రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది.. ‘భాగ్ సాల్’ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్

143

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. గురువారం జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్ మాట్లాడింది.

హీరో శ్రీసింహా మాట్లాడుతూ.. ‘భాగ్‌ సాలే సినిమాను చూసి ప్రేక్షకులు రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు. లాజిక్‌లు, పెద్ద పెద్ద ఎమోషన్స్ పక్కనపెట్టేసి ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో సంతోషంగా నవ్వుకునే విధంగా సినిమా ఉంటుంది. సాలే అంటే బూతు పదం కాదు. క్యాచీగా ఉంటుందని పెట్టాం. సినిమా అంతా రింగ్ చుట్టే తిరుగుతుంది. హైద్రాబాద్‌లో షూటింగ్ చేశాం. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. ప్రేక్షకులు వంద శాతం ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ప్రివ్యూ షోలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ రాస్తున్నప్పుడే చాలా నమ్మకంతో ఉన్నాం. సినిమాను ప్రాణం పెట్టి తీశాం. జూలై 7న ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌లో భాగ్ సాలే మూవీని చూడండి’ అని అన్నారు.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా జూలై 7న భాగ్‌ సాలే సినిమాను విడుదల చేస్తున్నాం. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం. ఇటీవల కొన్ని షోలు వేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జాతిరత్నాలు, డీజే టిల్లు సినిమాల తరహాలోనే భాగ్ సాలే మూవీలో కామెడీ ఉంటుంది. మౌత్ టాక్‌తోనే సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగుళూరు, యూఎస్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ జనరేషన్ యూత్‌కు బాగా నచ్చుతుందని అనుకుంటున్నా’ అని అన్నారు.

డైరెక్టర్ ప్రణీత్ బ్రాహ్మాండపల్లి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్‌ పరిసరాల్లోనే షూట్ చేశాం. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. సినిమాలో హీరో అర్జున్‌పై డైరెక్టర్ పూరీ ప్రభావం ఉంటుంది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే డైనమిక్ క్యారక్టర్. హీరోపై బిజినెస్ మ్యాన్ ప్రభావం ఉంటుంది. రాజీవ్ కనకాల పాత్ర చాలా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది.. శ్రీసింహా-రాజీవ్ మధ్య వచ్చే సీన్లు ఆడియన్స్ నచ్చుతాయి. ఒక్క షాట్ విషయంలో కూడా రాజీపడకుండా.. చాలా బాగా తెరకెక్కించాం. సినిమాలో కేసీఆర్ డైలాగ్ చాలా బాగా ఫేమస్ అయింది. డైరెక్టర్ హరీష్ శంకర్‌ నాకు గురువులాంటి వారు. ఆయన సలహాలు తీసుకున్నాను. జూలై 7న అందరూ సినిమాను వీక్షించి, ఆశీర్వదించాల’ని అన్నారు.