాలను నిర్మించి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు అటు సినీ రంగం, ఇటు ప్రజాఉద్యమాలను దూరంగా ఉన్నట్టు కనిపించినా, ఆయన నిరంతరం సమాజాన్ని అధ్యయనం చేయడాన్ని మాత్రం ఆపలేదు. రచనా వ్యాసాంగాన్ని మానేయలేదు. తనకు అత్యంత ఆత్మీయుడు, ప్రజా సాంస్కృతికోద్యమ సహచరుడైన ప్రజా గాయకులు గద్దర్ మరణాంతరం గద్దర్ సంస్మరణ సభల్లో పాల్గొంటూ తరచుగా కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల తనను కలిసినప్పుడు ప్రస్తావించగా “మనిషిని మనిషి” అనిపించుకోవడం అంత సులభం కాదు, తాను మనిషిగా మనిషిని ప్రేమించడం, గౌరవించడమనే దారి నుండి ఎన్నడూ కూడా తప్పుకోలేదని స్పష్టం చేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు కలిగిన బి.నరసింగరావు గతంలోకి మళ్ళీ ఒకసారి…
భూస్వామ్య కుటుంబానికి చెందిన బి.నరసింగరావు హైస్కూల్ విద్యనభ్యసిస్తున్నప్పుడే షెడ్యూల్ కులాలకు చెందిన తన తోటి విద్యార్థులు ఎదుర్కొన్న కుల వివక్షను ప్రత్యక్షంగా గమనించారు. అందరూ మనుష్యులే కదా, మనుష్యుల మధ్య ఈ కుల అడ్డుగోడలేమిటీ అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన నరసింగరావు తన కుటుంబ సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికి “కుల” వివక్షలపై ప్రశ్నించడాన్ని మానుకోలేదు. పైగా అమానవీయంగా కొనసాగుతున్న ఈ సామాజిక సమస్యపై అప్పటినుండే అధ్యయనం చేయడం ప్రాంభించారు.
సికింద్రాబాద్ అల్వాల్ లో స్కూల్ విద్యను ముగించుకున్న తర్వాత ఫైన్ఆర్ట్స్ కాలేజీలో పెయింటింగ్ లో ఎన్.డి.ఎఫ్.ఏ., చేసి, థియేటర్ ని జీవితంగా మార్చుకున్న నరసింగరావు ప్రజల నుండి నేర్చుకున్న కళారీతులను, ప్రజా సాహిత్యంతో జోడించి బృంద ప్రదర్శనలు, వీధి నాటకాల ద్వారా వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఆయన వ్యవస్థాపనలో ఏర్పాటు చేయబడిన “ఆర్ట్ లవర్స్” స్థావరం హైదరాబాద్ నుండి 1970 లో అల్వాల్ కు మార్చబడింది. అప్పటికే ఏర్పడిన విప్లవ రచయితల సంఘం నక్సల్బరీ, శ్రీకాకుళం సాయుధ పోరాటాల భావజాలాన్ని సాహిత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంలోనే “ఆర్ట్ లవర్స్” అల్వాల్ కేంద్రంగా నిరక్షరాస్యులైన యువకులకు రాత్రి పాఠశాలను నిర్వహిస్తూ, సాధారణ విద్యాబోధనతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలకు మూలాలను వివరిస్తూ, చిత్రలేఖనంలో కూడా శిక్షణ ఇచ్ఛేవారు. ఇవన్నీ నరసింగరావు పర్యవేక్షణలోనే మిత్ర బృందం సహకారంతో కొనసాగేవి!
