HomeCeleb Interviewsఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ 'కెప్టెన్' - హీరో ఆర్య ఇంటర్వ్యూ

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ‘కెప్టెన్’ – హీరో ఆర్య ఇంటర్వ్యూ

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మీడియాతో హీరో ఆర్య ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

ప్రశ్న: ‘కెప్టెన్’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? విన్న తర్వాత మీ స్పందన ఏంటి?
ఆర్య : శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో నేను ‘టెడ్డీ’ సినిమా చేశా. ఆ సినిమా తర్వాత ‘కెప్టెన్’ కథతో ఆయన నా దగ్గరకు వచ్చారు. బహుశా, వేరే దర్శకుడు ఈ కథ చెప్పి ఉంటే నేను చేసేవాడిని కాదు. ఆల్రెడీ శక్తితో పని చేసి ఉండటం, ఆయనకు వీఎఫ్ఎక్స్ మీద అవగాహన ఉండటంతో ఓకే చెప్పాను. ఫస్ట్ ఐడియా విన్నాక… ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఆర్మీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. సాధారణంగా ఆర్మీ నేపథ్యం అనగానే… పాకిస్తాన్ లేదా తీవ్రవాదులతో ఫైట్ ఉంటుంది. కానీ, మా సినిమాలో ఒక వింత జీవి ఉంటుంది. దాని వల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉంది? దాన్ని ఏం చేశాం? అనేది సినిమా.

ప్రశ్న: ‘ప్రెడేటర్’ సినిమాలా ఉంటుందా?
ఆర్య : ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత ‘ప్రెడేటర్’లా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, కాదు. ఇది వేరే కథ. ఒక వింత జీవి ఉంది. థియేటర్లలో చూస్తే బావుంటుంది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది.

ప్రశ్న: ‘కెప్టెన్’ షూటింగ్ చేసేటప్పుడు, ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీకు ఛాలెంజింగ్ అనిపించిన విషయాలు ఏంటి?
ఆర్య : వీఎఫ్ఎక్స్ వర్క్స్. ఇటువంటి సినిమాలు హాలీవుడ్‌లో వచ్చాయి. మన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను అక్కడి సినిమాలతో పోలుస్తారు. మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఆ స్థాయిలో చేయలేకపోయామని చెప్పలేం. అందుకని, ఆ విషయంలో చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేశారు. నటుడిగా ఛాలెంజింగ్ అంటే…. క్లైమాక్స్ పార్ట్ షూట్ చేయడం! ప్రచార చిత్రాల్లో చూపించిన జీవి నటీనటుల ముందు ఉండదు. కానీ, ఊహించుకుని షూటింగ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే… భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో సన్నివేశాలు ఉన్నాయి. అవి షూటింగ్ చేయడానికి కష్టపడ్డాను. ఒక్కసారి నీటిలోకి వెళ్ళిన తర్వాత ప్రతిసారి పైకి రాలేను కదా! అందుకని, స్కూబా డైవింగ్ కు ఉపయోగించే ఎక్విప్‌మెంట్‌ మేం ఉపయోగించాం. ఆ మూడు రోజులు కష్టపడ్డాను.

ప్రశ్న: ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ఇదే అనుకుంట!
ఆర్య : అవును. ‘కెప్టెన్’లో క్రియేచర్ మొత్తాన్ని క్రియేట్ చేయడానికి మేం కొంచెం కష్టపడ్డాం. దర్శకుడు శక్తికి వీఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఎలా షూట్ చేయాలో తెలుసు కాబట్టి… నేను రిస్క్ చేశాను. లేదంటే ముందు చెప్పినట్టు వేరే దర్శకుడు అయితే చేసే వాడిని కాదు.

ప్రశ్న: ‘కెప్టెన్’కు సీక్వెల్ ఉంటుందా?
ఆర్య : ‘టెడ్డీ’ సినిమా చివర్లో టెడ్డీ కన్ను తెరుస్తుంది కదా! అలా ఈ సినిమాలో కూడా సీక్వెల్ చేసే విధంగా చిన్న హింట్ ఇచ్చాం. ‘కెప్టెన్’ మంచి విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్ ఉంటుంది.

ప్రశ్న: మళ్ళీ తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?
ఆర్య : అవకాశం వస్తే తెలుగులో చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. ఇప్పుడు తెలుగు, తమిళం అని డిఫరెన్స్ లు లేవు. మన దగ్గర కొరియన్ టీవీ సీరియల్స్ కూడా చాలా మంది పిల్లలు చూస్తున్నారు. అందువల్ల, మంచి సినిమా తీస్తే అందరూ చూస్తారు.

ప్రశ్న : తెలుగులో మీ సినిమాలు చాలా అనువాదం అయ్యాయి. మీకు ఎక్కువ గుర్తింపు ఇచ్చిన సినిమా?
ఆర్య: ‘రాజా రాణి’. అందులో మరో సందేహం లేదు. ‘కెప్టెన్’ కూడా ఆ సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న: ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు, ఇతర ప్రాజెక్టులు
ఆర్య : సిద్ధార్థ్ ‘గృహం’ తీసిన మిళింద్ రావు దర్శకత్వంలో అమెజాన్ కోసం ‘విలేజ్’ వెబ్ సిరీస్ చేశా. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావచ్చు. కార్తీ హీరోగా ‘విరుమాన్’ తీసిన ముత్తయ్య దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాను. కథలు వింటున్నాను. ఓకే అయ్యాక చెబుతా.

ప్రశ్న: మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?
ఆర్య : డ్రీమ్ రోల్ ఏదీ లేదు. నా దగ్గరకు వచ్చిన క్యారెక్టర్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ క్యారెక్టర్‌కు మరొకరు సూట్ అవుతారని అనుకుంటే ఆ విషయం చెబుతాను.

మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్, సౌండ్ డిజైన్ : అరుణ్ శీను, సౌండ్ మిక్స్ : తపస్య నాయక్, కలరిస్ట్ : శివ శంకర్ .వి, వీఎఫ్ఎక్స్‌ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్, స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్, ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి, ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్, సినిమాటోగ్రఫీ : ఎస్. యువ, మ్యూజిక్ : డి ఇమాన్, రచన – దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES