“సీతారామం” చిత్రం నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది – మధు నంబియార్

210

ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందననూ , విమర్శకుల ప్రశంసలనూ పొందుతోన్న “సీతారామం” చిత్రం అందులోని నటీ నటులకు విశిష్టమైన గుర్తింపును తెచ్చిపెడుతోంది. ఆ అంశం పైనే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “సీతారామం” వంటి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంలో ఓ మంచి పాత్రను పోషించడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందంటున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధు నంబియార్.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి వచ్చి నటుడిగా మారిన తనకు “సీతారామం”లో ఇంటరాగేషన్ ఆఫీసర్ వంటి పాత్ర లభించడం, చిన్న పాత్రే అయినా రష్మిక – సుమంత్ ల కాంబినేషన్ లో చేసిన కీలక సన్నివేశం కావడంతో – ఆ క్యారెక్టర్ గురించి బంధువులు, స్నేహితులు, సన్నిహితులే కాక చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ప్రశంసిస్తూ ఉండడం తనకు ఓ కొత్త ఎనర్జీని ఇస్తోందని అంటున్నారు మధు నంబియార్.
ఈ సందర్భంగా తనకు “సీతారామం”లో మంచి పాత్రనిచ్చి ప్రోత్సహించిన నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్, ప్రియాంక దత్ గార్లకీ, దర్శకుడు హను రాఘవపూడికి, దర్శకత్వ శాఖకు చెందిన రవితేజ చెరుకూరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు మధు నంబియార్.

“సీతారామం”తో పాటుగా ఈ మధ్య వచ్చిన “సర్కారువారి పాట”, “గంధర్వ”, “దర్జా” తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన నంబియార్ ఇప్పుడు మాత్రం కథలో ప్రాధాన్యత వున్న పాత్రలే దక్కుతున్నాయని అంటున్నారు.

ఇప్పటికి 20 చిత్రాల్లో చేశాననీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ – సమంతల “ఖుషీ” చిత్రంలోనూ, బసవరామ తారకం ఆర్ట్స్ పతాకంపై వస్తోన్న నందమూరి చైతన్య కృష్ణ చిత్రంలోనూ, మరో మూడు సినిమాల్లోనూ, ఒక తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంలోనూ, ఓ వెబ్ సిరీస్ లోనూ మంచి పాత్రలు పోషిస్తోన్నట్లు చెప్పారు. అలాగే ప్రధాన చిత్రాలతో పాటు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు జోరుగా సాగుతోన్న ప్రస్తుత తరుణం తనవంటి ఎందరో నటీ నటులకు వరంగా మారిందనీ, విరివిగా అవకాశాల్ని అందిస్తోందని అన్నారాయన. ప్రేక్షకులు కూడా పాత్రలకు తగ్గ నటీ నటులనే ఆదరిస్తూ ఉండడం తనలాంటి ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహకరంగా నిలుస్తోందని చెప్పిన మధు నంబియార్ ప్రేక్షకుల చేత విలక్షణమైన నటుడిననీ, పరిశ్రమ చేత క్రమశిక్షణ కలిగిన నటుడిననీ అనిపించుకోవడమే తన లక్ష్యం అని చెప్పారు.