అప్పటికే ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న గుమ్మడి విఠల్ బాబు (గద్దర్) ప్రభుత్వ సమాచార శాఖలో పనిచేస్తున్న జె.బి.రాజు సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ బుర్రకథలు చెప్పేవారు! తాను నివాసం వుండే అల్వాల్ వెంకటాపురం ప్రాంత సమీపంలోనే ఆర్ట్ లవర్స్” సంస్థ పనిచేస్తుందని తెలుసుకున్న విఠల్ బాబు 1971 చివరలో తన మిత్రుని ద్వారా వెళ్లి నరసింగరావు తో పరిచయం ఏర్పరుచుకున్నారు. నర్సింగరావు అట్టడుగు వర్గాల ప్రజల పునాదిగా సాంస్కృతిక, సాహిత్య పరంగా అందించిన సలహాలు, సూచనలు అన్ని విఠల్ బాబును ఆకట్టుకున్నాయి. కానీ,నరసింగరావు పట్ల ఆయనకు విశ్వాసాన్ని పెంచలేకపోయాయి. అందుకు కారణం తన కళ్ళముందే కనిపిస్తున్న వందల ఎకరాల భూములకు నరసింగరావు కుటుంబం అధిపతులు కావడం, పైగా అగ్రకులానికి చెందిన వాడుకావడం! అలాగే అంటరాని కులంలో జన్మించి, కడు పేదరికాన్ని అనుభవించిన కుటుంబం నుండి రావడం వల్లనే విఠల్ బాబు నరసింగరావు పట్ల తొందరగా విశ్వాసాన్ని కలిగించలేకపోయాయి.
ఇటీవల గద్దర్ సంస్మరణ లో మాట్లాడిన నరసింగరావు గద్దర్ ఏ విషయాన్నైనా ప్రత్యక్షంగా చూసి, అనుభవంలోకి తీసుకోకుండా తన పాట, మాట, ఆటను ముందుకు తీసుకు వెళ్లలేదని పేర్కొంటూ అందుకు తనతో జరిగిన వాస్తవ సంఘటనను చెప్పారు. “ఆర్ట్ లవర్స్”తో గద్దర్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే “మీరు నాలాగే కాళ్లకు గజ్జెలు కట్టుకుని, ధోతి గోసి పెట్టుకుని, కాశెకట్టి, మాదిగ డప్పు కొట్టుకుంట బస్తీ లలో తిరగ గలరా?” అని గద్దర్ నరసింగరావును అడగడం, అప్పటికే ప్రజా కళల పట్ల సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న నరసింగరావు వెంటనే గద్దర్ చెప్పిన ఆహార్యంతో మాదిగ డప్పు కొడుతూ బస్తీల్లో తిరిగి గద్దర్ కు ఆయన పట్ల ఉన్న అపనమ్మకాన్ని పటాపంచలు చేశారట!
ఇక అప్పటి నుండి ఇద్దరి మధ్య గురుశిష్యుల బంధం పెనవేసుకుని ముందుకు పరుగులు తీసింది.
ఆ రోజుల్లోనే తమ కుటుంబానికి ఉన్న కార్లలో తిరిగే అవకాశాన్ని త్యజించిన నరసింగరావు, గద్దర్ తో కలసి సైకిల్ మీద అల్వాల్ కేంద్రం నుండి చుట్టూ నలభై కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు పర్యటిస్తూ పూరి గుడిసెల్లో నివశిస్తున్న ప్రజల పేదరికాన్ని, వెలివాడలకు విసిరివేయబడ్డ అంటరాని తనాన్ని అధ్యయనం చేస్తూనే, ఆయా వర్గాల ప్రజల నుండి అనేక జానపద కళారూపాలను కూడా సేకరించారు, ప్రదర్శించారు…ప్రజా చైతన్యంతో మమేకమయ్యారు! అనంతర కాలంలో “ఆర్ట్ లవర్స్” సంస్థ జననాట్యమండలిగా మారిపోయిన విషయం తెలిసిందే.
జననాట్యమండలి ప్రచురించిన గద్దర్ పాటలు (1971 నుండి 1981 వరకు) పుస్తకానికి వర్గీస్ పేరుతో నరసింగరావు రాసిన ముందు మాటలో ఇలా అంటారు …
అంతకుముందు అమాయకత్వంలో, ఆవేదనలో, తికమకలో జీవిస్తున్న మాకు, ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలియని పరిస్థితిలో జీవితంలోకి వెన్నెలలాగా, పిల్లగాలిలా, పక్షులచప్పుడులా, అందమైన అడవిలా, మంచు చల్లదనంలా, విచ్చుకున్న పూలలా కాకుండా ఉప్పెనగా, జ్వాలాగా, సముద్రకెరటంలా, భూకంపపు చప్పుడులా, ప్రళయకాల గర్జనలా, పత్రికలు, రేడియోలు శ్రీకాకుళ వార్తలు మోసుకొచ్చాయి. ఇవే…కేవలం ఇవి మాత్రమే మాజీవితాల్లో సమూలమైన మార్పుకు నాందివాచకం పలికాయి.
జన నాట్యమండలి ఆవిర్భావంతో నరసింగరావు ఆ సంస్థ కార్యక్రమాలను రూపొందించడంలోను, ప్రదర్శించడంలోను కీలకపాత్ర పోషించారు. శ్రమ జీవుల ఆటపాటలతో పాటు కళా రూపాలను ప్రదర్శిస్తూ భిక్షాటన చేస్తూ జీవితాలను కొనసాగించే బైరూపులోళ్లు (బహురూపాలు ధరించేవాళ్ళు), శారద కాల్లు (బుర్రకథలు చెప్పేవాళ్ళు), బాలసంత, కాటిపాపలోడు, గోసాయి, కొండమామ (జోస్యం చెప్పేవాళ్ళు), మందెచ్చులు, ఎలగందులోడు, మావరపోడు, పిట్టలదొర (లత్కోర్ సాబ్) ఇలా వీరు ముప్పై మూడు రకాల వేషాలు వేస్తారు. వీళ్ళు కాకుండా బుడబుడకలవాళ్ళు, పోచమ్మలోళ్లు, ఫకీరోళ్ళు, దాసరోళ్ళు, శిందోళ్ళు, వీరముస్టోళ్ళు, పూసలోళ్లు, మందులోళ్లు, కుంచెరకలోళ్ళు, పిచ్చకుంట్లోల్లు, పాములోళ్లు, గంగిరెద్దులోళ్లు, గుడ్డేలుగులోళ్లు, కోతినాడించేటోళ్లు, సాధనాసూరులు, పట్టివేషాలవాళ్ళు, భూపాలాలు పాడేటోళ్లు, పోతరాజువేషం, పోశమ్మ వేషం, ఎల్లమ్మ వేషం, భట్రాజులు, తోలుబొమ్మలు ఆడించేవాళ్ళు, ఎర్రగొల్ల వాళ్ళు (కాటమరాజు కథలు చెప్పేవాళ్ళు), బైండ్లోళ్ళు (జముకుల కథలు చెప్పేవాళ్ళు), ఒగ్గోళ్ళు (ఒగ్గు కథ,బీరప్ప కథ), పాండవులోళ్లు (భారతం మాత్రమే చెప్పేవాళ్ళు), హరికథలు చెప్పేవాళ్ళు, వెంకట్రాయుడి భార్య వేషం (విధవ) వేసేవాడు, చాపలల్లుతూ “సరోజనీ” మరి ఇతర పాటలు పాడే బైరూపుల స్త్రీలు, సోది చెప్పే ఎరుకల స్త్రీలు! అలాగే పండుగలకు, పబ్బాలకు పాడుకునే పాటలు, వ్యవసాయ పనుల్లో శ్రమజీవులు పాడుకునే పాటలు, పశువుల కాపర్ల పాటలు, భాగోతం, చిరుతల రామాయణం ఇలా ప్రజల జీవితాల్లో మమేకమైన అనేక జానపద కళా రూపాలను అధ్యయనం చేసి, ప్రజలు ఆనాటి సమకాలీన సమాజంలో ఎదుర్కొంటున్న అణచివేతలను, అత్యాచారాలను, దోపిడీని ప్రశ్నిస్తూ, నూతన ప్రజా కళారూపాలతో ప్రజలvవద్దకు వెళ్లే కొత్త ఒరవడికి నాంది పలికి, జననాట్యమండలి ద్వారా అశేష ప్రజా బాహుళ్యం లోకి తీసుకు రావడంలో బి.నరసింగరావు, గద్దర్ లు చేసిన కృషి చారిత్రాత్మకమైనది!
