‘రాజా విక్రమార్క’ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది! – సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత ’88’ రామారెడ్డి.

374


సినిమా నిర్మించడానికి డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు. చక్కటి అభిరుచి కూడా ఉండాలి. ‘రాజా విక్రమార్క’ టీజర్ చూస్తే… సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత ’88’ రామారెడ్డి అభిరుచి తెలుస్తుంది. కార్తికేయ గుమ్మకొండ నటనతో కొత్త తరహా కమర్షియల్ సినిమాను నిర్మాతలు ప్రేక్షకులకు అందిస్తున్నారనేది అర్థమైందని, నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని పలువురు ప్రేక్షకులు ప్రశంసించారు.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత ’88’ రామారెడ్డితో ఇంటర్వ్యూ…..

ప్రశ్న: హాయ్ ఆదిరెడ్డి గారు, రామారెడ్డిగారు… ముందు మీ గురించి చెప్పండి!

ఆదిరెడ్డి: మాది తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలంలో గల వెదురుపాక గ్రామం. ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారిది మా ఊరే. డిగ్రీ వరకూ మా ఊరిలో చదువుకున్నాను. తర్వాత వ్యాపారం నిమిత్తం విజయనగరం జిల్లా వెళ్లాను.
’88’ రామారెడ్డి: మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. ఎస్వీ కృష్ణారెడ్డిగారు మా ఊరివాసులే.

ప్రశ్న: ఇద్దరిదీ తూర్పు గోదావరి జిల్లా. ముందునుంచి పరిచయం ఉందా? సినిమాల్లోకి వచ్చాక కలిశారా?
ఆదిరెడ్డి: వ్యాపారంలో మేమిద్దరం స్నేహితులం. మా గ్రామాలు కూడా పక్కన పక్కనే. సినిమాల్లోకి రాకముందు నుంచి స్నేహం ఉంది.
’88’ రామారెడ్డి: ముందు వ్యాపారంలో కలిశాం. ఆ తర్వాత మా మధ్య దూరపు చుట్టరికం కూడా ఉందని తెలిసింది. పదేళ్లకుగా పైగా మా బంధం కొనసాగుతోంది.

ప్రశ్న: వ్యాపారం వేరు… సినిమా నిర్మాణం వేరు. అభిరుచులు కూడా కలవాలి కదా!
ఆదిరెడ్డి, ’88’ రామారెడ్డి: ఇద్దరి అభిరుచులు ఒక్కటే. అందుకని, సినిమా చేశాం. మా ఇద్దరికీ ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవిగారు. మా ఇద్దరికీ నిర్మాతల్లో డాక్టర్ రామానాయుడుగారు ఆదర్శం.

ప్రశ్న: ఈ సినిమా ఎలా మొదలైంది?
’88’ రామారెడ్డి: వినోద్ రెడ్డిగారు అని మా ఊరిలో ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. 200ల సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆయన ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మా ఆదిరెడ్డిగారికి చెప్పాను. ఇద్దరికీ నచ్చడంతో సినిమా ప్రారంభించాం. నిర్మాతగా ‘రాజా విక్రమార్క’ నా తొలి సినిమా. మా ఆదిరెడ్డిగారు ఇంతకు ముందు కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఓ సినిమా విడుదల చేసిన అనుభవం ఉంది.

ప్రశ్న: ఆదిరెడ్డిగారు… ఇంతకు ముందు ఏయే సినిమాలు చేశారు?
ఆదిరెడ్డి: ఉత్తరాంధ్రలో ‘బాద్ షా’, ‘గబ్బర్ సింగ్’, ‘గ్యాంబ్లర్’ తదితర సినిమాలు చేశా. పంపిణీదారుడిగా శ్రీకాంత్ గారు నటించిన ‘రంగా… ది దొంగ’ నా తొలి సినిమా. ఆ తర్వాత ధనుష్, కీర్తీ సురేష్ జంటగా నటించిన ‘రైల్’ సినిమా తెలుగు హక్కులు తీసుకున్నాను. తెలంగాణ, ఆంధ్రాలో రిలీజ్ చేశా. నిర్మాతగా నా తొలి చిత్రమది. ‘రాజా విక్రమార్క’… నిర్మాతగా నా రెండో సినిమా. ఆల్రెడీ గతంలో సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో మంచి సినిమా చేయాలని కొంత విరామం తీసుకున్నాను.

