మహిళల రుతక్రమం మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని హీరో సందీప్‌ కిషన్‌

183

మహిళల రుతక్రమం మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని సినీ హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. ప్యూరథాన్‌ పేరుతో ఈ నెల 9వ తేదీన పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించబోయే అవగాహన 2కే, 5కే రన్‌ సన్నాహక సమావేశాన్ని బంజారాహిల్స్‌లోని బ్లూ ఫాక్స్‌ హోటల్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ మంజుల అనగాని, దర్శకుడు మెహర్‌ రమేష్, నటి ఝన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మంజుల అనగాని మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బహిష్టు సమయంలో బాలికలను, మహిళలను అంటరాని వారుగా చూస్తున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. మహిళల్లో రుతుక్రమం అనేది సర్వసాధారణమైన విషయమని ప్రతి తల్లి తమ ఇంట్లో ఉన్న భర్త, అన్న, తమ్ముడు, కుమారుడు ఇలా అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలా అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మహిళలు బహిష్టు సమయంలో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో ఎదుర్కొంటున్న ఈ సమస్యపై పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శైలా తాళ్లూరి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. రుతుక్రమం వచ్చినప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉదయం 6 గంటలకు నిర్వహించబోయే 2కే, 5కే రన్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రన్‌లో ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తో, రాకొండ సీపీ మహేష్‌భగవత్, హీరోయిన్‌ కీర్తి సురేష్, సినీ నటుడు సత్యదేవ్, సింగర్‌ సిద్‌ శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమన్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యురాలు షర్మిలా పెండ్యాల, సామాజిక వేత్త పార్వతి సుదర్శన్, ప్రేమా సుదర్శన్, ట్రాన్స్‌జెండర్‌ రచన పాల్గొన్నారు.