HomeTelugu"చోర్ బజార్" ఒక ఎంటర్ టైనింగ్, కమర్షియల్, కలర్ ఫుల్ ఫిల్మ్ - సీనియర్ నటి...

“చోర్ బజార్” ఒక ఎంటర్ టైనింగ్, కమర్షియల్, కలర్ ఫుల్ ఫిల్మ్ – సీనియర్ నటి అర్చన

పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత “చోర్ బజార్” చిత్రంతో తెలుగు తెరపై కనిపించబోతోంది నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తో పాటు చిత్ర విశేషాలను తెలిపారు అర్చన. ఆమె మాట్లాడుతూ..

నేను సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదీ లేదు. నేను చెన్నైలో ఉన్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రమన్నా రాలేకపోయేదాన్ని. ఎంపికగా సినిమాలు చేయడం నాకు అలవాటు. దక్కిన అవకాశాలు, చేసిన సినిమాల పట్ల సంతృప్తి పడ్డాను. ఒక దశలో సినిమాల్లో మహిళలకు సరైన పాత్రలు లేకుండా పోయాయి. అలాంటప్పుడు సినిమాల్లో నటించి ఏం ఉపయోగం. నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. అందుకు వాళ్లూ శ్రమించారు. ఆఫ్ బీట్ సినిమాలు తప్ప పారలల్ సినిమా మన దగ్గర లేదు. ఒక 300 సినిమాల్లో హీరోయిన్ గా చేయాల్సిన తారకు ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపు నాకు భారతీయ సినిమా, నా దర్శకులు ఇచ్చారు. వాళ్లు నాకిచ్చిన ఈ గౌరవాన్ని పాడు చేసుకోవడానికి కూడా నాకు హక్కు లేదు. తమిళం, కన్నడ, మలయాళంలో ఎప్పుడైనా ఒక ఆర్ట్ ఫిలింలో అవకాశం వస్తే నటిస్తూనే ఉన్నాను. తెలుగులో మాత్రమే నటించలేదు. అయితే ఇక్కడ నుంచి అవకాశాలు రాక కాదు. ప్రతి నెలా కనీసం రెండు సినిమాలకు నన్ను నటించమని అడుగుతుంటారు. వాటి పేర్లు చెప్పను కానీ పేరున్న హీరోల సినిమా అవకాశాలూ వస్తుంటాయి. నాకెందుకో ఆ పాత్రల్లో నటించాలని అనిపించలేదు. గతంలో కూడా నేను వద్దనుకున్న సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్స్ ఉన్నారు.

గతంలో హీరో సరసన నటించిన ఒక హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకు సోదరి, వదిన అవుతుంది, తల్లి, అత్త అవుతుంది. 40 ఏళ్లు దాటిన హీరోయిన్ కు ఇంతకంటే అవకాశాలు రావడం లేదు. మన సినిమాల్లో 80 శాతం మహిళా పాత్రలకు సినిమాల్లో ప్రాధాన్యత ఉండటం లేదు. 20 శాతం ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మహిళ తల్లి, వదిన, అత్త పాత్రల్లో మిగిలిపోవాల్సిందేనా, వాళ్లకు సొంత ఆలోచనలు, కోరికలు, లక్ష్యాలు ఉండవా. ఈ కోణంలో సినిమాల్లో క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. బెంగాళీ కంటే మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. అక్కడ ఇంకా నా వయసు వాళ్లు లవ్ స్టోరీస్ లో నటిస్తున్నారు. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు.

జార్జ్ రెడ్డి సినిమా చూశాక దర్శకుడు జీవన్ రెడ్డి ఒక బోల్డ్ అటెంప్ట్ చేశాడని అనిపించింది. విమర్శలు వస్తాయని కూడా భయపడకుండా ఒక కమిట్ మెంట్ తో సినిమా చేశాడు. విద్యార్థి నాయకుడి కథను తెరకెక్కించాడు. అందులో అన్ని అంశాలు ఉంటాయి. టెక్నికల్ గా ఆ సినిమాను రూపొందించిన విధానం నన్ను ఆకట్టుకుంది. ఈ మధ్య సినిమాల్లో సాంకేతికత పెరిగింది. అయితే ఆ అడ్వాంటేజ్ ను జీవన్ ఉపయోగించుకుండా, దర్శకుడి కోణాన్ని మాత్రం తెరపై చూపించాడు. చోర్ బజార్ సినిమా కోసం ఆయన నన్ను సంప్రదించినప్పుడు నువ్వు చేసిన జార్జ్ రెడ్డి సినిమా బాగుంది. అయితే నాకు ఇప్పుడు సినిమాలు చేసే ఆసక్తి లేదని చెప్పా. మీరు కనీసం రెండు సినిమాలైనా చేయాలని ఇటీవల యువ దర్శకులు కొందరు నాతో అన్నారు అది గుర్తొచ్చి. నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నేను ఎవరికి తల్లి, ఎవరికి వదిన, ఎవరికి అత్త అని అడిగాను. మీరు ఎవరికీ ఏదీ కాదు, ఒక తల్లి, మీ పాత్రకు సొంత వ్యక్తిత్వం, మీకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. ఆ మాటతో ఆలోచనలో పడ్డాను. ఒక లైన్ చెప్పమంటే ఈ సినిమాలో మీరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, ఆయన్ను ప్రేమిస్తారు. ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతారు అన్నాడు. ఇంకేమీ చెప్పకు షూటింగ్ ఎప్పుడని అడిగా. నిజంగా తమిళనాడులో ఎంజీఆర్ కోసం పెళ్లి చేసుకోని వారున్నారు. అలాగే అమితాబ్ కోసం ఒంటరిగా అలాగే ఉండిపోయినవారున్నారు. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న పాత్ర అనిపించింది.

అమితాబ్ బచ్చన్ అంటే ఆమెకు ఎంత ప్రేమంటే నిద్రపోయేప్పుడు కూడా మేకప్ వేసుకుని పడుకుంటుంది. కలలో అమితాబ్ వస్తే చూసి ఇష్టపడాలని. నాకు మేకప్ ఇష్టం లేదు కానీ ఈ క్యారెక్టర్ కోసం వేసుకున్నా. కథతో పాటు ఈ పాత్ర సాగుతుంటుంది. కొంత సస్పెన్స్ కూడా ఉంటుంది. హీరో పేరు బచ్చన్ సాబ్, మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. రెండు నిమిషాలు టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను.

చోర్ బజార్ ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్, కలర్ ఫుల్ ఫిల్మ్. అందుకే ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటించాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటకొచ్చి నటించాను.

అర్చన అంటే నెక్ట్ డోర్ వుమెన్ అనే ఇమేజ్ ఉంది. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. నా వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. ఎస్పీ బాలు లాంటి వారు చనిపోయినప్పుడు, కోవిడ్ తో జనం గుంపులుగా మరణించినప్పుడు మాత్రం మనసుకు చాలా బాధేసింది. వెబ్ సిరీస్ లకు అడుగుతున్నారు. ఒక కథ బాగుంది, ఆ వెబ్ సిరీస్ లో నటిస్తాను. తమిళ, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES