కొండపొలం ఒక అడ్వెంచెరస్ జర్నీ- దర్శకుడు క్రిష్

573

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండ‌పొలంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్నఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ మీడియాతో ముచ్చ‌టించారు ఆ విశేషాలు…

పుస్తకంగా రాయడం వేరు.. దాన్ని సినిమాగా తీయడం వేరు. పుస్త‌కంలో రాసిన దానిని సినిమాగా తీయాలంటే దానికి కొన్ని పరిమితులుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. అదొక‌ అద్బుతమైన కథ. చ‌క్కటి కథనంతో రాశారు. ప్రతీ ఒక్క ఎపిసోడ్ ఎంతో ఎగ్జైట్‌గా ఉంటుంది. దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం. నీళ్లు లేక గొర్రెల కాపర్లు అందరూ కలిసి వాటిని తీసుకుని కొండమీదకు వెళ్తారు అక్క‌డ జ‌రిగే ప‌రిణామాలేంటి? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదట గోవాకు వెళ్లి షూటింగ్ చేద్దామని అన్నారు. గొర్రెలను అడ‌వుల‌కు తీసుకెళ్తే పులులు వస్తాయని పర్మిషన్ ఇవ్వలేదు. నల్లమల టైగర్ జోన్. కానీ కోవిడ్ వల్ల కుదరలేదు. అందుకే వికారాబాద్ అడవుల్లో షూట్ చేశాం. ఆ పుస్త‌కం రాసిన సన్నపురెడ్డి ఈ సినిమాకు కథనం రాయడం వల్ల నాకు సులభతరంగా మారింది.

కరోనా సమయంలో షూటింగ్ చేస్తున్నప్పుడు వింత వింతగా అనిపించింది. అన్ని షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లాం. మళ్లీ మళ్లీ సిటీకి వచ్చి చేయడానికి వీల్లేదు. మేం కూడా బాయ్‌లానే కెమెరాలను మోశాం. ఇక వెయ్యి గొర్రెలను అడవిలోకి తీసుకెళ్లడం. వాటితో షూట్ చేయడం చాలా కష్టంగా మారింది. అలా కరోనా సమయం, అడవిలో షూటింగ్ చేయడం అనేది సవాళ్లుగా మారాయి.

ఊరి జనాభాకే నీళ్లు లేనప్పుడు.. గొర్రెలకు ఎక్కడి నంచి తెస్తారు. అందుకే వాటిని కొండ ప్రాంతానికి తీసుకెళ్తారు. సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరి అవుతాం. అది చాలా కష్టమైన పని. పిక్ నిక్ వెళ్లడంలా ఉండదు. అడ్వెంచెరస్ జర్నీ. గొర్రెల భాష రాలేదు. కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసింది. ఓ చిన్నపిల్లవాడు వస్తే మాత్రం ఆ గొర్రెలన్నీ కూడా అతని వెనుకే వచ్చాయి. ఆ టెక్నిక్ వైష్ణవ్ పట్టేశాడు.

సాయి ధరమ్ తేజ్ నాకు స్నేహితుడు. వైష్ణవ్‌ను పదో తరగతిలో ఉన్నప్పుడు చూశాను. ఈ సినిమా అనుకున్నప్పుడు ఓ పార్టీలో చూశాను. అప్పటికింకా నీ కళ్లు నీలి సముద్రం రాలేదనుకుంటా. ఈ పాట చూడమని అన్నాడు. వైష్ణవ్ తేజ్ కళ్లు బాగా అట్రాక్ట్ చేశాయి. వైష్ణవ్ తేజ్‌కు మీ కళ్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ గారితో అన్నాను. కాదు కాదు అవి మా నాన్న కళ్లు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కొండపొలం సినిమా చేసి వస్తాను అని పవన్ కళ్యాణ్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఆ తరువాత రత్నం గారికి కూడా చెప్పాను. కారులో బయల్దేరి ఇంటికి వచ్చే సమయంలోనే సినిమాలో హీరో ఎవరా? అని ఆలోచించాను. ఒక్కసారిగా వైష్ణవ్ ఆలోచనల్లోకి వచ్చారు. వైష్ణవ్‌కు ఫోన్ చేసి కలుద్దాం రమ్మని చెప్పాను. సినిమా గురించి మాట్లాడతాను అని వైష్ణవ్ అనుకోలేదు. కొండపొలం గురించి వైష్ణవ్ తేజ్‌కు చెబితే.. మీరు హరిహరవీరమల్లు చేస్తున్నారు కదా? అని అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పాను. అయితే సరే అని వైష్ణవ్ అన్నాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, చిరంజీవి గారితో వైష్ణవ్ ఈ చిత్రం గురించి చెప్పాడు. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్, వాళ్ల అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అలా వైష్ణవ్ లైన్‌లోకి వచ్చాడు.

