మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి ఉత్తమ సినిమా జర్నలిస్టుగా ఉగాది పురస్కారం అందుకున్న బుద్ధి యజ్ఞమూర్తి

125

వేటపాలెంలో పుట్టి పెరిగి, హైదరాబాద్‌లో జర్నలిస్టుగా వృత్తి జీవితం కొనసాగిస్తున్న బుద్ధి యజ్ఞమూర్తి ఉత్తమ సినిమా జర్నలిస్టుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. మేడవరపు రంగనాయకులు వ్యవస్థాపక అధ్యక్షునిగా ఏర్పడిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఇటీవల 23 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాల ప్రదానోత్సవం మే 2 మంగళవారం గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలో ఉత్తమ సినిమా జర్నలిస్ట్ అవార్డు, ప్రశంసాపత్రాన్ని ముఖ్య అతిథి వెంకయ్యనాయుడు నుంచి అందుకున్నారు యజ్ఞమూర్తి. ప్రస్తుతం ఆయన తెలుగువన్ డాట్ కాం వెబ్‌సైట్‌కు ఎడిటర్ (సినిమా)గా పనిచేస్తున్నారు.

వేటపాలెంలోని ఆణుమల్లిపేట గ్రామానికి చెందిన బుద్ధి యజ్ఞమూర్తి ఒక చేనేత కార్మిక కుటుంబంలో జన్మించారు. తల్లితండ్రులు సరోజిని, కోటినాగేశ్వరరావు. 1993లో వేటపాలెం, చీరాల మండలాల న్యూస్ కంట్రిబ్యూటర్‌గా ఒక ప్రముఖ దినపత్రిక (ఆంధ్రజ్యోతి)లో యజ్ఞమూర్తి జర్నలిస్ట్ జీవితం మొదలైంది. దానికంటే ముందుగానే 20 ఏళ్ల వయసులో మయూరి వీక్లీలో ‘మలయమారుతం’ అనే కథ అచ్చవడంతో రచయితగా సాహితీలోకంలో ఆయన అడుగుపెట్టారు. ఇప్పటివరకు 75కు పైగా కథలు, 40కు పైగా కవితలు అచ్చయ్యాయి. ఇక జర్నలిస్టుగా దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో వివిధ సామాజిక అంశాలు, సమస్యలపై ఆయన రాసిన వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

1996లో హైదరబాద్‌కు తరలివెళ్లిన యజ్ఞమూర్తి 1997 నుంచి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా అనేక వ్యాసాలు రాశారు. 2002 నుంచి పూర్తిస్థాయి ఫిల్మ్ జర్నలిస్టుగా మారారు. వివిధ పత్రికల్లో ఫిల్మ్ రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్, అసిస్టెంట్ ఎడిటర్ హోదాల్లో పనిచేసి వేలాది సినిమా వ్యాసాలు, వందలాది సినిమా సమీక్షలు రాశారు. ఎంతోమంది సినీ ప్రముఖలను ఇంటర్వ్యూ చేశారు. వెండివెన్నెల, హిట్ హిట్ హుర్రే అనే శీర్షికలతో (నవ్య వీక్లీలో) కాలమ్స్ రాశారు. ఒక ప్రముఖ దినపత్రిక (ఆంధ్రజ్యోతి)లో ఏడేళ్లపాటు సినిమా పజిల్ నిర్వహించారు.

ప్రస్తుతం తెలుగువన్ డాట్ కాం వెబ్‌సైట్‌కు ఎడిటర్ (సినిమా)గా వ్యవహరిస్తున్నారు. దాని అనుబంధితంగా ఉన్న తెలుగువన్ యూట్యూబ్ చానల్‌కు సినీ సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మరుగునపడిపోయిన ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులను తన ఇంటర్వ్యూల ద్వారా నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ సంస్థల నుంచి అక్కినేని మీడియా అవార్డ్, మీడియా ఎక్సెలెన్సీ అవార్డ్, ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారం అందుకున్నారు యజ్ఞమూర్తి. ఇప్పుడు జర్నలిస్టులు ఏర్పాటుచేసుకున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రకటించిన ఉత్తమ సినిమా జర్నలిస్టును అందుకోవడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ పత్రికల్లో పనిచేసినప్పుడు తనకు సహకరించిన సహ పాత్రికేయులు, ఎడిటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తెలుగువన్ డాట్ కాంలో తనను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోన్న సంస్థ ఎండీ కంఠంనేని రవిశంకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.