ప్రజా నాట్యమండలి కళాకారులకు సరుకులు పంపిణీ చేసిన నిర్మాత ‘ప్రశాంత్ గౌడ్’

816


కరోనా మహమ్మరి విలయతాండవంలో కొట్టుకుపోతున్న పేద బ్రతుకుల పాలిట కల్పతరువులా మారారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, సార్ధక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజానాట్యమండలి కళాకారులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు బాబ్జి సూచన మేరకు ప్రజా నాట్యమండలి కళాకారులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు సమాజాన్ని చైతన్య పరుస్తూ, ప్రజల కోసం పనిచేసే కళాకారులు ఆకలిబాధతో అలమటిస్తుండటం భావ్యం కాదని భావించి వారికి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. ఇంకా ఎవరైనా పేద కళాకారులు ఇబ్బంది పడుతుంటే మా దృష్టికి వస్తే తప్పకుండా వారిని ఆదుకుంటాము..’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత వి.వి.ఏస్. వర్మ, తెలంగాణ ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె, నర్సింహ, రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్రా చారి, డి.వేణుగోపాలచారి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.