నా టాప్ ఫైవ్ సినిమాల్లో కచ్చితంగా ‘తోలుబొమ్మలాట’ ఉంటుంది – నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్

513

మనం ఎక్కడినుంచి వచ్చామో ఏమేం చేశామో మన మూలాలు ఏమిటో తెలియజెప్పడానికైనా ఓ మంచి సినిమా ఉండాలి, ఆ లోటును తీర్చే సినిమా కచ్చితంగా ‘తోలుబొమ్మలాట’ అవుతుంది అన్నారు నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించారు. నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది .
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 42 సంవత్సరాల తన నటజీవితంలో మొదటి ఐదు సినిమాల వరుసలో నిలిచే చిత్రం తోలుబొమ్మలాట అవుతుందన్నారు. ఐదు పైసలతో సోడాలు తాగిన రోజులను ఈ సినిమా గుర్తుచేసిందన్నారు. ఇందులో సోడాల రాజు పాత్రలో తను నటించినట్లు చెప్పారు.
కానీ ఒక కుర్ర దర్శకుడు ఈ కథ చెప్పడం నాకే ఆశ్చర్యం కలిగించింది. ముఖేముఖే సరస్వతి అంటారు. ఆ మాట ఈ దర్శకుడు విశ్వనాధ్ కు అక్షరాల వర్తిస్తుంది.దర్శకుడు విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ కథను రాసుకుని రాజేంద్రప్రసాద్ దగ్గరకు వెళ్లినపుడు తనను గురువులా ప్రోత్సహించారన్నారు. కథకు ప్రధానంగా నిలిచే సోమరాజు పాత్రలో రాజేంద్రప్రసాద్‌ నటించారు. సినిమాలో సోమరాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబట్టి అందరూ ఆయన్ని సోడాల్రాజు అని పిలుస్తారని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అయ్యిందని ,నవంబర్ లో విడుదల చేస్తామని తెలిపారు .
హీరో విశ్వంత్ మాట్లాడుతూ దర్శకుడు విశ్వనాథ్ తో ‘కేరింత’ సినిమా నుంచి తమ జర్నీ ప్రారంభమైందన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కిందన్నారు.

ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన నటుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించడం, అలాగే మరో సీనియర్ నటుడు నారాయణరావుతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు మంచి డెప్త్ ఉన్న కథను ఎంచుకున్నట్లు చెప్పారు.