*రివ్యూ: అమ్మాయంటే అలుసా..*

1492

కరోనా లాక్‌డౌన్‌తో ఎక్కడి థియేటర్లు అక్కడ మూత పడటంతో రెడీ అయిన సినిమాలను విడుదల చేసేందుకు కొందరు దర్శకనిర్మాతలు డిజిటల్ బాట పడితే.. ఎలాగైనా తమ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని కొందరు థియేటర్లు తెరిచేవరకు వెయిట్ చేస్తూ వచ్చారు. ఇక అన్‌లాక్ ప్రకటించి.. 50 శాతం ఆక్యూపెన్సీతో కరోనా పట్ల జాగ్రత్తలు పాటిస్తూ.. థియేటర్లను రన్ చేసుకునేందుకు అనుమతులు రావడంతో.. ఒక్కొక్కటిగా థియేటర్స్‌లోకి సినిమాలు దిగుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ‘అమ్మాయంటే అలుసా’ అంటూ నేనే శేఖర్ హీరోగా నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం కూడా థియేటర్లలోకి వచ్చింది. నేడు ఎక్కడ చూసినా.. ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. అమ్మాయిలపై కామాంధులు తెగబడి.. వారి మాన, ప్రాణాలు తీసేస్తున్నారు. అలాంటి కామంధులకు అమ్మాయిలు ఎలా బుద్దిచెప్పారు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ

ఎవరికి పుట్టాడో తెలియని హీరో బొంకు(నేనే శేఖర్).. పచ్చి తాగుబోతులా మారి.. కనిపించిన ఆడవారిని లోబరుచుకుంటూ, అందరితో గొడవలు పడుతూ.. తిరుగుతుంటాడు. ఇలాంటి హీరోని ఓ అమ్మాయి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది(నమ్ముతుంది). ఇలా అనాథలా బతుకుతున్న బొంకుకి అనుకోకుండా కోట్లలో డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుతో ఓ సీరియల్ స్టార్‌తో గ్రాండ్‌గా సీరియల్ నిర్మించేందుకు రెడీ అవుతాడు. అంతేకాకుండా ఎమ్మెల్యే కూడా అవ్వాలని అనుకుంటాడు. అయితే ఈ బొంకు, ఆ సీరియల్ స్టార్ ఇద్దరు కలిసి ఇద్దరు అమ్మాయిల్ని బలవంతంగా లోబరుచుకుని.. చంపేస్తారు. చనిపోయిన ఆ ఇద్దరూ ఎవరు? చనిపోయిన వారు బతికున్న వారికి ఎలా గుణపాఠం నేర్పి.. ఆడవాళ్ల గొప్పతనం తెలియజేశారు? బొంకు ఎమ్మెల్యే అయ్యాడా?.. వంటివి తెలుసుకోవాలంటే ‘అమ్మాయంటే అలుసా’ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
ఈ సినిమాకి దర్శక హీరో నేనే శేఖర్ అన్నీ తానై.. సినిమాని తన భుజస్కంధాలపై మోశాడు. నేడు జులాయిలుగా తిరిగేవారు ఎలా ఉంటారో అచ్చుగుద్దినట్లుగా అలాగే నటించాడు నేనే శేఖర్. ఇలాంటి వెధవలు కూడా ఉంటారా? అనిపించేంతగా తన నటనతో మెప్పించాడు. డ్యాన్సులు, డైలాగ్స్ కూడా బాగా పలికాడు. నటనపై ఇంకాస్త దృష్టిపెడితే అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక సినిమాలో సీరియల్ హీరోగా చేసిన డైమండ్ బాబు నటన విషయంలో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. తను ప్రేమించే వాడు పెద్ద జులాయి అని తెలిసినా.. అతనే కావాలనుకునే పాత్రలో స్వాతి బాగా చేసింది. ఆమె పాత్రని ఇంకా హైలెట్ చేయవచ్చు. డైమండ్ బాబు భార్యగా చేసిన నటి కూడా పరవాలేదనిపిస్తుంది. మిగతా నటీనటులందరూ తమ పరిధిమేర నటించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
బడ్జెట్ పరిధిమేర సాంకేతిక నిపుణులు తమ పనితనాన్ని చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. జర్క్‌లు ఎక్కువగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు అంతగా అంటే ఓ.. అనేంతగా అయితే లేవు. ఓకే.. అనేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ఓకేతో సరిపెట్టుకోవాలి. మిగతా డిపార్ట్‌మెంట్‌ల వర్క్ కూడా అదిరింది అనే రేంజ్‌లో అయితే లేదు కానీ.. పరవాలేదు అని చెప్పుకోవచ్చు. ఇక కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం, హీరో.. ఇలా బాధ్యతలన్నీ తీసుకున్న నేనే శేఖర్‌లో తపన అయితే ఉంది కానీ.. అన్ని డిపార్ట్‌మెంట్‌ల మీద గ్రిప్ మాత్రం ఇంకా సాధించాలి.

విశ్లేషణ:
కాన్సెప్ట్ పరంగా చూస్తే.. ఇది కరెంట్ ట్రెండ్‌కి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్టే. కానీ కథ నడిచిన తీరు అంతగా ఆకట్టుకోలేదు. నేడు అమ్మాయిలు ఎలా మోసపోతున్నారో.. కొందరు కామాంధులు వారిని ఎలా నాశనం చేస్తున్నారో.. ఈ సినిమాలో బాగా చూపించారు. అలాగే అమ్మాయిలు కామాంధులకు బుద్ధి చెప్పే విధానాన్ని హిలేరియస్ కామెడీ ట్రాక్‌తో నింపాలని దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా.. ఒక జులాయి చేసే తాగుబోతు వేషాలు, ఆంటీలతో పక్కపంచుకునే సన్నివేశాలు, పబ్లిక్‌తో గొడవలు వంటి వాటితో సాగినా.. ఇంటర్వెల్‌కి సెకండాఫ్‌లో ఏదో ఉంటుంది అనేలా అయితే దర్శకుడు చేయగలిగాడు. ఇక సెకండాఫ్‌లో కామాంధుల చేతిలో చనిపోయిన మహిళలు.. వారికి బుద్ది చెప్పేందుకు చేసిన జంబలకిడిపంబ సీన్లు.. కొత్తగా అనిపించకపోయినా.. అమ్మో.. ఇలా జరిగితే.. అనేలా అనిపించగలిగాయి. కాకపోతే.. ఇంత సినిమాలో.. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా.. పోలీస్ అనే వాడే కనిపించకపోవడం కథలో లోపమో.. లేక దర్శకత్వ లోపమో వారికే తెలియాలి. ఒక బర్నింగ్ ప్రాబ్లమ్‌ని.. ఎంటర్‌టైన్ చేస్తూ.. సొల్యూషన్ చెప్పాలని నేనే శేఖర్ చేసిన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రం ఆడవారికి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్‌లైన్: ఫస్టాఫ్ పిచ్చ.. సెకండాఫ్ రచ్చ రేటింగ్: 3/5

PRO ; VEERA BABU