ప్రశ్న: ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన తర్వాత ఎటువంటి స్పందన లభించింది?
’88’ రామారెడ్డి: టీజర్ విడుదల చేసినప్పుడు రెండు మూడు మిలియన్ వ్యూస్ వస్తాయని అనుకున్నాం. కానీ, ఫైవ్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. వ్యూస్ పక్కన పెడితే… టీజర్ చాలా స్టయిలిష్, రిచ్ గా ఉందని చెబుతున్నారు. హాలీవుడ్ స్టయిల్ లో ఉందని కొందరు ఫోనులు చేయడం సంతోషంగా ఉంది. మా దర్శకుడు శ్రీ సరిపల్లి హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేశాడు. ఆ అనుభవంతో మన తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సినిమా చేశాడు.
ఆదిరెడ్డి: మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయకముందు నుండి మంచి బజ్ నెలకొంది. హిందీ రైట్స్ ను 3.25 కోట్లకు కొనుగోలు చేశారు. తమిళ ప్రేక్షకుల నుండి ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. టీజర్ విడుదలైన తర్వాత టాప్ క్లాస్ అని చెబుతున్నారంతా.

ప్రశ్న: ట్రైలర్ ఎలా ఉండబోతుంది?
ఆదిరెడ్డి, ’88’ రామారెడ్డి: ట్రైలర్ మాత్రమే కాదు… సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉంటుంది. న్యూ ఏజ్ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి.

ప్రశ్న: కార్తికేయ గురించి
ఆదిరెడ్డి, ’88’ రామారెడ్డి: హీరోగా వందకు రెండొందల శాతం కష్టపడతారు. వ్యక్తిగా అయితే… ఆయన గురించి మాటల్లో చెప్పలేం. అంత మంచి మనిషి. కరోనా రెండు దశలను దాటుకుని మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం కార్తికేయ. మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.

ప్రశ్న: కార్తికేయ సినిమాల్లో మీకు నచ్చినది?
’88’ రామారెడ్డి: ఆయన చేసిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. అన్నిటి కంటే ‘గ్యాంగ్ లీడర్’ చాలా ఇష్టం. అందులో ఆయన నటన చాలా చాలా బావుంటుంది. అంతకు మించి మా ‘రాజా విక్రమార్క’లో నటించారు. కార్తికేయ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు… ఈ సినిమా మరో ఎత్తు. సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.
ఆదిరెడ్డి: రామారెడ్డిగారు చెప్పినట్టు… సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. అంతబాగా నటించారు. ఇక, కార్తికేయగారి సినిమాల్లో ‘ఆర్ఎక్స్ 100′ ఇష్టం. ’90ఎంఎల్’ కూడా నచ్చింది. ‘గుణ 369’ అయితే నాతో పాటు మా కుటుంబ సభ్యులు అందరికీ ఇష్టం.

ప్రశ్న: కరోనా కాలంలో ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారా? ఇప్పుడు థియేటర్లలో విడుదల పరంగా చేయాలని ఏమైనా?
ఆదిరెడ్డి: థియేట్రికల్ అనుభూతి ఇవ్వడం కోసం తీసిన చిత్రమిది. అందుకని, ఓటీటీలో విడుదల చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. థియేటర్లలో విడుదల పరంగా మాకు ఇబ్బందులు ఏమీ లేవు. ఆంధ్రాలో కొన్ని ఏరియాలు అమ్మేశాం. కొన్ని ఏరియాలు మా దగ్గరే ఉన్నాయి. వాటికి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.
’88’ రామారెడ్డి: సినిమా మీద మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే… నైజాం ఏరియాలో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం. కార్తికేయ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది.

రామారెడ్డిగారి పేరు ముందు ’88’ అని ఉంటుంది. ఎందుకు? అని అడిగితే… నాలుగు సినిమాల తర్వాత చెబుతానని అన్నారు. అదేంటో మీకు తెలుసా?
ఆదిరెడ్డి: నాలుగు సినిమాల తర్వాత చెప్పరేమో (నవ్వులు). ఆయన కొన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచుతారు.

ప్రశ్న: ‘రాజా విక్రమార్క’ తర్వాత మీరు చేయబోయే సినిమా?
రామారెడ్డి: రెండు బౌండ్ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. త్వరలో వివరాలు వెల్లడిస్తాం.
ఆదిరెడ్డి: అన్నీ కుదిరితే… ‘రాజా విక్రమార్క’ సక్సెస్ మీట్ లో కొత్త సినిమా ప్రకటిస్తాం.