ప్రేక్షకులు నా నుండి కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ వందకి వందశాతం ఇచ్చే చిత్రం వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ

198

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి విలేఖరుల సమావేశంలో ‘వాల్తేరు వీరయ్య’ విశేషాలని పంచుకున్నారు.

మీరు చాలా అనుభవం గల హీరో.. కొత్త దర్శకులతో పని చేస్తున్నపుడు వారికీ కావాల్సిన ఫ్రీడమ్ ని ఎలా క్రియేట్ చేస్తారు ?
నేను ఎప్పుడు మానిటర్ చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఓకే’ అన్నంతవరకూ అక్కడి నుండి కదలను. నేను ఎప్పుడూ దర్శకుడి ‘ఓకే’ కోసం ఎదురుచూస్తాను. కొత్త యాక్టర్ ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను.

మొన్న రిటైర్ మెంట్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయంశమయ్యాయి ?
కష్టపడే తత్త్వం లేనప్పుడు రిటైర్ మెంట్ తీసుకోవడమే మంచిదని అన్నాను. కెరీర్ మొదట్లో ఒక ఆకలి వుంటుంది. ఒక పేరు తెచ్చుకోవాలి, మనల్ని మనం తెరపై చూసుకోవాలనే స్పిరిట్ .. కొంతకాలం తర్వాత ఎందుకు వుండకూడదు. కష్టపడాలి. అమితాబ్ బచ్చన్ గారు ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడూ అర్ద ఆకలితో వుండాలి. కడుపు నిండిన వ్యవహారం లా వుంటే మాత్రం అనుకున్నది డెలివర్ చేయలేవని చెప్పడమే నా ఉద్దేశం.

సంక్రాంతికి మీ సినిమా ఎప్పుడూ ముందు వస్తుంది. ఈసారి లాస్ట్ వస్తున్నారు. ఆ నిర్ణయం కూడా మీదే అని తెలిసింది ?

మా సంస్థ నుండి రెండు సినిమాలు అనేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పండగ ఎన్ని సినిమాలైన తీసుకుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే గనుక ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి వుంటుంది. అందుకే నేనే వెనుకకు జరుగుతానని చెప్పాను.

మరి అప్పటికే విడుదలైన సినిమాల వలన థియేటర్లు టైట్ అవుతాయి కదా .. ?
ఫస్ట్ డే రికార్డ్ కోసం తాపత్రయపడే వారైతే గనుక మా రెవెన్యు తగ్గిపోతుందనే ఫీలింగ్ వుంటుంది. రావాల్సిన షేర్ వస్తుందనే నమ్మకం వుంటే గనుక ఎప్పుడు ఎలా విడుదల చేసినా ఇది నిలబడి తీరుతుంది.

గత ముఫ్ఫై ఏళ్ళలో టెక్నాలజీ చాలా మారింది. బాబీ ఒక అభిమానిగా మిమ్మల్ని ఎలా చూపించబోతున్నాడు ?
నేను కంటెంట్ ని బలంగా నమ్ముతాను. బాబీ కూడా కంటెంట్ ని నమ్ముతాడు. అందుకే మా ఇద్దరికి చక్కగా కుదిరింది. దిని అవసరం మేరకు టెక్నాలజీ ని వాడుకోవడం జరిగింది. బాబీ ఫ్యాన్ గా కంటే డైరెక్టర్ గా ఎక్కువ మార్కులు సంపాయించాడు.

బాబీ ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకర్షించిన ప్రధాన అంశం ?
ఏదైనా కథ విన్నప్పుడు అందులో ముఖ్యంగా ఎమోషన్ చూస్తాను. పాటలు, ఫైట్లు అదనపు అలంకరణలు. ఎమోషన్ కనెక్ట్ అయితేనే ప్రేక్షకులని హత్తుకుంటుంది. వాల్తేరు వీరయ్య కథ లో అంత గొప్ప ఎమోషన్ వుంది. అందుకే బాబీ చెప్పిన కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను.

శ్రుతి హాసన్ తో ఇందులో మీ కెమిస్ట్రీ ఎలా వుంటుంది ? డ్యాన్సులు ఎలా వుంటాయి
తను కమల్ హాసన్ గారి కూతురు. తన డీఎన్ ఏ లోనే డ్యాన్స్ వుంది. అవలీలగా డ్యాన్స్ చేస్తుంది. అయితే చాలా చలి లో డ్యాన్స్ చేయడం ఒక సవాలే. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి పని పట్ల అంకితభావం ఎక్కువ. తనతో మళ్ళీ వర్క్ చేయాలని వుంది.

దేవిశ్రీ మ్యూజిక్ గురించి ?
దేవిశ్రీ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. వాల్తేరు వీరయ్య మ్యూజిక్ చాలా మనసు పెట్టి చేశాడు. నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాట చాలా చిలిపితనంతో రాసి చేశాడు. అలాగే బాస్ పార్టీ కూడా. ఇందులో వుండే పాటలన్నీ నాకు ఇష్టం. నీకేమో అందం ఎక్కువ పాట కూడా నాకు చాలా ఇష్టం. నా ఫేవరేట్ సాంగ్ ఇది.
బాబీ సింహా గురించి చెప్పండి ?
బాబీ సింహా జాతీయ అవార్డ్ పొందిన నటుడు. నా సినిమాల్లో డైలాగులు పాటలు అవలీలగా చెప్పాడు. తనది తమిళనాడు అనుకున్నాను. తెలుగే అని తెలిసి సర్ప్రైజ్ అయ్యాను. తను కూడా ఫ్యాన్స్ బాయ్. ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు.

దర్శకుడు బాబీతో పని చేయడం గురించి ?
బాబీకి నేను ఫ్యాన్ అయ్యాను అని ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. అతని హార్డ్ వర్క్ చూసి ఫ్యాన్ అయ్యాను. వాళ్ళ నాన్న గారు చనిపోయిన తర్వాత చిన్న దినం అయిన వెంటనే అంత బాధని దిగమింగుకొని ఇక్కడ వచ్చి పని చేశాడు. అతని కమిట్ మెంట్ కి హ్యాట్సప్. అతని కమిట్ మెంట్ కి ఫ్యాన్ అయ్యాను.

దర్శకత్వం చేయాలనే ఆలోచన వుందా ?
జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే వుంది. ఏదొక ఒక సమయంలో ఆలాంటి సందర్భం వచ్చి, దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే గనుక దర్శకత్వం చేస్తాను.

టికెట్ రేటు ని 25 రూ. పెంచుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం కల్పించింది. అలాగే ఆరు షోలు వేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది కదా?
ప్రభుత్వ నిర్ణయాలని మనం గౌరవించాలి. ఈ వెసులు బాటు కల్పించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్కు నా అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. దేశం గర్వించే విజయమిది.