జననాట్యమండలి ఆవిర్భావం నుండి ఒక దశాబ్దాకాలానికి పైగా నరసింగరావు ఆ సంస్థకు దిశానిర్దేశం చేస్తూ సారథ్యం వహించారు. ఈ సమయంలోనే ఆయన “వర్గీస్” పేరుతో ప్రజల పాటలను రాశారు. ప్రజా సాహిత్యం, కళలు ఎలా ఉండాలి? అన్న విషయమై అనేక వ్యాసాలను రాశారు. ఇవన్నీ సృజన, పిలుపు లాంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వర్గీస్ రాసిన పాటలను కరీంనగర్ కు చెందిన భాగ్యనగర్ విజయకుమార్ “యుగ” ప్రచురణలుగా తీసుకు వచ్చారు. అలాగే “జననం” (1971-77), రైతుకూలి విజయం, ఒగ్గుకథ కూడా “యుగ” ప్రచురణలుగా వెలువడ్డాయి. జననాట్యమండలి “ప్రజల పాటలు” పేరున వర్గీస్ పాటలను ప్రచురించగా “ప్రజాసాహిత్యం-కళలు-ఎలావుండాలి” పేరుతో వర్గీస్ రాసిన వ్యాసాలు “సృజన” ప్రచురణలుగా వెలువడ్డాయి. వర్గీస్ రాసిన అనేక పాటలు ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యం పొందినప్పటికి, అవి ఆముద్రితంగానే ఉండిపోయాయి.
జననాట్యమండలి ప్రచురణలుగా వెలువడిన “గద్దర్ పాటలు(1971-!981)” పుస్తకానికి ముందుమాట రాసిన విప్లవ రచయితల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు కె.వి.రమణారెడ్డి ఆ సంస్థ గురించి,vనరసింగరావు, గద్దర్ ల గురించి చేసిన వాఖ్యలు ఇక్కడ గమనార్హం.
“కంఠంలో, ముఖ కవళికల్లో, అవయవాల తేలికల్లో ఏ “రసానికి” తగినట్టు ఆ”రసాన్ని” తాను అనుభవించి, తతిమ్మావారిననుభవింప చేయడం గద్దర్ విశిష్టత. పేరు, ఊరు ఎవరిక్కావాలి, గద్దర్ కావాలి గానీ! అసలు పేరు ఎవరికి గుర్తుండనంతగా ఈ గొప్ప పేరు పోరాట ప్రజా సంస్కృతికి మారుపేరై పోయింది. జన నాట్యమండలి పేరు ఎత్తకుండా ఒక్క గద్దర్ కే పెద్దపీట వేయడం తనకే ఇష్టముండదు. ఒకప్పుడు భూపాల్ ఆట, సంధ్య పాట, గద్దర్ ఆటా, మాటా, పాటా సమ్మేళనం లాగుండేది. ప్రజాపంథా- దానికి విప్లవోద్యమ సారధులైన మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీకి, ఇంకా లోతుల్లోకి వెళ్లి చూస్తే ఉద్యమ పోరాటకారులకి, వారికి ఆసట, బాసట ఇఛ్చిన విప్లవ ప్రజానీకానికి చెందిన ప్రజా యుద్ధ పంథాయే- సంజీవ్ గాని, మరొకరు గాని, గద్దర్ సహచరులే తప్ప అనుచరులు కాదంటే కారణం జననాట్యమండలి ఉమ్మడి కుటుంబం వంటి సంస్థ కావడమే! వీరందరినీ కూడగట్టి ఓర్పుతో, ప్రజాకళలకు, ప్రజా రాజకీయానికి మధ్యగల విడదీయరాని సంబంధాన్ని తెలియజెప్పి, బయటి చూపుతో చూపు విస్తరింపజేయడంతో బాటుగా పదునెక్కించి మాటను తూటాగా, పాటను కాటాగా, మాటా, పాటా జతబడిన ఆటను సాంస్కృతికపోరాటంగా మలిచి మెరిసిన కామ్రేడ్ బి.నరసింగరావు నిర్మాత, సూత్రధారి, నిర్వాహకుడు!
