ట్రైలర్ తో సంచలనం సృష్టించిన మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన

157

వైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌.. వైనాట్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.

ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కట్టిపడేసింది. ఫిబ్రవరి 10న అబు దాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ కొత్త అనుభూతిని ఇస్తోంది. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్లలో సీటు అంచున కూర్చొని ఈ సినిమా చూడటం ఖాయమనేది ట్రైలర్ తో అర్థమైంది. అలాగే ట్రైలర్ సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది.

‘భ్రమయుగం’ కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా 2024, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట మేకర్స్ భావించారు. అయితే మాతృక భాషలో చూస్తే ఆ అనుభూతి బాగుంటుండటంతో పాటు, మరింత థ్రిల్ చేస్తుందన్న ఉద్దేశంతో ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్‌గా జోతిష్ శంకర్, ఎడిటర్‌గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టి.డి. రామకృష్ణన్ వ్యవహరించారు. మేకప్ బాధ్యతలు రోనెక్స్ జేవియర్, కాస్ట్యూమ్స్ బాధ్యతలు మెల్వీ జె నిర్వహించారు.

రచన, దర్శకత్వం: రాహుల్ సదాశివన్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్
మాటల రచయిత: టి.డి. రామకృష్ణన్
సంగీతం: క్రిస్టో జేవియర్
కెమెరా: షెహనాద్ జలాల్,
కళ: జోతిష్ శంకర్,
కూర్పు: షఫీక్ మహమ్మద్ అలీ
మేకప్: రోనెక్స్ జేవియర్
కాస్ట్యూమ్స్: మెల్వీ జె
పీఆర్ఓ: లక్ష్మి వేణుగోపాల్