కొత్త తరహా ప్రేమ కథతో డియర్ మేఘ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. డియర్ మేఘ సినిమాలో మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ భావోద్వేగ ప్రేమ కథ గురించి, చిత్ర పరిశ్రమలో తన ప్రయాణం గురించి దర్శకుడు సుశాంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు చూస్తే…
– నేను గతంలో సూపర్ స్టార్ కిడ్నాప్ అనే చిత్రాన్ని రూపొందించాను. డియర్ మేఘ దర్శకుడిగా నాకు రెండో సినిమా. మీ అందరిలాగే నాకూ సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇష్టంతోనే చదువులు పూర్తయ్యాక.. ముంబైలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాను. ఆ కోర్సు పూర్తి చేసుకుని టాలీవుడ్ వచ్చి ఫస్ట్ మూవీ సూపర్ స్టార్ కిడ్నాప్ కి దర్శకత్వం వహించాను. ఆ సినిమాకు నిర్మాణ బాధ్యతలు కూడా నేనే వహించాను.
– ఈ సినిమా ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ తో స్క్రిప్టు డిస్కషన్స్ జరిగాయి. మేము రెండు మూడు స్క్రిప్టులు అనుకుంటే, నిర్మాత అర్జున్ కు డియర్ మేఘ కథ నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అయ్యింది. డియర్ మేఘ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరి. మజిలీ, నిన్ను కోరి లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరిస్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అలా సేఫ్ జానర్ అని నమ్మి ఈ కథతో సినిమా చేశాం.
– ఒక అబ్బాయి అమ్మాయిని డియర్ మేఘ అని పిలుస్తాడు. అలా ఎందుకు పిలుస్తాడు అనేది థియేటర్ లో చూడాలి. ఇక ఈ సినిమా కథ గురించి ఎక్కువగా చెప్పాలని అనుకోవడం లేదు. బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎమోషన్ ఫీల్ అవుతారు. ఇప్పుడు చెబితే ఆ ఇంట్రెస్ట్ పోతుంది.
– కథ అనుకున్నాక మా మనసులోకి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ మేఘా ఆకాష్. తనే ఈ కథను, క్యారెక్టర్ ను జస్టిఫై చేయగలదు అని నమ్మాం. ఆమెకు కథ చెప్పగానే వెంటనే ఓకే చేస్తానని ముందుకొచ్చింది. మేఘ క్యారెక్టర్ లో తను బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చింది. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాల్లో ఇదే గొప్ప నటన అంటారు. అలాగే ఆదిత్ అరుణ్ కూడా తన బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చాడు. మేఘ, అరుణ్ ఇద్దరి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
– ఒక అమ్మాయి కోణంలో వస్తున్న ప్రేమ కథ ఇది. మేఘ అనే అమ్మాయి టీనేజ్ నుంచి అడల్ట్ వరకు తన జీవితంలో జరిగిన లవ్ ఇన్సిడెంట్స్ ఎమోషనల్ గా చెప్పే చిత్రమిది. అమ్మాయి కోణంలో ఒక ప్రేమ కథ తెరకెక్కించడం ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. మొత్తం సినిమా అంతా నటీనటుల పర్మార్మెన్స్ ల మీద ఆధారపడి ఉంటుంది. ఇదే డియర్ మేఘ సినిమాలో ఛాలెంజింగ్ గా అనిపించింది. ముగ్గురు లీడ్ యాక్టర్స్ మేఘ, అరుణ్, అర్జున్ సోమయాజులు పర్ ఫెక్ట్ గా నటించారు. ఈ క్యారెక్టర్స్ వీళ్లే చేయాలని అనుకున్నాం కాబట్టి ఔట్ పుట్ అనున్నట్లు వచ్చింది.
– ప్రేమ కథలకు సంగీతం ప్రాణం అనుకోవచ్చు. డియర్ మేఘకు హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా అంతే అందంగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కాలర్ ట్యూన్స్ గా పెట్టుకుంటారు.
– డియర్ మేఘ చిత్రాన్ని బెంగళూరు, చెన్నైలో కూడా రిలీజ్ చేస్తున్నాం. నా మొదటి చిత్రానికి చాలా విషయాలు నేర్చుకున్నాను. సూపర్ స్టార్ కిడ్నాప్ నుంచి డియర్ మేఘకు ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. నెక్ట్ సినిమాకు కథలు రెడీ చేసుకుంటున్నా. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాను.