HomeTeluguతెలుగు ఖ్యాతిని పెంపొందించిన మహోన్నత వ్యక్తి పైడి జయ రాజ్ : తెలంగాణ మంత్రి శ్రీనివాస్...

తెలుగు ఖ్యాతిని పెంపొందించిన మహోన్నత వ్యక్తి పైడి జయ రాజ్ : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

బాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు పైడి జయ రాజ్. తెలంగాణ ప్రాంతం నుండి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్ లో నిలదొక్కుకున్న నటుడు. సెప్టెంబర్ 28న అయన 112వ జన్మదినం సందర్బంగా జయంతి వేడుకలు మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ నటుడు జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైడి జయ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ .. పైడి జయరాజ్ తెలంగాణ నటుడు. అప్పట్లో అందరు సినిమాల్లో రాణించాలని మద్రాసు వెళితే మన జైరాజ్ మాత్రం ముంబై రైలు ఎక్కి ముంబై చేరుకొని అక్కడ సినిమాల్లో ప్రయత్నాలు సాగించారు. . నిజానికి అది ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది. కానీ చేయలేదు. ఇప్పటికైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ వేడుకలను నిర్వహిస్తున్న జైహింద్ గౌడ్ అండ్ వాళ్ళ టీం ని అభినందిస్తున్నాను అన్నారు.

నటుడు జైహింద్ గౌడ్ మాట్లాడుతూ … తెలంగాణకు చెందిన పైడి జైరాజ్ గారు గొప్ప నటుడు. అయన 1980 లోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి తెలుగు పరిశ్రమ మరచిపోయింది. అయన జయంతి వేడుకలు కూడా ఇక్కడ చేయడం లేదని తెలిసి నేను 2010 నుండి అయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. కనీసం అయన ఫోటో ఛాంబర్ లో పెట్టడానికి కూడా మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు జైరాజ్ గురించి తెలిసి అందరు సహకారం అందిస్తున్నారు. జైరాజ్ అప్పట్లోనే అంటే మూకీల సమయంలోనే హీరోగా ఎదిగిన వ్యక్తి. అయన జీవితం మనందరికీ ఆదర్శం. అలాంటి మహనీయుడిని మనం మరచిపోకూడదు . అయన జయంతి వేడుకలు ఇంకా గ్రాండ్ గా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి నా విన్నపం ఏమిటంటే ఫిలిం ఛాంబర్ ఆవరణలో, లేదా ఫిలిం నగర్ లో పైడి జైరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రిగారికి ఈ సందర్బంగా కోరుకుంటున్నాను అన్నారు.

దెయ్యలున్నాయ చిత్ర దర్శకుడు కంకనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… పైడి జయ రాజ్ లాంటి గొప్ప నటుడిని మరిచిపోకుండా జైహింద్ గౌడ్ గారు ప్రతి ఏటా ఆయన జయంతి వేడుకలు చేయడం నిజంగా గొప్ప విషయం అన్నారు.

ఈ కార్యక్రమంలో దెయ్యలున్నాయా హీరోయిన్ ప్రియాంక తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని వారి సందేశాలు అందచేశారు.

పైడి జైరాజ్ గురించి .. క్లుప్తంగా ..

పైడి జైరాజ్ సెప్టెంబరు 28, 1909 న జన్మించారు. భారత చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ప్రాంతం కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. పైడి జైరాజ్ 156 కు పైగా చిత్రాలలో కథానాయకుడి పాత్రలతోపాటు మొత్తం 300 పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై ఆసక్తితో 1929లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా ” స్పార్క్లింగ్ యూత్ ” అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో ” ట్రయంఫ్ ఆఫ్ లవ్ ” అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు.

1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన ” షికారి ” ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ లతో నటించారు. సుమారు 156 ‘టాకీ’ సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా 1962, ఫిబ్రవరి 24న విడుదలైంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే హిందీ సినిమా తెలుగులోకి అనువాదం చేయబడింది.

నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ‘ సాగర్ ‘ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. పైడి జైరాజ్ తెలుగు వాడైనప్పటికీ కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు. జైరాజ్ భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసి గౌరవించింది. పైడి జయరాజ్ కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. అయన 2000 సంవత్సరం ఆగష్టు 11న పరమపదించారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES