అనుష్క 15 సంవ‌త్స‌రాల కెరీర్ ఈవెంట్‌లో

708

2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన ‘సూప‌ర్’ సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శ‌బ్దం’ ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైద‌రాబాద్‌లోఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌లో ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ, “తొలిసారి స్వీటీని చూడ‌టం ఒక ఎక్స్‌పీరియెన్స్‌. ‘శ్రీ‌రామ‌దాసు’ తీసేప్పుడు నాగార్జున గెస్ట్ హౌస్‌కు వెళ్లాను. ఆయ‌న ‘డైరెక్ట‌ర్‌గారూ స‌రైన టైమ్‌కు వ‌చ్చారు. మీకో కొత్త హీరోయిన్‌ను చూపించాలి’.. అని చెప్పి, ‘స్వీటీ’ అని పిలిచాడు. సెల్లార్ నుంచి మెట్లెక్కుతూ వ‌చ్చింది. మొద‌ట క‌ళ్లు, త‌ర్వాత ముఖం, ఆ త‌ర్వాత మ‌నిషి పైకి వ‌చ్చి నిల్చుంది. అప్పుడు ఆమెతో అన్నాను.. ‘నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావ్ స్వీటీ’ అని చెప్పాను.

నిర్మాత ఎం. శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ, “అనుష్క జీవితాన్ని మార్చేసిన సినిమా ‘అరుంధ‌తి’ అని అంద‌రూ అంటుంటారు కానీ, ఆ సినిమాతో నా జీవితాన్ని మార్చేసిన న‌టి తాను అని నేనంటాను. ఆ మాట‌కు నేను క‌ట్టుబ‌డి ఉంటాను. త‌న స్నేహితుల‌కు ఆమె ఆనందాన్ని క‌లిగిస్తుంది. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడ‌ల్లా ఆమె స్నేహితుల ద‌గ్గ‌ర ఉంటుంది. వాళ్ల బాధ‌లు వింటుంది. వాళ్ల ఆనందాన్నీ, విజ‌యాల్నీ సెల‌బ్రేట్ చేస్తుంది. ఆమె కుడిచేత్తో చేసే సాయం ఎడ‌మ చేతికి కూడా తెలీదు. ఆమె త‌న సొంత‌ కుటుంబాన్ని మొద‌లు పెట్టాల‌ని కోరుకుంటున్నా. ‘నిశ్శ‌బ్దం’ టీమ్‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నా” అన్నారు.

డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ, “ఈ బంగారుత‌ల్లి ‘సూప‌ర్’ సినిమా హీరోయిన్ కోసం బాంబే వెళ్లిన‌ప్పుడు దొరికింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి తీసుకెళ్లాను. నాగార్జున‌గారు త‌న‌ను చూడ‌గానే, ‘ఈ అమ్మాయ్ చాలా బాగుందే’ అన్నారు. ‘ఈ అమ్మాయికి ఆడిష‌న్ చేద్దాం సార్’ అన్నాను. ‘ఆడిష‌న్ ఏమీ అవ‌స‌రం లేదు, పెట్టేద్దాం’ అని ఆయ‌న‌న్నారు.

నిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ, “అనుష్క గురించి ఏం చెప్ప‌ను.. ‘సూప‌ర్’ సినిమా టైమ్‌లో ఒక అంద‌మైన అమ్మాయి అటూ ఇటూ న‌డుస్తుండ‌టం చూశాను. ఆ త‌ర్వాత త‌న‌తో కొన్ని సినిమాలు చేశాను. ఇండ‌స్ట్రీలో చాలామందిని క‌లుస్తుంటాం. చాలా మంచి మ‌నుషులు చాలా త‌క్కువ‌మంది ఉంటారు. బ‌హుశా హీరోయిన్ల‌లో అనుష్క లాంటి నైస్ ప‌ర్స‌న్ ఇంకొక‌రు ఉండ‌రు. నిజంగానే త‌ను స్వీట్ గాళ్‌, గుడ్ గాళ్‌, గొప్ప హృద‌యం ఉన్న అమ్మాయి. అలాంటి హృద‌యం ఉన్న‌వాళ్లు అరుదు. మున్ముందు ఆమె జీవితం మ‌రింత గొప్ప‌గా ఉండాల‌ని కోరుకుంటున్నా” అన్నారు.

చిత్ర‌ నిర్మాత టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, “నేనొక ప‌ది సినిమాల దాకా నిర్మించాను. ‘నిశ్శ‌బ్దం’ సినిమాతో అనుష్క‌తో స‌న్నిహితంగా ప‌నిచేసే అవ‌కాశం ల‌భించింది. అనుష్క మైల్ స్టోన్ ఈవెంట్ సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల చేస్తుండ‌టం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు, హాలీవుడ్ న‌టుల‌తో ఈ మూవీ డిఫ‌రెంట్‌గా ఉంటుంది” అన్నారు.

అనుష్క మాట్లాడుతూ, “సీనియ‌ర్స్ సాధించిన దానితో పోలిస్తే నేను సాధించింది చాలా త‌క్కువ‌. అయితే దీన్ని నేను ఓ బాధ్య‌త‌గా తీసుకొని ఇంకా హార్డ్‌వ‌ర్క్ చెయ్యాలి, ఇంకా మంచి స్క్రిప్ట్స్ చెయ్యాలనుకుంటాను. ‘సూప‌ర్‌’ నుంచి ‘నిశ్శ‌బ్దం’ వ‌ర‌కూ.. పూరి జ‌గ‌న్నాథ్ గారి నుంచి మొద‌లుకొని, ప్ర‌తి సినిమా డైరెక్ట‌ర్‌కూ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్పుడు సినిమాపై నా నాలెడ్జ్ ఎలా ఉండిందో పూరి జ‌గ‌న్నాథ్ గారికి తెలుసు. ప్ర‌తి సినిమా నాకొక మెట్టు. స‌హ న‌టులు, నిర్మాత‌, ప్ర‌తి యూనిట్ మెంబ‌ర్‌తో ఒక ప్ర‌యాణం చేస్తూ వ‌చ్చాను. మంచి, చెడు అనుభ‌వాల‌తో ఇక్క‌డి దాకా వ‌చ్చాను. ఈ ప‌దిహేనేళ్ల‌లో నాతో క‌లిసి ప‌నిచేసిన‌, ప్ర‌యాణించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా. ‘నిశ్శ‌బ్దం’ చిత్రం ఏప్రిల్ 2న వ‌స్తోంది. ఒక భిన్న‌మైన చిత్రం అందించాల‌ని మా వంతు ప్ర‌య‌త్నం చేశాం. దీనికి ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నా. ఇక్క‌డ‌కు వ‌చ్చి ఈ ఈవెంట్‌ను నాకు ప్ర‌త్యేక‌మైన‌దిగా మార్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్ అన్నారు. నిశ్శబ్దం సహనిర్మాత వివేక్ కూచి భొట్ల ఈ వేడుక ఆద్యంతం వైభవంగా జరగటానికి ఏర్పాట్లను గత కొన్నిరోజులుగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ వేడుక‌లో నిర్మాత పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కులు శ్రీ‌వాస్‌, వీరు పోట్ల కూడా మాట్లాడారు.