శిష్యుడి చిత్రానికి సీన్ డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు

584


వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ జంటగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’ . యువతరం ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొయినాబాద్ లక్ష్మీక్షేత్రంలో హీరోయిన్ , తదితరులపై కొన్ని సన్నివేశాలన చిత్రీకరించారు. విశేషమేమిటంటే ఈ సినిమా షూటింగు జరుగుతుండగా వి.ఎన్. ఆదిత్య గురువు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సతీసమేతంగా ఈ సినిమా సెట్ కు వచ్చారు. అంతేకాదు ఓ సన్నివేశానికి కూడా దర్శకత్వం వహించారు. దీనికి వి.ఎన్. ఆదిత్య క్లాప్ కొట్టడం మరో విశేషం.
‘బృందావనం’,‘భైరవద్వీపం’,‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు వి.ఎన్.ఆదిత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పుడు ఎలా క్లాప్ కొట్టారో… ఇప్పుడు మళ్లీ అలా కొట్టడంతో సెట్ లో ఉన్న అంతా ‘క్లాప్స్’కొట్టేశారు. పైగా సింగీతం శ్రీనివాసరావులాంటి దర్శకుడి దర్శకత్వంలో నటించినందుకు నేటి తరం నటులు కూడా ఎంతో సంబరపడ్డారు. హీరోయిన్, ఆమె తల్లిదండ్రుల మీద ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
దీనిపై వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ ‘వాహిని సంస్థలో నేను కొట్టిన క్లాప్ అనుభూతి మళ్లీ ఇన్నాళ్లకు పునరావృతమైంది. నా గురువు సింగీతం గారు మొట్టమొదటిసారి నా సెట్ కు వచ్చారు. అప్పట్లో నాలుగేళ్లు ఆయన దగ్గరే ఉండి వాళ్లింట్లో భోజనంచేసి పెరిగిన కుర్రాడిని నేను. ‘పీపుల్స్ మీడియా’ అధినేత విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభోట్ల కూడా అతిథులుగా మా షూటింగ్ కు వచ్చి మా ఆనందాన్ని వారు కూడా పంచుకున్నారు. నిర్మాత అర్జున్ గారు పట్టుబట్టలు పెట్టి సింగీతం దంపతులను సత్కరించారు. హాప్ డే ఆయన మాతోనే గడిపారు’ అని వివరించారు.
నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ ”ఈ నెలాఖరుకల్లా షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయి . లెజెండరీ డైరెక్టర్ సింగీతం గారు సతీ సమేతంగా మా సెట్ కి రావడం అదృష్టం గా భావిస్తున్నాం . 88 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఎనర్జీ ని చూసి ఆశ్చర్య పోయాం. ఆనాటి జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు. ముఖ్యంగా ‘మాయాబజార్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటి విషయాలు ఎన్నో వివరించారు. ఇప్పటి సినిమాల గురించి , లేటెస్ట్ ఫిలిం మేకింగ్ గురించి, ట్రెండ్స్ గురించి ఆయన చెబుతూ ఉంటే మాకు కాలం తెలియలేదు. ఒక కొత్త కాన్సెప్ట్ తో త్వరలోనే ఒక సినిమా చేస్తానని ఉత్సాహంగా చెబుతుంటే , మేము ఇన్ స్పైర్ అయిపోయాం” అని తెలిపారు.

విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ, వెంకట్
సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్
వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్”
అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ
,భార్గవ్, రామకృష్ణ
తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం .

సాంకేతిక బృందం :
స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి.పతి , సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ , కెమెరా: ఆర్.ఆర్.కోలంచి , ఆర్ట్: జెకేమూర్తి,
ఎడిటర్:ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి , ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్ : సూరపనేని కిషోర్,
నిర్మాత: అర్జున్ దాస్యన్ , కథ – దర్శకత్వం : వి.ఎన్.ఆదిత్య .