వైష్ణవ్ తేజ్‌కు నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ అస్సలు ఉండదు. అది అస్సలు అతనికి తెలియదు. సెట్‌లో అందరికంటే ముందుంటాడు. ప్రతీ విషయాన్ని ఎంతో క్షుణ్నంగా పరిశీలిస్తుంటాడు. ప్రతీ సీన్‌ను కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తాడు. సినిమాలంటే ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఉప్పెన లాంటి కథను ఎంచుకున్నాడు.. కొండపొలం కూడా ఎంచుకున్నాడు. ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉంది.

సాధార‌ణంగా మనకు చాలా ర‌కాల భయాలు ఉంటాయి. వాటినుంచి మ‌న‌కు మ‌న‌మే ధైర్యాన్ని ఇచ్చుకోవాలి. ఉదాహర‌ణ‌కు కరోనా అంటే మొదట్లో చాలా భయపడ్డాం. కానీ ఇప్పుడు అంతా నార్మల్‌గానే ఉన్నాం. అలానే రవీంద్ర అనే కుర్రాడు త‌న‌లోని భ‌యాల‌ను జ‌యించి వాటిలోంచి బయటకు రావడమే బికమింగ్.

కొండపొలం అనే సినిమా ఓటీటీకి సరికాదు. దీన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. ఈ చిత్రం ప్రారంభించినప్పుడే మాకు తెలుసు వీఎఫ్ఎక్స్‌కి దాదాపు ఆరేడు నెలలు పడుతుందని. మేం దసరాకు రావాలనే అనుకున్నాం. అనుకున్నట్టుగానే వస్తున్నాం.

ఇప్పుడైతే కొండపొలం డబ్బింగ్ ఆలోచన లేదు. ఒకవేళ ఓటీటీకి వెళ్లుంటే డబ్ అయ్యేది. కానీ రీమేక్ చర్చలు జరుగుతున్నాయి. రాజీవ్ గారు ఆలోచిస్తున్నారు. కానీ ఆ విషయాలు ఇప్పుడే చెప్పలేను.

హరిహర వీరమల్లు, కొండపొలం సినిమాలకు ఒకే టీం పని చేసింది. ముందుగా కీరవాణి తనయుడు కాళభైరవకు ఫోన్ చేశాను. కానీ ఆ తరువాత వెంటనే కీరవాణి గారికి ఫోన్ చేసి కొండపొలం పుస్తకం వెంటనే చదవమని చెప్పాను. రెండు రోజులు టైం ఇచ్చాను. ఆ తరువాత కీరవాణి గారు ఎగ్జైట్ అయ్యారు. మీ కంటే ముందు ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఫోన చేశాను అని చెప్పాను. ఎవరు అని కీరవాణి అడిగారు. కాళ భైరవ అని చెబితే నవ్వారు. ఎవరు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అని నవ్వుతూ అన్నారు. మీరే కావాలి అని కీరవాణితో అన్నాను.

జంగిల్ బుక్‌లాంటి సినిమాను వెంకటేష్ గారితో చేయాల్సింది. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత ఆ సినిమా చేయాల్సింది. కానీ అతడు అడవిని జయించాడు అనే పుస్తకం హక్కులు దొరకలేదు. ఫిల్మ్ మేకింగ్‌లో నాకు నచ్చింది రచనే. ఇప్పుడు నేను హాట్ స్టార్‌కు ఓ కథ కూడా రాస్తున్నాను.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385