.
పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
లెజెండ్రీ డైరెక్టర్ భారతీ రాజా మాట్లాడుతూ ‘‘మణిరత్నంగారు.. నార్త్‌లో షూటింగ్ చేస్తోన్న శంకర్ సహా ఇంత మంది దర్శకులు ఇక్కడకు వచ్చారంటే కారణం లింగుసామిగారే. ఆయనపై అభిమానమే. ది వారియర్ సినిమాను తను తెరకెక్కించిన విధానం అద్భుతం. బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్‌కు అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. రామ్ ఇక్కడ హీరోగా పరిచయం అవుతున్నారు. తను డాన్సులు చూశాను.. బ్యూటీఫుల్. ఓ రకంగా అసూయ పడ్డాను. నాకు కాస్త వయసు తక్కువగా ఉండుంటే నేను కూడా వీరితో కలిసి చేసేవాడిని కదా అనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన గ్రాండియర్‌కు శంకర్‌లాంటి దర్శకుడు దారి చూపించాడు. శంకర్ ఆలోచనను చూస్తే ఆశ్చర్యపోతున్నాను. లింగుసామి టెక్నికల్‌గానూ సినిమాను అద్భతుంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడున్న దర్శకులంతా గొప్ప గొప్పవారు. ఎన్నెన్ని జన్మలెత్తినా సినిమా డైరెక్టర్‌గానే పుట్టాలని కోరుకుంటాను’’ అన్నారు.
ఏస్ డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ ‘‘లింగుస్వామి ఈ సినిమా కోసం ఇంత మంది వారియర్స్‌ను తీసుకొస్తాడని తెలుసుంటే నా సినిమాకు సంబంధించిన వార్ సీన్స్‌ను ఇక్కడే చేసుండేవాడిని. లింగుస్వామి చాలా మంచి వ్యక్తి. కోవిడ్ సమయంలో ఇక్కడ అందరి డైరెక్టర్స్‌ను సంధానం చేశాడు. తన వల్ల నాకు ప్రతి ఒక డైరెక్టర్‌తో పర్సనల్‌గానూ మంచి అనుబంధం ఏర్పడింది. నేను నా పొన్నియన్ సెల్వన్‌ను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుస్వామి కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన తర్వగా పూర్తి చేసేశారు. ఆయన రోడ్ బాగా వేస్తే .. వెనకాలే నేను కూడా వచ్చేస్తాను. ది వారియర్ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘‘ది వారియర్.. చాలా మంచి టైటిల్. అందరం జీవితంలో ఏదో సాధించటానికి ఫైట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్. ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ సహా అన్ని పాటలు బావున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌కి అభినందనలు. రామ్ కోసం ఈ సినిమా చూడబోతున్నాను. కృతి శెట్టి .. మంచి నటిగా ఎదిగి నేషనల్ అవార్డ్‌ను దక్కించుకోవాలని అనుకుంటున్నాను. లింగుసామి మంచి స్నేహితుడు. కరోనా సమయంలో నాకు చాలా సమస్యలు వచ్చాయి. తనతో చెప్పుకుంటే తను అండగా నిలబడ్డారు. అంత మంచి వ్యక్తి చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. వారియర్ ట్రైలర్ చూశాను. చూస్తుంటే రామ్‌లో ఓ ఫైర్ కనిపించింది. వారియర్ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ ‘‘కోలీవుడ్ ఎంట్రీ కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేశాను. అయితే ఈ రేంజ్ ఇంట్రడక్షన్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. నాకే కాదు.. ఇండియన్ సినిమాల్లోనే ఇంత మంది లెజెండ్స్ ఏ సినిమాకు కూడా వచ్చి ఉండరు. అది లింగుస్వామిగారి వల్లనే సాధ్యమైంది. ఇక్కడకు వచ్చిన ఒక్కొక్క గెస్ట్‌ను చూస్తే లింగు స్వామిగారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సాధించినట్లే అనిపిస్తుంది. ఆయన్ని వ్యక్తిగా ఎంత ఇష్టపడుతున్నారో ఈ వేదికను చూస్తే అర్థమవుతుంది. ఇంత గొప్ప డెబ్యూతో తమిళ్ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆశీర్వాదంగా భావిస్తున్నాను. బుల్లెట్ సాంగ్ మాత్రమే కాదు.. ప్రతీ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్‌ను ఇచ్చాడు. ఆ సాంగ్‌ను మాట్లాడిన శింబుకి స్పెషల్ థాంక్స్.
డైరెక్టర్ ఎన్.లింగు స్వామి మాట్లాడుతూ ‘‘సినిమా అనౌన్స్ చేసిన తర్వాత టైటిల్ పెట్టాలని అందరూ అనుకున్నాం. చాలా టైటిల్స్ చెప్పారు. కానీ ఏదీ సెట్ కాలేదు. అప్పుడు నిర్మాతగారు మంచి టైటిల్ చెబితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. మా దగ్గర సంతోష్ ది వారియర్ అనే టైటిల్ చెప్పారు. నేను చాలా పెద్ద కోటీశ్వరుడినని పేపర్లో ప్రింట్ చేయించుకుని వచ్చి మరీ పార్థిపన్‌గారు నా గురించి మాట్లాడారు. అలాగే రామ్‌గారు మనుషులను సంపాదించుకోవాలంటే గొప్ప మనసుండాలని మాట్లాడారు. నేను ఏం సంపాదించినా, సంపాదించకపోయినా నా కోసం వచ్చిన వారిని వదులుకోకుండా ఉంటే చాలు. అంతకు మించిన కోట్ల రూపాయలు నాకు అవసరం లేదు. మణిరత్నంగారు ఆయన పొన్నియన్ సెల్వన్‌తో బిజీగా ఉన్నారు. వస్తారో రారో అనుకుని ఫోన్ చేసి ఇలా ఫంక్షన్ ఉందని చెప్పగానే ఎప్పుడు, ఎక్కడ అని అడిగారంతే.. అలాగే శంకర్‌గారికి ఫోన్ చేశాను. సాధారణంగా నాకు ప్రతి విషయంలోనూ ఆయన సపోర్ట్ చేస్తుంటారు. ఆయన టైమ్ సెన్స్ మామూలుగా లేదు. హీరోయిజం, డాన్సులు సూపర్బ్. నేను చేసిన పందెం కోడి, భయ్యా చిత్రాల కోవలో రామ్‌గారికి ది వారియర్ సినిమా నిలిచిపోతుంది. నేను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని మహేష్ బాబుగారితో.. అల్లు అర్జున్ గారిఓత చర్చించాను. కానీ అవేవీ సెట్ కాలేదు. వారియర్ సినిమా కుదిరింది. ఈ సినిమా చక్కగా అందరినీ మెప్పిస్తుందని భావిస్తున్నాను. శింబుగారికి, సూర్యగారికి, శివ కార్తికేయన్‌గారికి థాంక్స్. ఈ జర్నీలో నాకు అండగా నిలబడిని ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ది వారియర్ సినిమా వేడుకకి వచ్చిన లెజెండ్రీ డైరెక్టర్స్ అందరూ ఇండియన్ సినిమానే కాదు.. ప్రపంచ సినిమాలోనే గుర్తింపు సంపాదించుకున్నవారు. వారి ఒక్కొక్కరి అపాయింట్‌మెంట్ కావాలంటేనే కనీసం ఓ నెల పాటు వెయిట్ చేయాలి. అలాంటిది అందరూ కలిసి ఓ దర్శకుడు కోసం వచ్చారు. లింగుస్వామిగారికి దీని కంటే పెద్ద విజయం మరోటి లేదు. నేను, ఆయనతో కలిసి చాలా సార్లు కలిసి పని చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఓ భారీ చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యాం. లింగుస్వామి ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించారు. అయితే ఏ దర్శకుడిని ఒక్క మాట కూడా అనలేదు. ఆయన మనస్తత్వం చూసి ఆయనకు మరింత దగ్గరయ్యాను. ఆయన రూపొందించిన ఈ సినిమాలో నేను భాగం కావటం చాలా ఆనందంగా ఉంది. ఆది పినిశెట్టి విలనిజం పీక్స్‌లో ఉంటుంది. రామ్ నా సోదరుడు.. టాలీవుడ్‌లో ఆయన్ని స్టార్టింగ్లో లవర్ బాయ్ అనుకున్నాం. కానీ హార్డ్ వర్క్‌తో ఉస్తాద్ అనే మాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. రామ్ అద్భుతమైన డాన్సర్. బుల్లెట్ సాంగ్ అందరికీ నచ్చేసింది. కొరియోగ్రఫీ ఎక్సలెంట్. కృతి శెట్టి కూడా పోటీ పడి నటించింది. రామ్‌ను కోలీవుడ్ ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను. నాతో పాటు కలిసి పనిచేసిన ఎంటైర్ టీమ్‌కు ధన్యవాదాలు’’ అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘‘లింగుస్వామిగారికి థాంక్స్. ఇంత మంది గొప్ప దర్శకులున్న వేదికపై నేను కూర్చోవడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. జూలై 14న సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
