డిజిటల్ వార్తా ప్రపంచంలో సంచలనం.. ” స్వదేశీ డిజిటల్  న్యూస్ ఛానెల్”

501

అనాగరికంగా మనుష్యుల్ని చంపుకునే స్థాయి నుంచి అంతరిక్షంలోకి అడుగు పెట్టే స్థాయికి ఎదిగినా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కుల కోసం పోరాడే ప్రక్రియ  మాత్రం సజీవంగా అలాగే వుంది. అదే నిజమైన ఫోర్త్ ఎస్టేట్. దానినే వార్తా ప్రచార, ప్రసార వ్యవస్థ అంటారు. అదే నాటి చేతి రాతల నుంచి, గోడ పత్రికల నుంచి ప్రారంభమైన వార్తా ప్రచార, ప్రసార విధానం ఈరోజు  క్షణాల్లో దిగంతాలకు వార్తను  చేరవేసే డిజిటల్ విధానాన్ని సంతరించుకుని వాయు, మనో వేగాలతో  పరుగులు తీస్తోంది. ఈ మార్పునకు ప్రతిగా, ప్రతినిధిగా, నిజమైన వార్తానిధిగా  స్వదేశీ  న్యూస్ & బ్రాడ్ కాస్టింగ్ నుంచి సరికొత్త డిజిటల్ న్యూస్ ఛానెల్ రావడం నిజంగా హర్షించ తగిన, ఆహ్వానించతగిన శుభపరిణామమని హైదరాబాద్ దూరదర్శన్  రిటైర్డ్  డైరెక్టర్ శ్రీ ఎం. విజయ భగవాన్ అన్నారు.

స్వదేశీ  న్యూస్ & బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నగరంలోని ప్రెస్ క్లబ్ లో  సరికొత్త స్వదేశీ డిజిటల్ న్యూస్ ఛానెల్ ను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ హనర్ గా పాల్గొన్న శ్రీ భగవాన్  ప్రసంగిస్తూ, గతంలో ఒక వార్త ప్రజలను చేరడానికి కొన్ని దినాలు పట్టేది. తదనంతర కాలంలో అది గంటల నుంచి ఇప్పుడు అది క్షణాలకు చేరింది. మా దూరదర్శన్ కాలం నుంచి ఇప్పటి డిజిటల్ యుగం వరకు వార్తా ప్రసారం లో ఎన్నో పరిణామాలను చూసాం. అయితే మానవ వికాసంలో , శాస్త్ర సాంకేతిక పరిణామ  క్రమంలో  వార్త కూడా అనేక మార్పులకు లోనయ్యింది. డిజిటల్ వార్తా ప్రపంచంలో అనేక వార్తా సంస్థలు వున్నా..అన్నింటిలో ఇది ఒకటిగా ఉండకుండా  నిజాన్ని నిర్భయంగా వెల్లడించే ఒక ప్రత్యేక న్యూస్ ఛానెల్ గా స్వదేశీ డిజిటల్ న్యూస్ ఛానెల్  పేరు తెచ్చుకోవాలని,  వార్తా  ప్రసార రంగంలో విలువలకు పట్టం గట్టే ఛానెల్ గా ముందుకు సాగాలని భగవాన్ ఆశించారు. ఛానెల్  యాజమాన్యాన్ని ఆశీర్వదించారు.

సీనియర్ జర్నలిస్టు, తొలితరం దూరదర్శన్ న్యూస్ రీడర్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ. సెన్సేషన్, బ్రేకింగ్ న్యూస్ తో పాటు సామాజిక బాధ్యతను కూడా ప్రసార మాధ్యమం లోకి తీసుకురావాలన్న ఉన్నత లక్ష్యంతో మొదలైనదే ఈ స్వదేశీ న్యూస్ ఛానెల్.
ఈ ఛానెల్ వాస్తవాన్ని వాస్తవంగా, నిజాన్ని నిజంగా, నిర్భయంగా, అత్యంత వేగంగా, ప్రజల ఎజెండానే తన ఎజెండాగా, నిజాయితీ స్వరంగా  నిలుస్తుందని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రసార మాధ్యమ వ్యవస్థలో ఈ స్వదేశీ న్యూస్ ఛానెల్ నిజమైన ప్రజల గొంతుకగా, చీకట్లో దీప స్తంభంలా ప్రజలకు వెలుగుగా ఉండాలని షరీఫ్ అభిలషించారు.

ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజమౌళి చారి మాట్లాడుతూ, మా ప్రెస్ క్లబ్ లో పుట్టిన ఎన్నో వార్తా సంస్థలు  తదనంతర కాలంలో  రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే స్థాయికి ఎదిగాయని, ఆ కోవలోనే ఈ స్వదేశీ డిజిటల్ న్యూస్ ఛానెల్ కూడా దిన దిన ప్రవర్తమానమై పేరు గడించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు మాట్లాడుతూ, వార్తను వక్రీరించకుండా, ఏ వత్తిళ్లకు లొంగకుండా,  ప్రజల బాధలను, గాధలను నిజాయితీగా, నిర్భయంగా  వెల్లడించే ఏ పత్రికైనా, ఛానెల్ అయినా ప్రజా ఛానెల్ గా దూసుకుపోతోందని, అలాంటి లక్ష్యాన్ని దీక్షగా పెట్టుకున్న ఈ స్వదేశీ ఛానెల్ నూటికి నూరు శాతం విజయం సాధిస్తుందని, ఆ బాటను వీడకుండా మునుముందుకు సాగాలని అభిలాషిస్తూ..యాజమాన్యాన్ని అభినందించారు.

చివరగా స్వదేశీ న్యూస్ ఛానెల్ సిఇఓ నాగేశ్వర రావు మాట్లాడుతూ, బాల్యం నుంచీ సమాజంలో జరుగుతున్న తప్పొప్పులను, అన్యాయాలను, అక్రమాలను చూస్తూ పెరిగాను. నా వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ఎదిగాను. ఆ నేపథ్యంలో  పుట్టిన ఆలోచనే ఈ స్వదేశీ డిజిటల్ న్యూస్ ఛానెల్. అమాయక ప్రజల, నోరులేని దీనుల పాలిట వాయిస్ గా, వారికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే  నిజమైన ప్రజల ఛానెల్ గా స్వదేశీ ఛానెల్ ను నడిపిస్తామని  స్పష్టం చేశారు.
ఈ కార్యక్రంలో ఇంకా పలువురు పాత్రికేయులు, ప్రముఖులు మాట్లాడుతూ కొత్త ఛానెల్ ను ఆహ్వానిస్తూ..మనసారా అభినoదించారు.