చినబాబు (ఎస్. రాధాకృష్ణ) గారికి, వంశీ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను: హీరో గణేష్

225


*సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ వేడుక
*నచ్చేలా తీస్తే చిన్న సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు పెద్ద విజయాలను అందిస్తారు. – హీరో నవీన్ పోలిశెట్టి

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు యువ సంచలనం నవీన్ పొలిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు), బెల్లంకొండ శ్రీనివాస్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.

చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి సినిమా. ఇంతమంది ముందు మాట్లాడటం కూడా ఇదే మొదటిసారి. సినిమా చాలా బాగా వచ్చింది. స్వాతిముత్యం చిత్రం రావడానికి మొదటి కారణం గణేష్. నేను చెప్పిన కథ విని, ఇది నేను తీయగలనని నమ్మిన గణేష్ కి ధన్యవాదాలు. నా సినిమాలో భాగమైనందుకు వర్షకి ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాకి రావు రమేష్ గారి పాత్ర ప్రధాన బలం. రావు రమేష్ గారు, ప్రగతి గారు, నరేష్ గారు, గోపరాజు గారు సినిమాలో నటించిన అందరికి ధన్యవాదాలు. నేను కొత్త వాడిని కావడంతో నాకెంతో అండగా నిలిచారు. నాగవంశీ గారు కథ విని.. నేను కథ చెప్పే విధానం, నా డెమో ఫిల్మ్ చూసి నన్ను నమ్మి అవకాశమిచ్చారు. నాగవంశీ గారికి, అలాగే మాకు అండగా నిలిచిన చినబాబు గారికి ధన్యవాదాలు. నేను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ‘అతడు’ సినిమా చూశాను. అందులో రచన-దర్శకత్వం త్రివిక్రమ్ అనే పేరు చూశాను. అది నాకు బలంగా గుర్తుండిపోయింది. సినిమా చేస్తే ఖచ్చితంగా ఇలా రాయాలి, ఇలా తీయాలి అని అప్పుడే అనుకున్నాను. నా మొదటి సినిమా స్క్రిప్టే త్రివిక్రమ్ గారు చదివి, చాలా బాగా రాశావని ప్రశంసించారు. నేను ఎవరి స్పూర్తితో సినీ పరిశ్రమకు వచ్చానో, ఆయన నా స్క్రిప్ట్ చదివి నాకు భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా డీఓపీ సూర్య అన్నకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఈ సినిమాకి నాతోపాటు కథనం, సంభాషణలు అందించిన రాఘవరెడ్డికి, మా దర్శకత్వ విభాగానికి ధన్యవాదాలు. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అద్భుతమైన సంగీతం అందించారు. కథను అర్థంచేసుకొని కృష్ణ కాంత్ గారు మంచి సాహిత్యం ఇచ్చారు. నాలాంటి ఎందరికో స్ఫూర్తి అయిన మెగాస్టార్ చిరంజీవి గారు స్టేజ్ మీద మా సినిమా పేరు చెప్పి, మాకు ఆశీస్సులు ఇవ్వడం సంతోషంగా ఉంది” అన్నారు.

రావు రమేష్ మాట్లాడుతూ.. “ఇది విజయం సాధించాలని కోరుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా. ధైర్యంగా చెప్పొచ్చు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ సినిమా లో అన్ని పాత్రలు కీలకమే. ప్రతి పాత్ర సినిమా చివరిదాకా ఉంటుంది. ఇంత నిజాయితీగా కథనాన్ని రచించిన లక్ష్మణ్ కి అభినందనలు. ఇది గణేష్ కి సరిగ్గా సరిపోయే పాత్ర. ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. లక్ష్మణ్ ఈ కథ చెప్పగానే గట్టిగా హత్తుకున్నాను. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం చాలా బాగుంటుంది. ఈ స్క్రిప్ట్ ఎంపిక చేసినందుకు వంశీ గారికి, చిన బాబు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ” చినబాబు గారు, వంశీ గారు కొత్త వారికి అవకాశం ఇవ్వడం వారి గొప్పతనం. దర్శకుడు లక్ష్మణ్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనకు చాలా స్పష్టత ఉంది. ఆయన చాలా పెద్ద దర్శకుడు అవుతాడని ఆశిస్తున్నాను. గణేష్ గురించి చెప్పాలి. ‘గణేష్ నవ్వు చాలు.. ఫుల్ అవుతుంది సినిమా హాలు’. ట్రైలర్ లో ఒక డైలాగ్ చెప్పాను ‘క్యారెక్టర్ లో మావాడు స్వాతిముత్యం అని’. నిజంగానే గణేష్ స్వాతిముత్యమే. గణేష్ బాగా నటించాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. నేను కన్నడ అమ్మాయిని కావడంతో అందరూ నన్ను తెలుగు సినిమాలు చూస్తారా అని అడుగుతారు. ‘అతడు’, ‘జల్సా’, ‘అల వైకుంఠపురములో’ లాంటి సినిమాలు వస్తే చూడకుండా ఎవరు ఉంటారు. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన నవీన్ పొలిశెట్టి, సిద్దు,బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అక్టోబర్ 5న విడుదలవుతున్న మా చిత్రాన్ని చూసి అందరూ ఆశీర్వదించండి” అన్నారు.

నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఇదే శిల్పకళా వేదికలో జరిగిన వేడుకలకు పాస్ లు దొరక్క తిరిగి వెళ్లిపోయిన రోజులున్నాయి. అలాంటి నన్ను ఈరోజు ఈ వేదిక మీద అతిథిగా నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. స్వాతిముత్యం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్న బెల్లంకొండ గణేష్ కి స్వాగతం. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. గణేష్ కి, వర్షకి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. సితార బ్యానర్ లో నాగవంశీ గారితో వచ్చే ఏడాది ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో వస్తున్నాను. నాగవంశీ గారు జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత. రాధాకృష్ణ గారు స్థాపించిన ఈ సంస్థను వంశీ గారు మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. నచ్చేలా తీస్తే చిన్న సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు పెద్ద విజయాలను అందిస్తారు. దానికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘డీజే టిల్లు’ వంటి సినిమాలు ఉదాహరణ. స్వాతిముత్యం కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “పిలవగానే ఈ వేడుకకు వచ్చి వినోదాన్ని పంచిన నవీన్ కి ధన్యవాదాలు. అక్టోబర్ 5న స్వాతిముత్యం సినిమా వస్తుంది. ఈ సినిమా అసలు నిరాశపరచదు. థియేటర్ కి వచ్చిన అందరికీ ఖచ్చితంగా వినోదాన్ని పంచుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమా ఫంక్షన్ లో వర్షంలో తడుస్తూ కూడా గుర్తుపెట్టుకొని మా సినిమా గురించి మాట్లాడినందుకు ఆయనకు హృదయకపూర్వక ధన్యవాదాలు. అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ తో పాటు మా సినిమాని కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ” స్వాతి ముత్యంతో హీరోగా పరిచయమవుతున్న గణేష్, మిగతా టీమ్ కి ఆల్ ది బెస్ట్. గణేష్ కి మొదటి సినిమానే చినబాబాబు గారు, త్రివిక్రమ్ గారు, వంశీ గారి గైడెన్స్ లో సితారలో చేసే అవకాశం వచ్చింది. సితార నుంచి ఈ ఏడాది ఇప్పటికే వచ్చిన డీజే టిల్లు, బీమ్లా నాయక్ సినిమాలు ఘన విజయం సాధించాయి. స్వాతిముత్యం కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

గణేష్ మాట్లాడుతూ.. ” మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒక మంచి కథ రావట్లేదు అనుకుంటున్న సమయంలో లక్ష్మణ్ నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పారు. ఈ కథ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు అని నమ్మి ఈ కథ సితార వారు దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది. సితార వారు కూడా ఇది మంచి సినిమా అవుతుందని నమ్మి, అన్నీ సమకూర్చి, ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంత మంచి కథ ఇచ్చిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. చినబాబు గారికి, వంశీ గారికి నేను జీవితాంతం ఋణపడి ఉంటాను. ఈ సినిమాలో హీరోయిన్ గా వర్ష కాకుండా వేరే ఎవరు ఉన్నా నాకు ఇంత సపోర్ట్ దొరికేది కాదేమో. డీఓపీ సూర్య గారు ఇది నేనేనా అని అనుకునే అంత అందంగా నన్ను చూపించారు. ఈ సినిమాకి సంగీతం అనేది ప్రధానం. మహతి స్వర సాగర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. రావు రమేష్ గారు, నరేష్ గారు, ప్రగతి గారు, వెన్నెల కిషోర్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే ఎప్పుడూ అండగా ఉండే అమ్మ, నాన్న, అన్నయ్యకు కృతఙ్ఞతలు. మా అమ్మ చూసి గర్వపడే సినిమా చేశానని అనుకుంటున్నాను. దసరా మన తెలుగు వారికి చాలా పెద్ద పండగ. దసరాకు ఎన్ని మంచి సినిమాలు వచ్చిన ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు ఎన్నోసార్లు రుజువు చేశారు. అలాగే మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాము. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మా సినిమా గురించి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది. చిరంజీవి గారికి ధన్యవాదాలు” అన్నారు.

ఈ వేడుక ఆద్యంతం వినోదభరితంగా నడిచింది. స్వాతిముత్యం చిత్రంలోని ‘ డుం డుం ‘ పాటకు హీరో గణేష్, హీరోయిన్ వర్ష బొల్లమ్మతో కలిసి నవీన్ పోలిశెట్టి డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే చిత్ర హీరో హీరోయిన్లు గణేష్, వర్ష తమదైన శైలిలో టాలీవుడ్ టాప్ హీరోల డైలాగులను చెప్పి మెప్పించారు. ఇలా ఈ వేడుక అంతా ఎంతో ఆహ్లాదకరంగా, సరదాగా సాగింది.