నా మొదటి తెలుగు సినిమా ‘పిండం’ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది : కథానాయిక ఖుషీ రవి

47

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక ఖుషీ రవి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

పిండం ప్రయాణం ఎలా మొదలైంది?
మొదట నేను పిండం విన్నప్పుడు మేరీ అనే ఈ తల్లి పాత్ర చేయడం కరెక్టేనా అని ఆలోచించాను. ఎందుకంటే ఇది నా మొదటి తెలుగు సినిమా. అయితే నాకు ప్రయోగాలు చేయడం ఇష్టం. ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ సినిమా చూశాను. మేరీగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తానే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో రుద్ర అనే మరో సినిమా చేస్తున్నాను. అందులో నేను ట్రాన్స్ జెండర్ పాత్ర పోషిస్తున్నాను. ఇలా ఛాలెంజింగ్ పాత్రలు చేయడాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. పాత్రకి ప్రాధాన్యత ఉంటే కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాను.

హారర్ జానర్ చిత్రాలపై మీ అభిప్రాయం ఏంటి?
దియా దర్శకుడు అశోక్ గారిని నేను గురువుగా భావిస్తాను. ఆయన నాకు విభిన్న జానర్లలో చిత్రాలు చేయాలని సూచించారు. నేను దానిని నమ్మి విభిన్న జానర్ సినిమాలు చేస్తున్నాను. ఒకే తరహా సినిమాలు చేసినా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. హారర్ సినిమా అంటే మొదట కాస్త భయపడ్డాను. కానీ చిత్రీకరణ సమయంలో ఎలాంటి భయం లేకుండా నటించాను. నేను సాధారణంగా హారర్ సినిమాలు పూర్తిగా చూడను. ఇదే నా మొదటి సినిమా అవుతుంది.

కెరీర్ ప్రారంభంలో తల్లి పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా?
లేదండీ.. లాక్ డౌన్ తరువాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిపోయింది. ఒకప్పుడు వినోదం కోసం సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు సినిమాలో కొత్తదనం ఏముందని చూస్తున్నారు. కథలో, పాత్రలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు.

మీ పాత్ర కోసం ఏమైనా హోంవర్క్ చేశారా?
నేను మనుషులను ఎక్కువగా గమనిస్తూ ఉంటాను. ఒక పాత్రలో నటించడం కంటే, సహజంగా ఆ పాత్రలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాను.

శ్రీరామ్ గారు, ఇతర నటీనటులతో కలిసి పని చేయడం ఎలా ఉంది?
శ్రీరామ్ గారితో కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూశాను. శ్రీరామ్ గారు పెద్ద నటుడు కదా ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆయన సెట్ లో అందరితో ఎంతో సరదాగా ఉండేవారు. నేను శ్రీరామ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈశ్వరీరావు గారు కూడా సెట్ లో నాతో చాలా బాగా ఉండేవారు. నాకు తెలుగు తెలుసు కానీ స్పష్టంగా రాదు. ఈశ్వరీరావు గారు నాకు తెలుగు విషయంలో సహాయం చేశారు. అలాగే చిన్న పిల్లల ఎనర్జీ మరియు వాళ్ళ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను.

మీ పాత్రకి మీరే డబ్బింగ్ చెప్పారా?
విడుదల తేదీ దగ్గర పడటం, కావాల్సినంత సమయం లేకపోవడం వల్ల డబ్బింగ్ చెప్పలేకపోయాను. భవిష్యత్తులో చెప్తాను.

పిండం తర్వాత నటిగా మీకు ఎలాంటి పేరు వస్తుంది అనుకుంటున్నారు?
ప్రతిభ ఉంటే ఇతర భాషల వారిని కూడా ప్రోత్సహించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. పిండం సినిమా, ఇందులో నేను పోషించిన మేరీ పాత్ర తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను.

మొదటి తెలుగు సినిమా అనుభవం ఎలా ఉంది?
దర్శకుడు సాయికిరణ్ గారు, నిర్మాత యశ్వంత్ గారు పక్కా ప్రణాళికతో చిత్రాన్ని పూర్తి చేశారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇంత వేగంగా పూర్తి చేసి, సినిమాని విడుదల చేస్తుండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయికిరణ్ గారికి ఏం కావాలో స్పష్టత ఉంది. అలాగే యశ్వంత్ గారు కావాల్సినవన్నీ సమకూర్చారు. అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ప్రతిభ గలవారే. అందుకే అంత వేగంగా ఇలాంటి మంచి చిత్రాన్ని రూపొందించగలిగారు.

తెలుగులో మీ అభిమాన నటులు ఎవరు?
అల్లు అర్జున్ గారు, నాని గారు అంటే ఇష్టం. నాని గారి తాజా చిత్రం హాయ్ నాన్న చూశాను. చాలా నచ్చింది.