షరీఫ్ జీవన నేపథ్యం యువతకు స్ఫూర్తిదాయకం!

1085

ఓ దృశ్యం పండాలంటే .. ముందుగా సదరు దర్శకుడు తన మనో పలకంపై దాన్ని చిత్రించుకోవాలి. పాత్రలు, వాటి స్థాయీ బేధాలనూ విశ్లేషించుకుంటూ కథానుగుణమైన రీతిలో సన్నివేశ చిత్రీకరణ చేయగలగాలి. అలాంటప్పుడే ఏ సన్నివేశమైనా తెరపై పూర్తిగా పండుతుంది. ప్రేక్షకుల హృదయాల్లోనూ నిలిచిపోతుంది. అయితే మనకు ఇలాంటి నిష్ణాతులు ఉన్నారా? ఉంటారా? ఒకేసారి అనేక కథలను తెరపై మలిచేందుకు ఒప్పుకున్నప్పుడు అన్నింటికీ న్యాయం చేయగలిగే తీరిక , ఓపిక.. అన్నింటికీ మించి తాను అనుకున్న రీతిలో తీయగలిగే పరిస్థితి వారికి ఉంటుందా? ఇలా అష్టావధానాలు చేయడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలోనూ బహుకొద్ది కొందరి జాబితాలోకి వచ్చే వ్యక్తి మహమ్మద్ షరీఫ్. ఆకాశమే హద్దుగా వచ్చిన అవకాశాన్ని విడవకుండా, వాటికి సమపాళ్లలో పూర్తి న్యాయం చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న ఓ చైతన్య కెరటం ఆయన.
షరీఫ్… ఈ పేరు వింటే చాలు.. ఎన్నో ఏళ్ల తెలుగు బుల్లితెర తిరిగిన మలుపులు కళ్లల్లో మెదులుతాయి. కథలో కొత్తదనం, పాత్రల్లో నవ్యత, చిత్రీకరణలో అసాధారణ ప్రజ్ఞా పాటవాలు ఆయన సొంతం. బుల్లితెర పురుడుపోసుకున్నప్పటి నుంచి ఎందరో..ఎందరెందరో దర్శకులు వచ్చారు. వారు తామెంచుకున్నదారిలో కథలేకే పరిమితమయ్యేవారు. కానీ, షరీఫ్ లాగా ‘మల్టీ టాస్కింగ్’ జోలికి వెళ్లేవారు కాదు. ఇక్కడే ఆయన గొప్పతనం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఆయనకు కథే హీరో. ఆ కథలో కీలక భూమిక పోషించేది గొప్ప గొప్ప పేరున్న నటీనటులా అన్నది ఆయనకు నిమిత్తం లేదు. కథను నమ్ముకున్నారు. ఆ కథనే తాను అనుకున్న రీతిలో నడిపించారు.. అవిశ్రాంతంగా నడిపిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఎవరూ ఊహించని, ఎవరి ఊహకు అందని విధంగా తనదైన దారిలో వెనుదిరగకుండా , నచ్చిన గమ్యం వైపునకు ఓ బాటసారిలా తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు. అలుపెరుగని ఈ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, తాను నడిచేది రహదారి అని షరీఫ్ కు తెలుసు. అందుకే ఆయనకు ఎదురేలేదు… ఆయన గమ్యాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఏదో ఒక రంగంలో విశేషంగా కృషి చేసినవారిని ప్రతిభావంతులంటారు. అదే.. వివిధ రంగాల్లో పనిచేస్తే బహుముఖ ప్రతిభాశాలి అంటారు. కానీ రచయితగా, ఆకాశవాణి, దూరదర్శన్ న్యూస్ రీడర్ గా, బుల్లితెర నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, ఫిలిం మేకర్ గా ఇలా విభిన్న కోణాల్లో ఆయన ప్రతిభ వెలుగులు విరజిమ్మింది. అంతే కాదు, బ్యాంక్ మేనేజర్ గా, అనువాదకుడిగా, కవిగా, జర్నలిస్ట్ గా ఆయన ప్రతిభా పాటవాలు జగమెరిగిందే! ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు… మహాపురుషులవుతారు’ అన్నది షరీఫ్ కు అక్షరాలా సూటవుతుంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దానికీ ఓ కారణం ఉంది. సకల రంగాల్లో రాణించడమంటే మాటలు కాదు.. చేతలు కావాలి. అలాంటి చేతల్ని తన చాకచక్యంతో కృషి, పట్టుదలతో సాధించిన వైనం ప్రస్ఫుటంగా కళ్లెదుటే కనిపిస్తోంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన షరీఫ్ జీవన పయనం అలా..ఇలా సాగలేదు. మనం అనుకున్నంత.. ఊహించినంత ఆనందంగా ఏమీ లేదు. అందులో ఎన్నో కష్టాలు.. మరెన్నో వ్యధలు వెరసి ఆయన ప్రయాణాన్ని ప్రశ్నించుకుంటూ నడిపించాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లో ఓ నిరుపేద రైతు కుటుబంలో పుట్టి పెరిగిన షరీఫ్ అక్కడే ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అటు తరువాత ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉస్మానియాలో చేరి పీజీ డిగ్రీ పట్టాను పొందారు. 1983లో ఆకాశవాణిలో ఇరవై ఐదు రూపాయల పారితోషికంతో న్యూస్ రీడర్ గా జీవితాన్ని ప్రారంభించారు. అలా వేసిన తొలి అడుగులు వెనుదిరగకుండా నిరంతరం ముందుకు సాగేలా చేశాయి. ఆ రోజుల్లో తెలుగులో వార్తలు చదవడంలో షరీఫ్ తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకున్నారు. ఆయన ఉచ్ఛారణ, పదాలు పలకడంలో స్పష్టత శ్రోతల హృదయాలను గెలుచుకుంది. అదే సమయంలో షరీఫ్ ప్రతిభను గుర్తించిన దూరదర్శన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికింది. ఫలితంగా 1984లో తెలుగు న్యూస్ రీడర్ గా దూరదర్శన్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ విధంగా ఆయన ఇక్కడ కూడా రాణించారు. అతడి ప్రతిభ పరిమళించి పరవళ్ళుతొక్కింది. వార్తలు చదవడంలో ఓర్పు, నేర్పు ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. షరీఫ్ ప్రతిభను గుర్తించిన వివిధ సచ్ఛంద సంస్థలు అతడిని సత్కరించాయి. ఉత్తమ న్యూస్ రీడర్ గా లెక్కలేనన్ని పురస్కారాలు వరించాయి. నాడు ఫిలిం అండ్ కల్చరల్ అసోసియేషన్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో ఉత్తమ న్యూస్ రీడర్ గా షరీఫ్ ఎంపికయ్యారు. ఆ అవార్డును ప్రఖ్యాత కథానాయకుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా అందుకోవడం తన జీవితంలో మరపురాని, మరచిపోలేని, అపూర్వ ఘట్టమని షరీఫ్ అంటారు. అదీ.. ఆయనలోని గొప్ప నిరాడంబరత. పదుల డిగ్రీలు.. వందల పురస్కారాలు.. వేలల్లో సహాయం పొందిన వారు.. ఎన్నో ప్రశంసలు.. మరెన్నో ఆశీస్సులు. వీటన్నిటినీ సాధించిన క్రమంలో ఆయన నడిచొచ్చిన దారి తరచి చూస్తే జీవితంలో పోరాటాన్ని ప్రేమించారు.. కష్టాలను స్నేహితుల్లా భావించారు. జీవితంలో ఎదురైన ప్రతి ఛాలెంజ్ ను చిరునవ్వుతో స్వీకరించి విజయ బావుటా ఎగురవేసారు. మాతృభాష కాని తెలుగులో ఆయన సాధించిన విజయాలు వెలకట్టలేనివి. ఇప్పుడాయనపైన కురుస్తున్న అభినందనల వెల్లువ మాత్రమే మనం చూస్తున్నాం. కానీ ఆయన బాల్యంలోకి తొంగిచూస్తే ఈ స్థితికి రావడానికి ఆయన హృదయం ఎంతలా శ్రమించిందో, ఎన్ని విమర్శలు, ఎన్నెన్ని అవమానాలు, మరెన్ని ఛీత్కారాలు భరించిందో తెలిస్తే మనసున్న ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లక మానవు. ఆయన వేసిన ప్రతి అడుగులో నేలకు కాలికి మధ్య గుచ్చిన ముళ్ళెన్నో!? బుడి బుడి అడుగులు వేసే సమయంలో కానరాని తండ్రి.. కళ్ళకు కనిపించేది అమ్మ ఒక్కరే. అమ్మే నాన్నలా జీవితాన్నిచ్చింది. బాల్యంలోనే మనసులో ఏర్పడిన గాయం నిరంతర సాధన వైపు పురికొల్పింది. చేస్తున్న పనిలో చదువుతున్న చదువులలో ముందంజలో వుండాలనే కసి, పట్టుదల చిన్నప్పుడే అర్ధమయ్యింది. వెనక్కు తిరిగి చూడలేదు. ముస్లిం కుటుంబ నేపధ్యం కావడం వలన షరీఫ్ స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణ చూసేవారికి అబ్బురమనిపించేది అంతే మోతాదులో అసూయ ద్వేషాలు కూడా చవిచుడాల్సి వచ్చేది. నాగర్ కర్నూల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ లో పిల్లలతో నాటకాలు వేయించేవారు. ఆ సమయంలో షరీఫ్ మాట్లాడే తెలుగులోని స్పష్టతకు ముగ్ధుడైన లక్ష్మీపతి అనే ఓ టీచర్ ఆరవ తరగతిలో వుండగా ఆదర్శ మైత్రి నాటకంలో శ్రీకృష్ణుడు పాత్రలో నటింపజేసి ప్రోత్సహించారు. చదువు సంధ్యలలో ఆటపాటల్లో బాల్యం నుండి షరీఫ్ స్థానమెప్పుడూ ప్రధమస్థానంగానే కొనసాగింది. పై చదువుల కోసం హైదరాబాద్ వివేకవర్ధిని కాలేజీ లో ప్రవేశించిన తరువాత ప్రతిభ వున్న శిష్యుని మరింత సానపెట్టే సరైన గురువు మార్గనిర్దేశం లభించింది. నాగర్ కర్నూల్ హై స్కూల్ లో తెలుగు లెక్చరర్ భగవంత్ రావు ప్రోత్సాహంతో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్నారు షరీఫ్. తెలుగు భాషపై పట్టువున్న వారికే ఆయన పట్టం కట్టేవారు. ఆవిధంగా గురువు నుండి షరీఫ్ కు పూర్తి ప్రోత్సాహం లభించింది. డిగ్రీ చదువుతున్నప్పుడు మరొక మంచి గురువు సర్వేశ్వర రావు, కాశీ నాథుని నాగేశ్వరరావు, గాయత్రి మేడం అండ దొరికింది. ఇలా అన్ని స్థాయిలలో తెలుగు మాతృభాషగా వున్న తోటి విద్యార్థులను త్రోసిరాజని దూసుకు పోయారు. పాలమూరు జిల్లా కొల్లపూర్ మండలం చౌటబెట్ల గ్రామంలో మహబూబ్ బీ, గోకారి సాహెబ్ ల మూడవ సంతానంగా జన్మించిన షరీఫ్ మూడవ తరగతిలో వుండగానే తండ్రి కాలం చేసారు. నాగర్ కర్నూల్ లో పుట్టింటికి చేరుకున్న తల్లి మహబూబ్ బీ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించగా, చిన్నప్పటినుండీ తల్లి మాటను తు .చ తప్పకుండా పాటించి అమ్మ చూపించిన బాటలో నడచి నేడు ఉన్నత శిఖరాలు అధిరోహించారు. షరీఫ్ మహమ్మద్ సహధర్మచారిణి శ్రీమతి పర్వీన్ షరీఫ్, కొడుకు సోహెల్ యం.బి.ఏ ఫైనల్ ఇయర్ కాగా, కూతురు జూహీ డిగ్రీ చదువుతోంది. షరీఫ్ తెలుగు భాషను యింతగా ప్రేమించి ఆవాహన చేసుకున్నా, రెండు రకాల వివక్షను ఎదుర్కొన్న విషయం మరచిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగమైన తెలంగాణా ప్రాంత తెలుగు భాష యాస పై విమర్శలు ఒక రకమైనవైతే, ఒక ముస్లిం మాట్లాడే తెలుగులో తెలుగుదనం ఎంతనే వెటకారం రెండవ రకమైన విమర్శ. అయితే ఆయనపై వచ్చే విమర్శలకు తాను సాధించిన ఫలితాలతోనే సమాధానమిచ్చే వారు ఆయన.. యింతటి స్పష్టమైన ఉచ్చారణ, తెలుగు భాషపై పట్టు వున్నా, అవకాశాల కోసం గుంటూరు ప్రాంత వాసి అని చెప్పుకోమని కొందరు ఆంధ్ర ప్రాంత మిత్రులు యిచ్చే సలహా సున్నితంగా తిరస్కరించి జన్మభూమిపై మమకారాన్ని విడుచుకోలేని నిజమైన తెలంగాణా బిడ్డ షరీఫ్. 1981 కౌలాలంపూర్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఆంధ్రప్రదేశ్ నుండి వ్యాస రచన పోటీలో పాల్గొని ‘తెలుగు వెలుగులు’ అనే తన వ్యాసానికి ప్రధమ స్థానం కైవసం చేసుకున్నారు షరీఫ్. కాలేజీ చదివే రోజులలోనే వివేక వర్దిని కాలేజీ లో వివేక్ మ్యాగజైన్ ఎడిటర్ గా రెండేళ్లు ఎంతో యిష్టంగా పనిచేసారు. ఆ తరువాత ఈనాడు లో సబ్ -ఎడిటర్ గా జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన ఆయన అదే సమయంలో ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ న్యూస్ రీడర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, దానికి దరఖాస్తు చేసుకున్నారు. మధురమైన కంఠ స్వరం.. తీరైన రూపం భాషొచ్చారణలో గొప్ప పట్టు ఇంకేముంది? అవకాశం షరీఫ్ నే వరించింది. ఆకాశవాణి, దూరదర్శన్, వెండితెర ఆయన జీవితంలో భాగమయ్యాయి. వాటిలో ఆయన అదేవిధంగా మమేకమయ్యారు. ‘శుభోదయం’ మాసపత్రిక ఎడిటర్ గా, పబ్లీషర్ గా ఐదు సంవత్సరాలు మాసపత్రికను విజయవంతంగా నడిపారు. కార్యక్షేత్రమేదైనా శిఖరస్థాయికి చేరుకోవాలనుకోవడమే కాదు, అక్కడున్న ఆశ్రితులకు ఆపన్న హస్తం అందించి ఆదుకోవడం షరీఫ్ కు ఒక వ్యసనంలా వుండేది. పని దొరకక జీవన మలి సంధ్యలో తారాడే వృద్ధ కళాకారుల పట్ల షరీఫ్ ప్రత్యేక బాధ్యతను చేపట్టేవారు. న్యూస్ ప్రజెంటర్ గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, జర్నలిస్టుగా, బ్యాంక్ మ్యానేజర్ గా వారు అడుగు పెట్టిన ప్రతిచోటా తనదైన ముద్రను వేయగలిగారు. అన్నింటికీ మించి ఆయనలోని దాతృత్వం మానవీయ కోణం ఉన్నతమైనది.. ఆదర్శనీయమైనది.. ఆచరణీయమైనది .ఇక సినిమా రంగంలో నటుడిగా’ పంచముఖి;, ‘థర్డ్ మాన్’ చిత్రాల్లో నటించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘నెలవంక’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా, రాధ హీరోయిన్ గా వచ్చిన చివరి చిత్రం ‘మంజీరా నాదం’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, హీరో కృష్ణ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన ‘ఇష్కు హుఆ తుమ్ సే’ చిత్రానికి కో – ఆర్డినేటర్ గా పని చేశారు. ఈయనకు సామాజిక బాధ్యత మానవీయతే కాదు జీవకారుణ్యమూ ఎక్కువే. భక్తి పేరుతో నోరులేని జంతువులను బలులుగా సమర్పించడాన్ని తీవ్రంగా నిరసించారు. మూఢనమ్మకాలు అంధ విశ్వాసాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలనుకున్నారు. అందుకోసం ప్రజలకు వాటిపై అవగాహన కలిగించేందుకు 1995 లో జీవకారుణ్యం అనే టెలీ ఫిలిం స్వీయదర్శకత్వంలో నటించి స్వయంగా నిర్మించారు. అందుకు గాను ఉత్తమ కథా రచయితగా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాతతో పాటు ఉత్తమ సహాయ నటుడిగాను నాలుగు రాష్ట్ర ప్రభుత్వపు నందులను ప్రశంసలను సొంతం చేసుకున్నారు. ఎస్ఐఈటి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్ పాఠాలలో షరీఫ్ గొంతు చిరస్థాయిగా నిలిచిపోయింది. పర్యావరణ ప్రేమికుడైన షరీఫ్ పారిశ్రామిక అభివృద్ధి పేరుతొ జరుగుతున్న ప్రకృతి హననాన్ని చూసి వేదన చెందారు. నివాస ప్రాంతాలలో పరిశ్రమలకు అడ్డగోలు అనుమతులు యివ్వడం వలన గాలి నీరు వాతావరణంలో రసాయన విష పదార్ధాలు చేరిపోయి చిన్న పిల్లలు వృద్ధులపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. 2002 లో దేశ వ్యాప్తంగా ఏడుగురు బ్లూ బేబీస్ పుట్టగా, వారిలో ఐదుగురు పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోనే అంటే అక్కడి పర్యావరణం ఏ స్థాయిలో విధ్వంసానికి గురయ్యిందో అర్ధం చేసుకోవచ్చని షరీఫ్ అన్నారు. ఇలా ప్రకృతి ధ్వంస రచన చేసుకుంటూ పోతే మన తరువాతి తరాలకు ఆస్తులు ఇవ్వగలమేమో కానీ, ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వలేమని భవిష్యత్తరాల ఆయు:క్షీణతకు నేటి పారిశ్రామిక విధానమే కారణంగా నిలుస్తుందని అందుకు ఇప్పటికే నగర శివార్లలోని పటాన్ చెరు ప్రాంతంలో విషతుల్యమైన పరిసరాలను అక్కడ ధ్వంసమైన జీవన విధానాన్ని “ఏ హెల్ ఆన్ ఎర్త్” (భూమ్మీది నరకం)లో అనే డాక్యుమెంటరీలో పట్టిచూపించారు. ఈ డాక్యుమెంటరీ ముంబయిలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో విమర్శకుల ప్రశంసలను చూరగొనగలిగింది. నిజాం నవాబుల నిర్మాణ శైలికి హైదరాబాద్ నగర ప్రతిష్టకు మకుటాయమానంగా నిలిచిన నిన్నటి ఘనం నేటి గతం అయిన నవాబుల వారసత్వ సంపద హైదరాబాద్ రాజమహల్ మీద నిర్మించిన ‘ప్యాలసెస్ ఆఫ్ హైదరాబాద్’, జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
అలాగే దూరదర్శన్ లో ప్రసారమైన ‘కొత్త బంగారు లోకం’ డైలీ సీరియల్ దేశంలోనే మొట్టమొదటి ఎనివిరాన్మెంటల్ సీరియల్ దీనికి నిర్మాత, దర్శకుడు,స్క్రీన్ ప్లే ఆయనే. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో నిర్మించిన ఈ సీరియల్ అందరి మన్ననలు పొంది ఆయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టింది. ఎంచుకున్న ప్రతి రంగంలో తనదైన ముద్రను వేయగలిగారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టుగా తోటి జర్నలిస్టుల ఆర్ధిక పరిస్థితి గుర్తెరిగి, కోవిడ్ 19 పాండమిక్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కష్టకాలంలో నిరుపేద జర్నలిస్టుల కష్టాలను మరచిపోలేదు. ఏ జర్నలిస్టు సంఘంలో వున్న వారైనా అర్హులే అని చెప్పి తన షరీఫ్ మీడియా ఆధ్వర్యంలో 300 మంది జర్నలిస్టులకు నిత్యవసరాలను పంపిణీ చేసారు. అంతేకాకుండా, అనేక స్వచ్ఛంద సంస్థలతో కలసి ఆపన్నులను సుమారు రెండు వేల కుటుంబాలను ఆదుకున్న ఉన్నత భావాలు కలిగిన సహృదయుడు, పరిపూర్ణ వ్యక్తిత్వమున్న షరీఫ్ ను అందరూ కొనియాడారు. కోవిడ్ సమయం లో సేవలు అందించినందుకు గాను లండన్ లో జరిగిన డబ్ల్యూ హెచ్ డి వరల్డ్ హ్యుమానిటేరియం డ్రైవ్ అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమంలో స్టార్సు ఆఫ్ కోవిడ్ -19, విశ్వ గురు వరల్డ్ రికార్డ్ సంస్థ అంతర్జాతీయ కరోనా వారియర్ అవార్డులు షరీఫ్ అందుకున్నారు. టెలివిజన్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి గా, అటు టీవీ రంగానికి చెందిన సమస్యలను, ఇటు మైనారిటీ జర్నలిస్టులకు షరీఫ్ అందిస్తున్న సేవలను అభినందించకుండా ఉండలేం. మొదట్లో కొన్ని డాక్యుమెంటరీ చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన షరీఫ్ తరువాత సొంతగా అనేక కార్పొరేట్ ప్రచార చిత్రాలను రూపొందించారు. సురభి కళాకారుల జీవితంపై షరీఫ్ తీసిన డాక్యుమెంటరీకి 1993లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును అందజేసింది. 1995లో మూఢ నమ్మకాలతో జంతువులను బలి ఇవ్వడంపై నిర్మించిన సందేశాత్మక టెలి ఫిలిం ‘జీవ కారుణ్యం’కు ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు. పారిశ్రామిక కాలుష్యంపై నిర్మించిన ‘ఎ హెల్ ఆన్ ఎర్త్’ చిత్రాన్ని 2002లో ముంబాయిలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివెల్ లో ప్రదర్శించారు. ఈ రోజుల్లో ప్రతీ ఛానెల్ లో వస్తున్న క్రైమ్ స్టోరీలకు ఎపిసోడ్సు కి ఆద్యుడు షరీఫ్. జెమిని టీవీలో తొలిసారిగా ‘పోలీస్ ఫైల్’ని ప్రసారం చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడమే కాక , చట్టంపై అవగాహన, నేరప్రపంచం పట్ల అప్రమత్తంగా ఉండాలనే చైతన్యాన్ని కలిగించారు. 150 ఎపిసోడ్సుకి పైగా ప్రసారం అయిన ఈ సీరియల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేలా చేశారు. ఈ సీరియల్ స్ఫూర్తితోనే ప్రముఖనటుడు సాయికుమార్ పలు పోలీస్ సినిమాల్లో నటించారు. ‘ఈ మూడు సింహాలు నీతికి, నిజాయితికి, న్యాయానికి , చట్టానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అనే సూపర్ డూపర్ పాపులర్ డైలాగ్ షరీఫ్ కలం నుంచి జాలువారిందే కావడం గమనార్హం! బుల్లితెర కళాకారుల సేవలో గత పదేళ్లుగా తలమునకలై ఉన్నారు. టెలివిజన్ ప్రొడ్యూసర్ల కౌన్సిల్ అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు షరీఫ్. నిర్మాతలకు ప్రకటనల మధ్య వివాధాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడం, టీవీ కళాకారులకు ఇంటి స్థలాల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు, తుపాను బాధితులకు టీపీసీ ద్వారా సహాయం అందించడం, మన టీవీ ఛానెల్ లో కళాకారులకు అవకాశాలు కల్పించారు. గ్రామీణ ప్రాంత పెద్ద పిల్లలకు ప్రతీ ఏటా నోట్ పుస్తకాలు ఉచితంగా అందించడం, టీవీ కళాకారులకు ప్రతీ ఏటా అవార్డులతో సత్కరించడం మొదలైన సహాయ కారక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. ఇక షరీఫ్ అందుకున్న అవార్డులు .. పురస్కారాలకు లెక్కేలేదు. ఆ అవార్డులతో ఇల్లు నిండిపోయింది. రాష్ట్రీయ గౌరవ్ పురస్కార్ (ఢిల్లీ), బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఢిల్లీ), రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు, బెస్ట్ న్యూస్ రీడర్ ఇన్ తెలుగు పురస్కారం (13 సార్లు), సినిమా రంగానికి సంబంధించిన రచన, దర్శకత్వం, నిర్మాతగా రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు, జాతీయ పర్యావరణ కార్యకర్తగా అవార్డు. ప్రోగ్రెసివ్ జర్నలిస్టు ఫోరమ్ వారి చేత 2010-2020 దశాబ్దపు లెజెండ్ ఆఫ్ డికేడ్ పురస్కారం, సందేశాత్మక టెలీ ఫిలిం జీవకారుణ్యంకు లభించిన ఉత్తమ దర్శకుడు అవార్డు, హైదరాబాద్ ఫిలిమ్ అండ్ కల్చరల్ అసోసియేషన్ -ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఉత్తమ న్యూస్ రీడర్ గా ఎంపిక, టెలివిజన్ రంగంలో జాతికి చేసిన విభిన్న సేవలకు గాను 2017లో బెంగుళూరుకు చెందిన ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటీ పీస్ అండ్ ఫ్రెండ్ షిప్ సొసైటీ నుండి మాజీ రాష్ట్రపతి భారతరత్న డా. ఏపిజె అబ్దుల్ కలాం ఎక్సులెన్సీ అవార్డు స్వీకరించారు, హైదరాబాద్ ఫిలిమ్ జర్నలిస్టు కౌన్సిల్ వారిచే 2016 లో బెస్ట్ ఫిలిమ్ డైరెక్టర్ అవార్డు, 2016లో ఢిల్లీ లో శిఖరం ఆర్ట్ థియేటర్ వారి తెలుగు తేజం పురస్కారం, 2002 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ వారి బెస్ట్ టీవీ పర్సనాలిటీ అవార్డు, క్రియేటివ్ కల్చరల్ సర్కిల్ అవార్డ్ ఫర్ ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ టీవీ, 2017 లో ఆల్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మైనారిటీస్ కమిటీ నుండి “బంగారు తెలంగాణ అవార్డ్, 2015 లో విబి ఎంటర్టైన్మెంట్ వారి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్, శ్రీశ్రీ స్ఫూర్తితో రాసిన నవనాగ అనే కవితకు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం, వరుసగా ఏడుసార్లు ఉత్తమ న్యూస్ రీడర్ అవార్డ్ అందుకోవడంతో పాటు మొత్తం పదమూడు సార్లు ఈ అవార్డుకు ఎంపికవడం ద్వారా తానెంత ప్రతిభావంతుడో నిరూపించుకున్నారు, పట్టుపురుగుల పెంపకం పై 15 నిమిషాల నిడివితో తన మొదటి టెలీ ఫిలింను సెరీకల్చర్ డిపార్ట్మెంట్ వారికోసం రూపొందించారు, సురభి కళాకారుల పై తీసిన డాక్యుమెంటరీ, అడవి బాపిరాజు పై నిర్మించిన డాక్యుమెంటరీలకు రాష్ట ప్రభుత్వ నంది పురస్కారాలు లభించాయి. మొదట్లో షరీఫ్ ని పట్టించుకోని తెలుగు బుల్లితెర అటు తర్వాత ఆయనలోని ప్రతిభని గుర్తించింది. ఫిలిం మేకర్ అంటే ఇలాగే ఉండాలి. సీరియల్ అంటే ఇలాగే తీయాలి అన్న రీతిలో షరీఫ్ అనంతర సీరియళ్ల ద్వారా బలమైన, తిరుగులేని ముద్రనే వేశారు. ఒకప్పుడు బుల్లితెర చుట్టూ తిరిగిన ఆయన ఒకే ఒక్కడుగా బుల్లితెరనే తన చుట్టూ తిప్పుకున్నారు. ఎంతటి నటులైనా షరీఫ్ అడిగితే కాదనే పరిస్థితి కలిపించుకున్నారు. నటుల కెరీర్ ని మలుపు తిప్పే పాత్రలు తాను స్వయంగా సృష్టించి తెరపై రక్తి కట్టించారు. ఒక ఒరవడిలో కొట్టుకుపోతున్న బుల్లితెరను దారి మళ్లించి సరైన మార్గంలో చక్కటి బాట పట్టించారు. జనజీవితాలనే ఇతివృత్తాలుగా మార్చుకుని ఎలా తీయాలో.. ఎలా సక్సెస్ సాధించాలో కూడా నిరూపించారు. అలాంటి షరీఫ్ గురించి ఎంత చెప్పిన తక్కువే! తానే ఓ పరిశ్రమగా మారిన ఆయనతో ప్రతి ఒక్కరికీ ఎనలేని ఆత్మీయానుబంధం ఉంది. వివిధ వర్గాలకు చెందినవారందరికీ ఆయన తలలో నాలుకే! ఆయనకు ఊపిరి పోసిన పరిశ్రమకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ముందుండి దాన్ని పరిష్కరించే వరకూ ఊరుకోని , ఊరుకోలేని నైజం షరీఫ్ ది. ఆయనతో చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా నిర్మాతలంతా చేతులు కలిపారు. తను తీయబోయే కథకి నిర్మాత ఎవరన్నదానితో కాకుండా కథ ఎలాంటిదన్నదే షరీఫ్ ప్రతిభకు గీటురాయిగా ఉండేది. ఏ వ్యక్తయినా ఒకటి లేదా రెండు మహా అయితే మూడు రంగాల్లో ప్రావీణ్యం సంపాదించగలుగుతాడు. సృజనకు సంబంధించిన రంగాల్లో విశేషమైన ప్రతిభ ఉంటే తప్ప రచయితగా, నటుడిగా, దర్శకుడిగా , జర్నలిస్టుగా రాణించడం అందరినీ మెప్పించడం సాధ్యం కాదు. కానీ, షరీఫ్ అసాధ్యుడని నిరూపించుకున్నారు. ఉన్నత భావాలు కలిగిన షరీఫ్ జీవన నేపథ్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకం!
Attachments area