సేవా పథంలో జర్నలిస్ట్ ప్రభు దంపతులు

934

ప్రముఖ సినీ జర్నలిస్ట్,దర్శక రచయిత ప్రభు,ఆయన సతీమణి మాధవి కరోనా కష్ట కాలంలో తమ వంతు సహాయంగా 12 రోజుల పాటు రెండు పూటలా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.తమ ఇంట్లో తామే స్వయంగా వంటచేసుకొని,ప్యాకింగ్ చేసుకొని నిమ్స్ హాస్పిటల్ లోనూ, రోడ్ల మీద పేదలకు భోజనం ప్యాకెట్లు ,బిస్కెట్ ప్యాకెట్స్ , ఫ్రూట్స్ , వాటర్ బాటిల్స్ అందజేసి వారి వితరణ శీలత చాటుకున్నారు.

ఈ                                                    సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ” గతంలో హైదరాబాద్ వరదల సమయంలో కూడా మేము వరద బాధితులకు ఆహార పొట్లాలు,వాటర్ బాటిల్స్ ఇచ్చాము. అలాగే చెన్నయ్ వరద బాధితుల సహాయార్ధం భారీ స్థాయిలో బట్టలు,దుప్పట్లు,బిస్కట్ ప్యాకెట్లు పంపించాము. తోటి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో తృప్తి కలుగుతుంది.

ప్రస్తుతం సెకండ్ లాక్ డౌన్ కు ఒక రోజు ముందు నుండి అంటే మే 30 నుండి జూన్ 10 వరకు 12 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుండి పదింటి వరకు వంటచేసుకుని , ప్యాకింగ్ చేసుకొని,11 గంటలకు అవన్నీ కారులో సర్దుకొని ముందుగా రోడ్ల మీద బిచ్చగాళ్ల కు,అనాధ పిల్లలకు ఇచ్చుకుంటూ 12 గంటలకు నిమ్స్ హాస్పిటల్ కు చేరుకొని అక్కడ రోగులకు,వారి అటెండర్స్ కు,సెక్యూరిటీ సిబ్బందికి పంపిణీ చేసి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం రెండున్నర అయ్యేది.భోజనం చేసుకొని మరలా బిస్కెట్స్, ఫ్రూట్స్ కారులో సర్దుకొని సాయంత్రం 5 గంటలకు బయలుదేరి ఏనిమిదింటి దాకా పంపిణీ చేసేవాళ్ళం.

ఈ మొత్తం ప్రాసెస్ లో పంపిణీ కార్యక్రమం చాలా కష్టంగా ఉండేది. జనం మీద మీదకు ఎగబడుతుంటారు… కరోనా సమయంలో అలా ఎగబడటం మాకూ ప్రమాదకరమే అయినప్పటికీ ఆ రిస్క్ తీసుకోవడానికి మేము సిద్దపడే ఈ కార్యక్రమానికి సాహసించాము. ఈ విధంగా 12 రోజుల పాటు నిర్విఘ్నంగా ఈ అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించటంలో నా శ్రీమతి మాధవి సహకారం ,ఆమె ప్లానింగ్,కష్టం మర్చిపోలేనివి . ఇక ముందు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైతే మేము తప్పకుండా మా వంతు సహాయక,సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తాం ” అన్నారు జర్నలిస్ట్ ప్రభు