కే. వి.రమణారెడ్డి గారి పై మాటల ద్వారా జన నాట్యమండలిలో నరసింగరావు, గద్దర్ లు ప్రజాఉద్యమాల ఉధృతికి చేసిన కృషిన గమనించవచ్చు.
జననాట్యమండలి నుండి బయటికి వచ్చిన తర్వాత నరసింగరావు సినీ ప్రపంచంలోకి ప్రవేశించి, ప్రజా ప్రయోజన చిత్రాలను, కళాత్మకమైన చిత్రాలను నిర్మించి,జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక ప్రశంసలను అందుకొన్న విషయం తెలిసిందే. ఆయన తీసిన సినిమాలన్నీ అవార్డులు అందుకోవడం గమనార్హం. ప్రజా కళలు-సాహిత్యం అంటే…? అని అడిగినప్పుడు…
జానపద సాహిత్యం-కళలు ప్రజా కళలు కావు, కానీ ప్రజా కళలకు పునాదిగా ఉంటాయి. జానపద సాహిత్యం కళలు ఈ దేశ ప్రజలకు (ప్రతి దేశానికి అన్వయించబడుతుంది) మన పూర్వీకులచే అందిన వారసత్వం! అంతే కాదు అదొక నిధి, తరగని గని! ప్రజల ఆవేశ, కావేశాలు, వారిమాటలు, ఆటల ద్వారా వ్యక్తమైన స్వచ్ఛమైన కళా రూపాలు అవి. అవి మేలైన జాతి రత్నాలు. అయితే, భావపరంగా అవి విప్లవాత్మకమైనవి కావు. సమాజ పరిణామ క్రమంలో కళాత్మకంగా రూపొందించబడిన వాడి భావాలకు రూపకల్పనలు…భూప్రకంపనలు. ఆ మేలైన కళారూపాలను, సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి జీవిత కాలం సరిపోదు.
ప్రజా కళలు వేరు.ఇక్కడ “ప్రజా” అన్న పదానికి ఇన్వర్టెడ్ కామాలు వచ్చిచేరాయి. దానికి ఒక రాజకీయ ఉద్దేశ్యం జత చేయబడింది. ఒక డ్రైవ్ ఉంది. చైతన్యం ఉంది. ప్రజలను ముందంజవేయించాలనే ఒక బలమైన తపన ఉంది. అందుకే ఈ ప్రజా కళారూపాలు సృష్టించబడినవి కావు. సృష్టించబడేటివి. ప్రజాభ్యుదయమే వాటికి ఊపిరి. భువిపై నిలకడగా ఉండటమే వాటికి ఇరుసు.
ఈ ప్రజా కళలు ఇదివరకు రష్యా, చైనా తదితర సోషలిస్ట్ దేశాల్లో అభివృద్ధి కావించబడ్డాయి. వాటికి ఒక చారిత్రిక నేపథ్యం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసాహిత్యాన్ని, కళలను విశాల ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లిన వారిలో సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటావు సత్యం, జనసేన, శివసాగర్, చెరబండరాజు, వర్గీస్, గద్దర్, భూపాల్, అల్లంవీరయ్య, వంగపండు ప్రసాద రావు తదితరులున్నారు” అని నరసింగరావు వివరించారు.
– ఆవునూరి సమ్మయ్య
9849188633