HomeTeluguజర్నలిస్ట్ అబ్దుల్ కు 'స్టార్స్ ఆఫ్ కోవిడ్' అంతర్జాతీయ పురస్కారం

జర్నలిస్ట్ అబ్దుల్ కు ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ అంతర్జాతీయ పురస్కారం

జాతి, మతం లేదా జాతీయతతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవులందరిలో శాంతి, సామరస్యం నెలకొల్పి ఒకే కుటుంబంలా జీవించేందుకు వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ (డబ్ల్యూ హెచ్ డి) ఇంటర్నేషనల్ చేస్తున్న కృషి మరువలేనిది. అందులో భాగంగానే ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ అవార్డులను కూడా నెలకొల్పింది. మానవతా విపత్తులను నివారించడం, విపత్తుల బారినపడిన వారికి మద్దతు ఇవ్వడంతో పాటు, వారికి ఉపశమనం అందించడం, ఆరోగ్య రక్షణకు అన్నివిధాలుగా సహకరించడం ఈ వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ ఉద్దేశ్యం. తాజాగా ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఆ వైరస్ బారిన పడకుండా సూచనలు ఇవ్వడంతోపాటు, పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ వారిని చైతన్య వంతులను చేసే క్రమంలో ఈ మూడు నెలల కాలంలో తెలంగాణలోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో దాదాపు రెండు వేల కుటుంబాలను ఆదుకోవడంలో జర్నలిస్టుగా అబ్దుల్ చేసిన కృషి మరువలేనిది. ఈ కృషిని గుర్తించిన వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నంది, నేషనల్ అవార్డుల గ్రహీత ఎం.డి అబ్దుల్ కు ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ ఇంటర్ నేషనల్ అవార్డు ప్రకటించింది. లండన్ నుంచి ఈనెల 28న జరిగిన కార్యక్రమంలో ఈ ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ అవార్డుల ఫలితాలను ప్రకటించారు. ఆన్ లైన్ లో వివిధ దేశాలకు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్న ఈ ఉత్సవంలో ఇండియా విభాగంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఎం.డి అబ్దుల్ పేరు చోటు చేసుకోవడం గమనార్హం. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను అబ్దుల్ ఆన్ లైన్ ద్వారా అందుకున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన అబ్దుల్ ను ప్రశంసిస్తూ సంస్థ ముఖ్యులు తమ అమూల్య సందేశాలను పంపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నేపాల్ మాజీ ప్రధాని మాధవ్ కుమార్ సైతం అబ్దుల్ ను ప్రశంసిస్తూ తన సంతకంతో కూడిన సందేశాన్ని అందజేశారు. కోవిడ్-19 వల్ల ఇంటికే పరిమితమైన కుటుంబాలకు నిత్యావసరాలు సమకూర్చడం, కోవిడ్ సేవల్లో వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంలో అబ్దుల్ మానవతా ధృక్పథంతో అడుగులు ముందుకేయడం ప్రశంసనీయమని వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ ఫౌండర్ చైర్మన్ డా. అబ్దుల్ బాసిత్ సయ్యద్ ఈ మేరకు తమ సందేశాన్ని అందజేశారు. కరోనా కాలంలో ప్రజలను చైతన్యం చేసే క్రమంలో ఓ జర్నలిస్టుగా మానవతా ధృక్పథంతో నేను చేసిన సేవలను గుర్తించి నన్ను ప్రోత్చహించిన డబ్ల్యూ.హెచ్.డికి ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ అవార్డు గ్రహీత అబ్దుల్ కృతజ్ఞతలు తెలిపారు. అబ్దుల్ ప్రస్తుతం ఆంధ్రభూమి దినపత్రికలో చీఫ్-సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .దక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ యూనియన్ కు ఆర్గనైజింగ్ సెక్రటరీగానూ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా జర్నలిస్ట్ గా తన కెరీర్ కు పునాది వేసిన ఆంధ్రభూమి ‘వెన్నెల’ లో గడిచిన రెండున్నర దశాబ్దాలుగా చిత్ర సమీక్షలు, సినిమా రంగంపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆంధ్రభూమి ‘వెన్నెల’ సినిమా అనుబంధం ఇంఛార్జిగా, చిత్ర విశ్లేషకుడిగా అబ్దుల్ అందించిన సేవలు మరచిపోలేనివి. ఆ విశ్లేషణలకు గుర్తింపుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ సినీ విమర్శకుడిగా 2004లో నంది అవార్డు ను ప్రకటించింది. బుధవారం 26, అక్టోబర్ 2005 లో హైద్రాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఎంతో కన్నుల పండువగా జరిగిన ఈ ‘2004 చలన చిత్ర నంది బహుమతుల ప్రధానోత్సవం’లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సినీ విమర్శకుడిగా అబ్దుల్ ‘నంది’ అవార్డును అందుకున్నారు. ‘ఈ నంది అవార్డు నా జీవిత లక్ష్యం’ అని ఆ సమయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, ప్రఖ్యాత దర్శకుడు డా. దాసరి నారాయణరావుతో అబ్దుల్ చెప్పడం గమనార్హం. ముఖ్యంగా ‘దక్కన్ క్రానికల్-ఆంధ్రభూమి’ సంస్థలకు తమ 75 ఏళ్ల చరిత్రలో వచ్చిన తొలి నంది అవార్డు అబ్దుల్ దే కావడం విశేషం. జర్నలిస్ట్ అబ్దుల్ కు ‘స్టార్స్ ఆఫ్ కోవిడ్’ అవార్డు లభించడం పట్ల ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్సులు శ్రీగిరి విజయకుమార్ రెడ్డి, రాజమౌళి చారి, దక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ భీమ్ రాజ్, ‘కల’ సంపాదకులు ఎస్. కె రఫీ, ఆరాధనా వ్యవస్థాపక అధ్యక్షులు లోకం కృష్ణయ్య తదితరులు అభినందనలు అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నో ఉన్నతమైన అవార్డులను అందుకోవాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES