HomeTeluguమూడు చిత్రాలను ప్రకటించిన ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

మూడు చిత్రాలను ప్రకటించిన ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

కొవ్వూరి సురేష్‌రెడ్డి… యానిమేషన్‌ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే. అంతే కాదు… ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్‌ ఇటీవల 30 ఏళ్ళ లోపు వయసు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. గత 13 ఏళ్ళుగా ‘క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్నారు. ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది యానిమేటర్లుగా ఎదగడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అటువంటి సురేష్‌రెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థను స్థాపించిన ఆయన, శుక్రవారం నాడు మూడు చిత్రాలను ప్రకటించారు.

‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం1గా రూపొందనున్న చిత్రానికి ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’, ‘పేపర్‌ బోయ్‌’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘ఛోరి’, ‘మరోజన్మ’, ‘ప్యూర్‌ సోల్‌’ వంటి అవార్డ్‌ విన్నింగ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ రూపొందించిన ఆకాష్‌రెడ్డి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం2గా రూపొందనున్న చిత్రానికి ఉత్తమ కథారచయితగా ‘ఋషి’కి గాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదా సాహెబ్‌ ఫాల్కె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పురస్కారం అందుకున్న రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించనున్నారు. ‘ఋషి’ చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ చిత్రాలకు రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్‌ జామితో కలిసి సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మించనున్నారు.

‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం3గా రూపొందనున్న చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు, ఆయన దగ్గర ఆరు చిత్రాలకు పని చేసిన ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ‘పెళ్ళి గోల’ వెబ్‌ సిరీస్‌, జీ5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైన ‘47 డేస్‌’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. దీనికి రమేష్‌ ప్రసాద్‌గారు సమర్పకులు.

హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మూడు చిత్రాలను ప్రకటించారు. మూడు చిత్రాల ప్రీలుక్స్‌, లోగోలను కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు ఆవిష్కరించారు. ప్రముఖ ఆర్థోపెడిక్స్‌ డాక్టర్‌ దశరథరామిరెడ్డి, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌, నిర్మాత రాజ్‌ కందుకూరి, జీ5లో హెడ్ క్రియేటివ్ & కంటెంట్‌ యాక్వేషన్ నిమ్మకాయల ‌ప్రసాద్, దర్శకులు రాజ్‌ మాదిరాజు, ప్రదీప్‌ మద్దాలి, ఆకాష్‌రెడ్డి, ‘పీ19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ అధినేత కొవ్వూరి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సినిమా లోగోలు ఆవిష్కరించిన అనంతరం రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా నాన్న ఎల్వీ ప్రసాద్‌గారే. ఆయన సంపాదించినదంతా సినిమాల్లోనే పెట్టారు. మాకు హైదరాబాద్‌, చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ముంబై, కలకత్తాలో ఆఫీసులు ఉన్నాయి. నా జీవితమంతా సినిమాతో ముడిపడి ఉంది. మేం ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లో కొన్ని సినిమాలు నిర్మించాం. ఇంకా నిర్మిస్తాం. మేం చిత్రనిర్మాణం కొనసాగించాలని అనుకుంటున్నాం. ఈ రోజు మూడు చిత్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉంది.’’ అని అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES