శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాంకపై ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో చందర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `సీతారామపురంలో ఒక ప్రేమ జంట`. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆన్ లొకేషన్ లో గురువారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ….“రేపటితో షూటింగ్ పూర్తవుతుంది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగొచ్చింది. ప్రస్తుతం వస్తోన్న ప్రేమకథా చిత్రాలకన్నా ఎంతో విభిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరి. ప్రేమలో ఉన్న ప్రతి జంట చూడాల్సిన చిత్రం. అలాగే తల్లిదండ్రులకు కూడా మంచి సందేశం ఇస్తున్నాం. హీరో గా రణధీర్ పరిచయం అవుతున్నాడు. తనకిది ఫస్ట్ సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోలా ఫైట్స్, డాన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చేశాడు. అలాగే హీరోయిన్ గా నందిని రెడ్డి ని పరిచయం చేస్తున్నాం. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ లో విజయశాంతిలా అద్భుతమైన పర్పార్మెన్స్ కనబరిచింది నందిని. ఇప్పటి వరకు నేను దర్శకుడుగా నాలుగు సినిమాలు చేశాను. ఈ కథ అనుకున్నాక మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా మంచి అవుట్ పుట్ రావడానికి సహకరించారు. ఇటీవల ఫస్ట్ సింగిల్ తలసాని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా లాంచ్ చేశాం. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో మరో సాంగ్ రిలీజ్ చేస్తాం. సినిమాను కూడా మార్చి నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరక్టర్ తో పాటు మా టెక్నికల్ టీమ్ అంతా ఎంతో సహకరించారు“ అన్నారు.
నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ…“ దర్శకుడు వినయ్ బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాం. ఇటీవల విడుదల చేసిన పాటకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్, భద్రాచలం, చిక్ మంగ్‌ళూర్, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. గ్రామీణ వాతావరణంలో జరిగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. కథలో మంచి మలుపులు ఉన్నాయి. హీరోగా పరిచయం అవుతోన్న మా అబ్బాయి రణధీర్ ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా“అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్,ఎస్.నివాస్ మాట్లాడుతూ…“ నన్ను నమ్మి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఇప్పటికే విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో రిలీజ్ అయ్యే పాటలకు కూడా మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది“ అన్నారు.
నటుడు భాషా మాట్లాడుతూ….“ దర్శకుడు వినయ్ బాబు గారితో వర్క్ చేయడం గొప్ప అనుభూతి. ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చిన మా నిర్మాతకు ధన్యవాదాలు“ అన్నారు.
హీరోయిన్ నందిని రెడ్డి మాట్లాడుతూ….“స్టోరి, నా క్యారక్టరైజేషన్ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నా. దర్శక నిర్మాతలు ఒక ఫ్యామిలీ చూసుకున్నారు. ఒక మంచి టీమ్ తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల విడుదలైన పాటలో నా అభినయానికి మంచి పేరు వచ్చింది“ అన్నారు.
హీరో రణధీర్ మాట్లాడుతూ.…“ హీరోగా ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన మా దర్శకుడు వినయ్ బాబు గారికి ధన్యవాదాలు. వినయ్ బాబు గారి సపోర్ట్ వల్లే ఈ సినిమాలో అనుకున్నట్టుగా నటించగలిగాను. ప్రతిదీ నాతో చెప్పి నా దగ్గర నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ఎంతో సీనియర్ సినిమాటోగ్రాఫర్ అయిన విజయ్ కుమార్ గారి ఇచ్చిన సలహాలు, సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మ్యూజిక్ కూడా సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. ఎంతో బిజీగా ఉన్నా గణేష్ మాస్టర్ గారు మా సినిమాలో సాంగ్స్ కంపోజ్ చేశారు. టీమ్ అంతా తమ సొంత సినిమాలా పని చేశారు. హీరోగా నా తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
సుమన్, సూర్య, అమిత్, నిట్టల్, మిర్చి మాధవి, శివ శంకర్, బిహెచ్ ఇ ఎల్ ప్రసాద్, భాష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః ఎస్.ఎస్ నివాస్; కెమెరాః విజయ్ కుమార్.ఎ, ఎడిటింగ్ః నందమూరి హరి; ఫైట్స్ః రామ్ సుంకర; కొరియోగ్రఫీః గణేష్ మాస్టర్, అజయ్ శివ శంకర్; పాటలుః సుద్దాల అశోక్ తేజ; అభినయ శ్రీనివాస్; కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వంః ఎమ్.వినయ్ బాబు.