దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ తెలుగు ప్రేక్షకులకు అడ్వాన్స్‌గా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇది నాకు నోస్టాలజిక్ డే. ఎందుకంటే ‘ఆది’ సినిమా సమయంలో దిల్ రాజుగారితో, శిరీష్‌గారితో అసోషియేషన్ ఏర్పడింది. మా శిరీషన్న కొడుకు, సోదర సమానుడు ఆశిష్‌తో అప్పటి వరకు పరిచయం లేదు. ఇప్పుడు తను రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తన సినిమా ట్రైలర్‌ను నేను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రాజుగారితో, శిరీష్‌గారితో ఉండే జర్నీని గుర్తు చేసుకున్నట్లు అయ్యింది. రౌడీ బాయ్స్ ట్రైలర్‌ను లాంచ్ చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్‌కి, డైరెక్టర్ శ్రీహర్షకి అభినందనలు. ఆశిష్ గురించి మాట్లాడితే మా ఇంట్లో వ్యక్తి గురించి నేను మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి మంచి చిత్రాల్లో తను భాగం కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. రౌడీ బాయ్స్ సినిమా ఘన విజయం సాధించాలని కోవిడ్ సమయంలో విడుదలవుతున్న రౌడీ బాయ్స్ మంచి చిత్రంగా మనకు గుర్తుండిపోవాలనుని కోరుకుంటున్నాను. ప్రేమ దేశం చూసిన ఎగ్జయిట్‌మెంట్ వచ్చింది. నాకే కాదు. మీ అందరికీ కూడా అలాంటి ఎగ్జయిట్‌మెంట్ కలుగుతుందని మనసారా నమ్ముతున్నాను. వైవిధ్యమైన సినిమాలను, మంచి సినిమలను ఆదరించే మన తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారనే నమ్మకం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాను థియేటర్స్‌లోనే చూసి సినిమాకు ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘మా ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్‌ను విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలియజేసిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌గారికి థాంక్స్. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ‘రౌడీ బాయ్స్’ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. యూత్ సహా అన్ని వర్గాలకు నచ్చే ఎంటర్‌టైనర్ ఇది. విక్రమ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాను కూడా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.