పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ‘డిక్కిలోన’ ఫేమ్ కార్తీక్ యోగి దర్శకత్వంలో సంతానం హీరోగా ‘వడక్కుపట్టి రామసామి’

280

గూఢచారి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు విజయాలను సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. విట్ నెస్, సాల వంటి చిత్రాలను నిర్మించడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడా కూడా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ‘వడక్కుపట్టి రామసామి’ పేరుతో తమిళంలో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం కోసం ‘డిక్కిలోన’తో బ్లాక్ బస్టర్ జోడీగా పేరు తెచ్చుకున్న నటుడు సంతానం, దర్శకుడు కార్తీక్ యోగితో చేతులు కలపడం విశేషం.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వి. శ్రీ నటరాజ్ మాట్లాడుతూ.. “పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టి.జి.విశ్వప్రసాద్ మరియు కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల వంటి దూరదృష్టిగల నిర్మాతలు ఉన్నారు. వీరు తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అద్భుతమైన చిత్రాలను అందించారు. మేము తమిళ సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు, మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించాలనుకున్నాము. ఎలాంటి జోనర్ లోనైనా ఒదిగిపోయి అలరించగల నటుడు సంతానంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాము. అనుకోకుండా అతను నటించిన ‘డిక్కిలోన’ సినిమా చూసి.. చిత్ర దర్శకుడు కార్తీక్ యోగిని కలిశాం. ఆయన మాకు ఒక అద్భుతమైన కథను చెప్పారు. వడకుపట్టి రామసామి ప్రముఖ నటుడు గౌండమణి గారి యొక్క ప్రసిద్ధ పాత్రలలో ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీమ్ మెటీరియల్ గా మారింది. కార్తీక్ కథ చెప్పినప్పుడు సినిమా సారాంశం, కథానాయకుడి పాత్ర చక్కగా కుదిరాయి అనిపించింది. రామసామి అనే పేరు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీక అయినందున అందులో చాలా పొరలు దాగి ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు కార్తీక్.. గౌండమణి గారికి వీరాభిమాని. అతని మునుపటి చిత్రం ‘డిక్కిలోన’ కూడా ప్రముఖ నటుడి కామెడీ లైన్‌ల నుండి ప్రేరణ పొందింది. పీరియడ్ కామెడీ-డ్రామాగా తెరకెక్కనున్న వడకుపట్టి రామసామి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుందని మేము బలంగా నమ్ముతున్నాము.” అన్నారు.

సంతానం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికను ఖరారు చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జాన్ విజయ్, ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మారన్, మొట్టా రాజేంద్రన్, నిజల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్వెలిన్ తదితరులు నటించనున్నారు.

సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘విట్ నెస్’ చిత్రంతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్ గా శివ నందీశ్వరన్, ఆర్ట్ డైరెక్టర్ గా రాజేష్, కొరియోగ్రాఫర్ గా షరీఫ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

చిత్రానికి సంభందించి పేరుతో కూడిన ప్రచారచిత్రం విడుదల చేసిన నిర్మాతలు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ రేపు(జనవరి 24న) ప్రారంభం కానుంది అని తెలిపారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.