కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ఐదవ వార్షికోత్సవం

586

ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ఐదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం కాదంబరి పుట్టినరోజు కూడా. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు అలీ, ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ నటులు ఫృథ్వీ, దర్శకులు అజయ్ కుమార్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, కృష్ణ మోహన్ రెడ్డి, యువ నేత కార్తీక రెడ్డి సహా పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు, మనం సైతం సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు ప్రజలు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…సేవ చేసే మనసున్న వారే నా దృష్టిలో గొప్పవారు. సాటివారికి సాయం చేసేవారికి పాదాభివందనం చేస్తా. పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తా. ఆర్థిక ఇబ్బందులతో తమకు అనారోగ్యం ఉందని చెప్పుకోలేక తమలోనే దాచుకుని ఆ వ్యాధితో చనిపోయిన వారిని నేను చూశాను. పేదవారికి జనతా హాస్పిటల్, వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఒకే ప్రాంగణంలో నిర్మించాలనేది నా జీవితకాల కోరిక. నేను పుట్టినరోజులు జరుపుకోవడం త్యజించాను. మనం సైతం పుట్టినరోజే నాకు ముఖ్యం. నేనున్నా లేకున్నా మనం సైతం ఉంటుంది. నా మిత్రులు అలీ, ఫృథ్వీ మనం సైతం బిడ్డను ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. అన్నారు.
నటులు ఫృథ్వీ మాట్లాడుతూ..టీవీ నటుడిగా, పాత్రికేయుడిగా ఉన్నప్పటి నుంచి కాదంబరి నాకు తెలుసు. మంచి మిత్రుడు. ఇక్కడ మన ప్రతిభను గుర్తించి పిలవాలి గానీ మనం ఎవరినీ ఏమీ అడగకూడదు అంటూ నా కెరీర్ ప్రారంభంలో మంచి మాటలు చెప్పారు. నేను ఎన్నో సేవా సంస్థలు చూశాను.
నటులు అలీ మాట్లాడుతూ..అందరు ఆస్తులు సంపాదించుకుంటారు, కాదంబరి పదిమంది దీవెనలు సంపాదించుకుంటున్నాడు. ఆయన పెద్ద జమీందారీ కుటుంబం నుంచి రాలేదు. మధ్య తరగతి వ్యక్తి తను. అయినా ఒక్కడిగా ఎదుగుతూ పైకొచ్చారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ వ్యాఖ్యాతగా మీ అభిమానం పొందాడు. సాటి మనిషికి సాయం చేస్తే దేవుడు మరింత తిరిగి ఇస్తాడు అనేది అన్ని మతాలు చెప్పే నీతి. కాదంబరి ఈ సేవా మార్గాన్ని అనుసరిస్తున్నాడు. అనేక మందికి తను సాయపడటం చూశాను. నా వంతు సాయం తప్పకుండా ప్రకటిస్తా అన్నారు. కార్తీకరెడ్డి మాట్లాడుతూ…నేను సైతం..అంటూ మహాకవి శ్రీశ్రీ సమాజహితంలో భాగమవుతా అంటూ రాసిన మాటల్ని కాదంబరి మనం సైతం అంటూ నిజం చేస్తున్నాడు. అన్నారు.