స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ విడుదల

142

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ‘డీజే టిల్లు’లో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని” వంటి పలు మాటలు.. టిల్లు అభిమానులతో పాటు సామాన్యులలో కూడా రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి.

‘డీజే టిల్లు’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, టిల్లు పాత్రతో మరోసారి వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా, టిల్లు శైలి సంభాషణలతో ఈ చిత్రం సాగనుంది. ఈ సీక్వెల్ తో మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని అందిస్తామని చిత్రం బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. “టిల్లు” ఫిల్మ్ ఫ్రాంచైజీ నుండి ఈ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ను అందించడానికి సిద్ధంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది.

ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె, పక్కింటి అమ్మాయిలా ఉంటుందనే తన ఆన్-స్క్రీన్ ఇమేజ్‌ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అనుపమ పరమేశ్వరన్ లుక్స్‌తో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు సిద్ధూతో ఆమె కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

మొదటి భాగంలో రాధిక ప్రేమ కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న టిల్లు.. ఇప్పుడు మరోసారి అదే తరహాలో సమస్యల సమూహంలో చిక్కుకున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. అయితే మేకర్స్ కథకి సంబంధించిన విషయాలను ఎక్కువగా వెల్లడించకుండా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ ను అద్భుతంగా రూపొందించారు.

రామ్ మిరియాల స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ తోనే ఆయన.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మొదటి భాగాన్ని మించి అలరించనున్నామనే నమ్మకాన్ని కలిగించగలిగారు.

సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

‘టిల్లు స్క్వేర్’ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.