సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్”. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ స్పోర్ట్స్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
ఈ చిత్రం మార్చి 5న అత్యధిక థియేటర్స్ లో గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.. రిలీజ్ అయిన ప్రతీ చోటా టెర్రిపిక్ రెస్పాన్స్ తో దిగ్విజయంగా రన్ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మార్చి 10న సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ సతీమణి వందన, సుప్రియ, చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను, నిర్మాత అభిషేక్ అగర్వాల్, సహ నిర్మాతలు దయా పన్నెం, శివ చెర్రీ, కెమెరామన్ కెవిన్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. “A1 ఎక్స్ ప్రెస్ తో సందీప్ కిషన్ సక్సెస్ ఫుల్ జర్నీ స్టార్ట్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అయ్యాం, చాలా హ్యాపీగా ఉన్నాం.. అని చెబుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది.. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్.” అన్నారు.
పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ సతీమణి వందన మాట్లాడుతూ.. “ముందుగా మా చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఒక మంచి హిట్ సినిమా మా బ్యానర్ కు ఇచ్చారు. సందీప్ కిషన్ చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. ‘A1 ఎక్స్ ప్రెస్’ లాగే అతని కేరియర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “థియేటర్స్ లో ఆడియెన్స్ రెస్పాన్స్ ఒక ఎనర్జీ, ధైర్యాన్ని ఇచ్చింది. రెగ్యులర్ గా మూవీస్ చేయకూడదు.. విభిన్నమైన పాత్రలు చేయాలి అని.. ఎదురుచూస్తున్న టైంలో తమిళంలో హిట్ అయిన మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. హాకీ బ్యాక్డ్రాప్ లో లవ్, ఎమోషన్స్ తో రూపొందించిన చిత్రం ఇది. ప్రతీ ఒక్కరూ రజినీకాంత్ గారి ‘బాషా’ లెవెల్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవాళ మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు అందరూ హ్యాపీగా లాభాలతో వున్నాం అని చెప్తున్నారు.. లైఫ్ లాంగ్ ఈ సినిమా నాకు గుర్తుంటుంది. రాహుల్, దర్శి సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు గర్వంగా ఉంది. అభిషేక్, వివేక్, విశ్వప్రసాద్, దయా అందరం కథని నమ్మి సినిమా చేశాం. జీవన్ ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా ఫెంటాస్టిక్ గా చేశాడు. ఫ్యూచర్లో గొప్ప దర్శకుడు అవుతాడు. హిప్ హాప్ తమిళ వండర్‌ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే కెవిన్ రాజ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. కొత్త కంటెంట్ తో సినిమాలు చేయవచ్చునని నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది.” అన్నారు.