నా సినిమాల్లో ‘రణరంగం’ బెస్ట్ లవ్ స్టోరీ అంటున్నారు – హీరో శర్వానంద్

775

“ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు” అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ సినిమా గురువారం(15-8-19) విడుదలై, అనూహ్యమైన ఓపెనింగ్స్ సాధించింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

చిత్ర సమర్పకుడు పి.డి.వి. ప్రసాద్ మాట్లాడుతూ “కలెక్షన్లు చాలా బాగున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 7.50 కోట్ల గ్రాస్, రూ. 4.45 కోట్ల షేర్ వచ్చింది. 1985లో గిరిబాబుగారి డైరెక్షన్‌లో వచ్చిన ‘రణరంగం’ను కూడా మేమే నిర్మించాం. అది మంచి సక్సెసయింది. ఆ సినిమా ఆడిన అనేక థియేటర్లలో ఇప్పుడు ఈ ‘రణరంగం’ విడుదలవడం చక్కని అనుభవం. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ చాలా బాగా చేశాడని అంతా ప్రశంసిస్తున్నారు. అలాగే హ్యూమన్ రిలేషన్స్‌ను బాగా చూపించారనే పేరొచ్చింది” అన్నారు.

నటుడు రాజా మాట్లాడుతూ “జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన ‘శివ’ తరహాలో ‘రణరంగం’ ఆడుతుందని ఆశిస్తున్నాం” అని చెప్పారు.

సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి మాట్లాడుతూ “సినిమాకి రెస్పాన్స్ చాలా బాగుంది. విజువల్‌గా సినిమా చాలా క్వాలిటీగా ఉందని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పని చేయడాన్ని నిజంగా ఎంతో ఆస్వాదించాను” అన్నారు.

డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ “ఇది శర్వానంద్ సినిమా అని విడుదలకు ముందే చెప్పాను. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం శర్వానే. ఇప్పటి దాకా నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో దేనికీ రానన్ని ఫోన్లు ఈ సినిమా విడుదలయ్యాక వస్తున్నాయి. నిన్న సెకండ్ షో టికెట్లు దొరకలేదని ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ప్రశాంతి పిళ్లై మ్యూజిక్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాతలు చాలా రిచ్‌గా సినిమాని నిర్మించారు. ఓపెనింగ్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఫిల్మ్ అవుతుంది” అని తెలిపారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ “నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకానికి రుణపడి ఉంటా. రణరంగం’కు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇవ్వాలనుకొని, ఒక ప్రోపర్ యాక్షన్ ఫిల్మ్ తియ్యాలనుకొని ‘రణరంగం’ చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సూపర్బ్ అనే పేరొచ్చింది. ఫైట్ సీన్స్‌ని వెంకట్ మాస్టర్ చాలా నేచురలిస్టిగ్గా కంపోజ్ చేశారు. నా ఫ్రెండ్స్‌గా నటించిన రాజా, ఆదర్శ్, సుదర్శన్లకు మంచి పేరొచ్చింది. తనది చిన్న రోల్ అయినా.. చేసినందుకు కాజల్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. సినిమా రిలీజైనప్పుడు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్ షోకు వచ్చేసరికి ఎబోవ్ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా. ఇప్పటివరకూ ఈ సినిమాలో చేసినటువంటి మాస్ కేరెక్టర్ చేయలేదు. ఇందులో నాకు నేనే నచ్చాను. రెండు దశలున్న కేరెక్టర్‌ను చేసేప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది” అని వివరించారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