డైరెక్టర్, నటుడు ఎస్.జె.సూర్య మాట్లాడుతూ ‘‘ది వారియర్ వేడుకకి తమిళ సినీ ఇండస్ట్రీలోని గొప్ప డైరెక్టర్స్ అందరూ వచ్చారు. ఓ పాజిటివిటీతో అందరూ ఓ స్టేజ్‌పై రావటం అనేది చాలా గొప్ప విషయం. భారతీరాజాగారి దగ్గర నేను డైరెక్షన్ ఛాన్స్‌కు వెళ్లినప్పుడు నాకు అవకాశం రాలేదు. చాలా బాధపడ్డాను అయితే ఆయన్ని ఫాలో అయ్యాను. ఆయనెలా డైరెక్ట్ చేస్తున్నారు. ఎలా నటనను నేర్పిస్తున్నారు. కావాల్సిన ఔట్‌పుట్‌ను ఎలా రాబట్టుకుంటున్నారనే విషయాలను గమనించాను. ఎక్కడో విదేశాలకు వెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేర్చుకునే విషయాలను దగ్గరుండే నేర్చుకునే అవకాశాన్ని దేవుడు కలిగించాడని అప్పుడు అనిపించింది. అలాగే లింగుస్వామిగారికి కాస్త గ్యాప్ వచ్చింది. అయితే అద్భుతమైన విజయాన్ని సాధించడానికే ఈ గ్యాప్‌ని దేవుడు ఇచ్చాడని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ఇంకా గొప్ప గొప్ప సినిమాలను చేయాలని, నిర్మాతగా రాణించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన ది వారియర్ సినిమా పెద్ద హిట్ అవుతుంది. బుల్లెట్ సాంగ్ బుల్లెట్‌లా అందరికీ తగిలింది. అదే సక్సెస్‌కు సూచన. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సక్సెస్‌ను అందించింది. తెలుగు ప్రేక్షకులు ఎలాగైతే రజినీకాంత్‌గారు, విజయ్‌గారిని దగ్గరకు తీసుకున్నారో.. అలాగే తమిళ ప్రేక్షకులు కూడా రామ్‌ను ఆదరిస్తారని భావిస్తున్నాను. ది వారియర్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను తిరగ రాయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సెల్వమణి మాట్లాడుతూ ‘‘ది వారియర్ కథ విన్నాను. అద్భుతమైన స్టోరి. రామ్ పోతినేనికి అదృష్టవశాత్తు ఈ సినిమా దక్కిందనేది నా భావన. కచ్చితంగా సినిమా అద్భుతంగా ఉంది. ఇక్కడే కాదు.. పాన్ ఇండియాగా ప్రేక్షకులను మెప్పిస్తోంది. భారతీరాజాగారికి సినీ దర్శకులందరి తరపున పెద్ద సన్మాన సభను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ది వారియర్ సినిమా భారీ హిట్ కావాలి. సినిమాను లింగుసామి అంతగా ప్రేమించి తెరకెక్కించాడు’’ అన్నారు.
విశాల్ మాట్లాడుతూ ‘‘సినిమాకు లింగుసామి కరెక్ట్ టైటిల్ పెట్టారు. తనతో నాకు చాలా ఏళ్ల నుంచి చాలా మంచి అనుబంధం ఉంది. నాకు ఇప్పుడున్న యాక్షన్ హీరో అనే ఇమేజ్‌ను ఆయన సినిమా పందెం కోడి వల్లే వచ్చింది. లింగుసామి దెబ్బ తిన్న పులిలా ది వారియర్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో నటించిన రామ్‌ను చూస్తే అసూయగా అనిపిస్తుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. రామ్‌ని తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నాను. ఆది పిని శెట్టికి అభినందనలు. కృతి శెట్టికి ఆల్ ది బెస్ట్. పాటలు, ట్రైలర్ ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. సినిమా హిట్ కావటానికి అదే సూచకం. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ ‘‘లెజెండ్రీ డైరెక్టర్స్ ఆశీర్వాదాలు దక్కడం మా అదృష్టం. ది వారియర్ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాకు వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరు పేరునా ధన్యవాదాలు. శ్రీనివాసా చిట్టూరి గారికి ఆల్ ది బెస్ట్. ఆయన బ్యానర్‌లో నెక్ట్స్ సినిమా కూడా చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్‌గారు ఉప్పెన సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు ది వారియర్ సినిమాకు దాన్ని మించి మ్యూజిక్ ఇచ్చారు. ఆది పిని శెట్టి తన క్యారెక్టర్‌ను క్యారీ చేసిన తీరు చూసి ఆశ్చర్యపోయాను. అలాగే రామ్ నా లవ్‌లీ కో యాక్టర్. తనను అందరూ ఉస్తాద్ అని పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తను ఫ్యాన్స్‌ను నుంచి సంపాదించుకున్న పేరు. తమిళంలోనూ రామ్ స్టార్ హీరో కావాలి. నన్ను ఆదరిస్తున్న ఫ్యాన్స్‌కి థాంక్స్’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బృందా సారథి, లిరిక్ రైటర్ వివేక, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, హీరో ఆర్య, బాలాజీ శక్తివేల్, అన్బు చెలియన్, పార్థిపన్ తదితరులు పాల్గొని ది వారియర్ సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.